Andhra Attack Politics : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం క్రమంగా ఉద్రిక్తంగా మారుతోంది. వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ పై వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పాటు వరుసగా ట్వీట్లు పెట్టారు. ఓ బృందాన్ని గవర్నర్ వద్దకు పంపి ఫిర్యాదు చేయించారు. అయితే టీడీపీ నేతలు మాత్రం.. అవన్నీ వైసీపీలోని రెండు వర్గాల మధ్య జరుగుతున్న దాడులు, వైసీపీ నేతలు రెచ్చగొడితే జరుగుతున్న ఘర్షణలు తప్ప.. కౌంటింగ్ అనంతర  హింస కాదని అంటున్నారు. ఇప్పటికే కేర్ టేకర్ సీఎం జగన్మోహన్ రెడ్డే అనే  సంగతి మర్చిపోయి.. పోలీసు వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. 


ఇంకా టీడీపీ ప్రభుత్వం ఏర్పడలేదంటున్న నేతలు                           


చంద్రబాబు పన్నెండో తేదీన ప్రమాణ చేస్తారని.. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ క్యాడర్ కు సమాధానం చెప్పాలంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం.. ఇంకా ప్రమాణం చేయకుండానే పోలీసు వ్యవస్థను గుప్పిట పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని తాము ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదని అంటున్నారు. ఇలా అయితే తాము ప్రైవేట్ కేసులు వేస్తామని కొడాలి నాని హెచ్చరించారు.  పోలీసులను టీడీపీ రౌడీలు , రౌడీషీటర్లు బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్న టీడీపీ రౌడీలను ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు. మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడం లేదు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకొచ్చాడని పేర్నినాని ఆరోపించారు. 


కేసులు కూడా తీసుకోవడం లేదని.. ప్రైవేటు కేసులు  వేస్తామంటున్న కొడాలి నాని                                          


కృష్ణా జిల్లాలో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని  పేర్ని  నాని, కొడాలి నాని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రౌడీలు సీఐలు,డీఎస్పీలు , ఎస్పీలు  మీటింగ్ పెట్టుకుంటే మా నాయకులను రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.  దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉంటే.. మేం కూడా తిరగబడక తప్పదని హెచ్చరించారు.  చంద్రబాబు చేయిస్తున్న దౌర్జన్యాల పై చర్యలు తీసుకోనందుకు కోర్టుకు వెళ్తామని రెండు రోజుల్లో జిల్లా ఎస్పీని మా నాయకులమంతా కలుస్తామని ప్రకటించారు. 


గొడవల్ని అణిచి  వేస్తున్న సీఆర్పీఎఫ్                                    


వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంలో అవి రాజకీయ పరమైన దాడులు కాదని అంటున్నారు. వల్లభనేని వంశీ ఇంటిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే సమర్థంగా అడ్డుకున్నామని.. చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ...దాడులపై ఎక్కువగా ఆరోపణలు చేస్తూండటం రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది.