Kukatpalli YSRCP: వైఎస్ఆర్‌సీపీ తెలంగాణలో రాజకీయాలు చేస్తోంది. అయితే తెలంగాణ మొత్తం కాదు. హైదరాబాద్‌లోనే. అంటే.. హైదరాబాద్ మొత్తం కూడా కాదు. కూకట్ పల్లిలో మాత్రమే .. ఇంకా చెప్పాలంటే.. కూకట్ పల్లిలో ఓ ఏరియాలో మాత్రమే వైసీపీ రాజకీయాలు చేస్తోంది. వైఎస్ఆర్ విగ్రహం ఉన్న చోట తరచూ ధర్నాలు చేస్తున్నారు. సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అక్కడ ధర్నాలు చేసేది.. సంతకాలు సేకరించేది తెలంగాణ రాజకీయాల కోసం కాదు.. ఏపీ రాజకీయాల గురించే. కాస్త విచిత్రంగా ఉన్నా వైసీపీ.. ఏపీ రాజకీయాలను హైదరాబాద్‌లో చేస్తోందని అర్థం చేసుకోవచ్చు.
పిన్నెల్లి అరెస్టుకు నిరసనగా కూకట్‌పల్లిలో శ్యామల ఆధ్వర్యంలో ధర్నా
ఈ ఆదివారం కేపీహెచ్‌బీలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ అధికార ప్రతినిధి షర్మిల, కారుమూరి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. మరికొంత మంది కలిసి ధర్నా చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని.. అన్యాయంగా జైలుకు పంపుతోందని .. వెంటనే విడుదల చేయాలని ఈ ధర్నా చేశారు. పిన్నెల్లి అరెస్టుకు..కూకట్ పల్లికి సంబంధం లేదు కానీ.. వైసీపీ నేతలు అక్కడ ధర్నా చేసేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో సంతకాల సేకరణ
అంతకు ముందే అదే ప్రాంతంలో ఏపీలో వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించారు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కోటి సంతకాలను వైసీపీ సేకరించింది. ఏపీతో పాటు హైదరాబాద్ లోనూ ఈ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు. అప్పుడే చాలా మంది ఏపీలో రాజకీయానికి తెలంగాణలో సంతకాలు సేకరించడం ఏమిటని సెటైర్లు వేశారు. ఇప్పుడు పిన్నెల్లిని అరెస్టు చేయడంతో మరోసారి ఆయన కోసం అక్కడే ధర్నా చేశారు.
ఏపీ అంశాలపై కూకట్ పల్లిలో ధర్నాలు చేస్తే ఏమి వస్తుంది ?
అయితే వైసీపీ నేతల తీరు మాత్రం కొంత మందికి విచిత్రంగా ఉంది. ఏపీ రాజకీయాల కోసం కూకట్ పల్లిలో వైసీపీ బ్రాంచ్ ను ప్రారంభించారని సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామలతో పాటు కారుమూరి వెంకటరెడ్డి, మరికొంత మంది వైసీపీ నేతలు కూకట్ పల్లిలో నివాసం ఉంటారు. వారు ప్రతి దానికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి ధర్నా చేయడం సమయం వృధా అని.. కూకట్ పల్లిలోనే వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నాలు చేసి.. సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. అందుకే .. కూకట్ పల్లిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతున్నారు. షార్ట్ కట్ రాజకీయాలు అంటే ఇవేనని.. వారి తీరు నచ్చని వారు సెటైర్లు వేస్తున్నారు.