What is Komatireddy Brothers Future :    మునుగోడు ఉపఎన్నికల ఫలితం వచ్చింది. రాజగోపాల్ రెడ్డి ఆదివారం మెల్బోర్న్ వెళ్లిపోతున్నారు. ఓటమి బాధ నుంచి బయటపడటానికి అక్కడ సముద్ర తీరాల్లో విశ్రాంతి తీసుకోవడానికివెళ్తున్నారని ఓటింగ్ ముందు నుంచే ప్రచారం జరిగింది.ఇప్పుడు అది నిజమైంది. ఎంత గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆయనకు విజయం దక్కలేదు. ఆదివారం ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు.. అప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటి ? తమ్ముడి కోసం కాంగ్రెస్ కు దూరం అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏమిటి ?నల్లగొండ రాజకీయాల్లో కోమటిరెడ్ల హవా ముగిసినట్లేనా ?


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్ని రకాల నష్టాలే !


రాజపోగాల్ రెడ్డి పదవి కాలం ఏడాది ఉండగానే రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లోనే ఆయన చాలా ఖర్చు పెట్టుకుని పోటీ చేశారు. విజయం సాధించడంతో ఆ ఖర్చంతా పెద్ద భారం అవలేదు. కానీ ఆయన అధికార పార్టీలో లేరు. ఉన్న పార్టీలో ఉన్నట్లుగా లేరు. చివరికి నాలుగేళ్ల తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. 2018లో పెట్టిన దాని కంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్లీ పోటీ చేశారు.  ఓ రకంగా చెప్పాలంటే ఖర్చు పెట్టిన దాని కంటే.. పోలీసులు పట్టుకున్నదే ఎక్కువ. ఇప్పుడు పదవి పోయింది.. ఏడాది పదవీ కాలం పోగొట్టుకున్నట్లయింది. రెట్టింపు ఖర్చూ వృధా. అంతకు మించి బీజేపీలో  ఓ సాదాసీదా నేతగా మిగిలిపోవాల్సిన పరిస్థితి.  గెలిచిన వాళ్లే ఏ పార్టీలో అయనా మొనగాడు. ఇప్పుడు ఆయన బీజేపీ తరపున ఓ అసెంబ్లీ నియోజకవర్గపు నేతగానే మిగిలిపోతారు. అంతకు మించి ఆయనకు పలుకుబడి ఉండదు. 


తమ్ముడి గెలుస్తాడని ఊహించి కాంగ్రెస్‌ను తన్నేసుకున్న వెంకటరెడ్డి !


ఇక సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా.. ఆయన మనసు రాజగోపాల్ రెడ్డి కోసమే పని చేసింది.  కాంగ్రెస్‌కు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒకే రోజు ఇద్దరూ అమిత్ షాను కలిశారు. అంటే.. ఇద్దరూ పార్టీలో చేరిపోయినట్లేనని అప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. మునుగోడులో సోదరుడు గెలిస్తే వెంటనే చేరిపోవాలనుకున్నారు. అందుకే బీజేపీకి శక్తిమేర .. తెర వెనుక సాయం చేశారు. మునుగోడులోని తన వర్గీయులందరికీ..  కాంగ్రెస్ వాళ్లకి.. తన సోదరుడికే ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఆడియో వీడియోలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ ఆడియా, వీడియోలు తనవి కాని కోమటిరెడ్డి సమాధానం ఇచ్చుకున్నారు. కానీ అసలు నిజమేంటో అందరికీ తెలుసు. అందుకే ఆయనకు ఇక కాంగ్రెస్‌లో భవిష్యత్‌ ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడు అన్న కోమటిరెడ్డికి కూడా బీజేపీ తప్ప మరో ఆప్షన్ లే్దు. 


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి హవాకు బ్రేక్ - స్వయం తప్పిదమే !


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు ఉన్నప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పట్టు ఎక్కువగా ఉండేది. వైఎస్ టైంలో వీరినే ప్రోత్సహించడం దానికి కారణం . కానీ ఇప్పుడు వారు చేజేతులా తమ రాజకీయ భవిష్యత్‌ను పరిమితం చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్‌కు కంచుకోట. ఇప్పుడు వీరు బీజేపీలోకి వెళ్తే.. వారి వెంట క్యాడర్ నడవడం కష్టమే. కానీ వీరికి వెంటనే కాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయ నేతలు తయారైపోతారు.  ఇంత కాలం ఎదుగనీయలేదని అసంతృప్తి ఉన్నవారు తమ ప్రతాపం చూపిస్తారు. అదే సమయంలో కాంగ్రెస్‌లో వీరికి ఉన్నంత పలుకుబడి బీజేపీలో ఉండదు. వీరు నియోజకవర్గాలకే పరిమితమవుతారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ స్థాయిలో పోటీ పడి.. ఈ ఒక్క ఉపఎన్నికతో వారు నియోజకవర్గ నేతలుగా మారిపోపోయినట్లయింది. 


రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని చెబుతూ ఉంటారు. ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు తొందరపడి.. బీజేపీలో చేరి తెచ్చుకున్న ఓ ఉపఎన్నిక  ద్వారా కోమటిరెడ్డి సోదరుల రాజకీయ భవిష్యత్‌కు అలాంటి ముప్పేవచ్చిందన్న అభిప్రాయం సహజంగానే కలుగుతుంది.