YSRCP Wrong Step ON Sharmila: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్‌తో విబేధించిన షర్మిల కొన్నాళ్ల కిందట కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఏపీ బాధ్యతలను చేపట్టారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాజకీయంగా ఆమె ఫుల్‌ యాక్టివ్‌ అయ్యారు. జిల్లాలు వారీగా పర్యటిస్తూ కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అధికార వైసీపీతోపాటు సీఎం జగన్మోహన్‌రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రోజులు కిందటి వరకు రాజకీయపరమైన విమర్శలకు పరిమితమైన షర్మిల.. తాజాగా కుటుంబపరమైన విమర్శలకు దిగిపోయారు. తన అన్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి, తనకు మధ్య ఉన్న గొడవ, దానికి కారణం ఎవరన్న విషయాలను మీడియా ముఖంగానే ఆమె వెల్లడిస్తున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవకు సంబంధించి షర్మిల మాట్లాడుతున్న సమయంలో కాస్త పరుష పదజాలాన్నే వాడుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను ఆగ్రహానికి గురి చేస్తోంది. షర్మిల చేసే రాజకీయ వ్యాఖ్యలకు అంతే ధీటుగా బదులిస్తున్న వైసీపీ నేతలు.. కుటుంబ పరంగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను ఖండించడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. షర్మిల రోజురోజుకూ దిగజారి వ్యాఖ్యానిస్తున్నారంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. 


వైసీపీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం.. 


వైఎస్‌ షర్మిల ప్రజల్లోకి వెళ్లి అధికార వైసీపీపై చేస్తున్న విమర్శలు కొంత వరకు అధికార పార్టీకి ఇబ్బందిగా పరిణమించే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజకీయ విమర్శలు చేసినప్పుడు.. అంతే ధీటుగా వైసీపీ నేతలు బదులిచ్చేవారు. కానీ, ఇప్పుడు షర్మిల కుటుంబపరమైన అంశాలను బయటకు తీసి ఆరోపణలు చేస్తుండడంతో వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. షర్మిల చేస్తున్న ఆరోపణలను ఖండించలేక, దానిపై మరింత గట్టిగా విమర్శలు చేయలేక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకరిద్దరు నేతలు బయటకు వచ్చిన షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సజ్జల, రోజా వంటి నేతలు వ్యాఖ్యలతో షర్మిల మరింతగా రెచ్చిపోతున్నారన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. షర్మిల రోజురోజుకూ చేసే తీవ్ర వ్యాఖ్యలు ఎన్నికలు ముందు పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముందని పలువురు భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు వల్ల ఇబ్బంది లేకపోయినా.. కుటుంబ వ్యవహారాలను బయటకు తెచ్చి ఆరోపణలు చేయడం వల్ల వైఎస్‌ కుటుంబ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఒకరకంగా జగన్మోహన్‌రెడ్డికి ఇబ్బందికరంగా పరిణమించే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 


కట్టడి సాధ్యపడుతుందా..?


కాంగ్రెస్‌ పార్టీ తరపున షర్మిల ప్రజల్లోకి జోరుగా వెళుతున్నారు. అధికార, ప్రతిపక్షాలపై ధీటైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో టికెట్లు రాని నేతలకు షర్మిల ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. ఆయా పార్టీల్లో సీట్ల పంపకాలు తేలిన తరువాత ఎంతో మంది నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లలో అయినా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీలో బరిలో దించే అవకాశం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలపై సమాన స్థాయిలో విమర్శలు చేస్తున్న షర్మిలను రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం వల్ల అది పార్టీకి ఇబ్బందిగా పరిణమిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. షర్మిల పూర్తిగా తెగించి బరిలోకి దిగిన నేపథ్యంలో ఆమెపై ఎంత తక్కువ విమర్శలు చేస్తే వైసీపీకి అంత మేలు కలుగుతుంది. షర్మిలకు ఽధీటుగా బదులివ్వడం ద్వారా కట్టడి చేయవచ్చని వైసీపీ నేతలు భావిస్తే మాత్రం స్వీయ తప్పిదంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై కోపంతో రగిలి పోతున్నారు. ఈ తరుణంలో ఆమెపై వైసీపీ నేతలు చేసే విమర్శలు ఆమెను మరింత రెచ్చగొట్టేందుకు కారణమవుతాయి. కాబట్టి, షర్మిల చేసే ఆరోపణలపై ఆచి, తూచి వ్యవహరించడం ద్వారా రాజకీయంగా కొంతైనా వైసీపీకి తగిలే డ్యామేజీకి అడ్డుకట్ట వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఆ దిశగా వైసీపీ నాయకులు ఆలోచన చేస్తారా..? లేదా.