Will TVK contest in AP along with Congress:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి  విజయ్ నేతృత్వంలోని టీవీకే  అతిపెద్ద పార్టీగా అవతరించడం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఊహించని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఏపీ రాజకీయాలతో సంబంధం లేని విజయ్, ఇక్కడ ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు?  ఓ సామాజికవర్గం  ఆయనను ఎందుకు ఓన్ చేసుకుంటోంది ?  

Continues below advertisement

విజయ్ కోసం ఏపీలో రాజకీయ హడావుడి  ఆంధ్రప్రదేశ్‌లో విజయ్ చుట్టూ జరుగుతున్న చర్చల్లో ప్రధానమైంది ఆయన సామాజిక గుర్తింపు. విజయ్ తల్లి శోభమ్మ గారి మూలాలు ఏపీలో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే విజయ్ క్రైస్తవ మతానికి చెందడంతో .. చాలా మంది ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినవారనే ప్రచారం బలంగా చేస్తున్నారు.   దీనివల్ల దళిత ఓటు బ్యాంకులో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తోంది.  విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ క్రిస్టియన్ కావడంతో, ఏపీలోని క్రైస్తవ సమాజం  కూడా ఆయన వైపు మొగ్గు చూపుతోంది. ఏపీలో దాదాపు 15-20 శాతం వరకు ప్రభావం చూపగల క్రైస్తవ ఓటు బ్యాంకు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల పట్ల అసంతృప్తిగా ఉన్న సమయంలో విజయ్ వంటి గ్లామరస్ ,  క్రైస్తవ నేపథ్యం ఉన్న నాయకుడు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆయన ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే, ఈ వర్గం నుంచి ఆయనకు భారీ మద్దతు లభించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  

 కాంగ్రెస్ పొత్తు.. ఏపీలో హ్యాండ్  ఇస్తారా? 

Continues below advertisement

తమిళనాడులో విజయ్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మెజారిటీకి చేరువయ్యారు. ఇదే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో విజయ్ మద్దతు లేదా ఆయన క్రేజ్‌ను వాడుకుంటే, ఏపీలో కాంగ్రెస్ + విజయ్ కూటమి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా మారుతుందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా యువత , ఒక నిర్దిష్ట సామాజిక వర్గం కలిస్తే, అది ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ-జనసేనల ఓట్లకు గండి కొట్టడం ఖాయమని లెక్కలేస్తున్నారు. 

ఫ్లెక్సీల హోరు.. క్షేత్రస్థాయిలో ప్రకంపనలు! 

నెల్లూరు, చిత్తూరు, తిరుపతి,   కర్నూలు జిల్లాల్లో విజయ్ ఫోటోలతో వెలుస్తున్న ఫ్లెక్సీలు కేవలం అభిమానంతో వేసినవి కావని, వీటి వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నాయని  చెబుతున్నారు. సామాజికంగా బలంగా ఉన్న వర్గాలు తమ గొంతుకను వినిపించడానికి విజయ్‌ను ఒక  మాధ్యమం 'గా వాడుకుంటున్నాయి. స్థానిక నేతలు కూడా విజయ్ ఇమేజ్‌ను వాడుకుని తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని చూస్తున్నారు. విజయ్ ఏపీ రాజకీయాల్లోకి నేరుగా వస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ఆయన సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కులం, మతం,  సినిమా గ్లామర్ కలగలిసిన ఏపీ రాజకీయాల్లో విజయ్ ఒక  వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటివారు. ఆయన తమిళనాడులో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆ ప్రభావం 2029 ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.