Governor shocks Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. దళప విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికార పీఠం దక్కించుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ లేని కారణంగా విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ అధికారికంగా ప్రకటించింది.
రాజ్ భవన్‌లో ఏం జరిగింది? గవర్నర్ వాదన ఇదీ..
గురువారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్ మధ్య జరిగిన రెండో విడత భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ వద్ద లేదు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం ఏర్పాటుకు పిలవలేమని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మెజార్టీ సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖలు సమర్పించాలని గవర్నర్ స్పష్టం చేశారు.
లెక్కలు తేలలేదు: విజయ్ కూటమి ఎక్కడ ఆగింది?
ఎన్నికల ఫలితాల ప్రకారం విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ తన 5 సీట్ల మద్దతును ప్రకటించడంతో ఈ సంఖ్య 113 కి చేరింది. విజయ్ రెండు చోట్ల గెలిచినందున, ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు టీవీకే బలం 107 కి తగ్గుతుంది. కాంగ్రెస్‌తో కలిపి కూటమి బలం 112 వద్దే ఆగిపోతుంది. అధికారం దక్కించుకోవడానికి విజయ్‌కు ఇంకా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ అదనపు మద్దతు లేఖలు లేకపోవడంతోనే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
అసెంబ్లీలోనే తేల్చుకుంటామంటున్న టీవీకే
గవర్నర్ నిర్ణయంపై టీవీకే మద్దతుదారులతో పాటు వీసీకే, సీపీఐ వంటి పార్టీలు మండిపడుతున్నాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌ను ముందుగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలి. మెజార్టీని నిరూపించుకోవడానికి అసెంబ్లీ వేదికగా అవకాశం ఇవ్వాలి తప్ప, రాజ్ భవన్‌లో సంతకాలు అడగడం రాజ్యాంగ విరుద్ధం అని వారు వాదిస్తున్నారు. కేంద్రం జోక్యంతోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
తదుపరి అడుగు ఎటు?
దాదాపు 60 ఏళ్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ గట్టి దెబ్బ కొట్టినప్పటికీ, రాజ్యాంగపరమైన చిక్కులు ఆయనను వేధిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో డీఎంకే, ఏఐఏడీఎంకేలు కూడా ఈ అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకుని మళ్లీ చక్రం తిప్పాలని చూస్తున్నాయి. తమిళనాడు భవిష్యత్తు ఇప్పుడు ఆ 6 మంది ఎమ్మెల్యేల మద్దతు పైనే ఆధారపడి ఉంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను విజయ్ ఎప్పుడు సమర్పిస్తారో, అప్పుడే దళపతి సీఎం పీఠంపై సందిగ్ధత తొలగిపోతుంది. రాబోయే 48 గంటలు తమిళనాడు రాజకీయాలకు అత్యంత కీలకం!
