Trisha Political Entry Tamil Nadu:   తమిళనాడు రాజకీయాల్లో  తిరుచ్చి ఈస్ట్  నియోజకవర్గ ఉపఎన్నిక అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం   అధినేత, సీఎం  విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి స్టార్ హీరోయిన్  త్రిష కృష్ణన్ ను పోటీకి దింపాలంటూ త్రిష అభిమానులు, టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష హాజరైనప్పటి నుంచే ఆమె రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

Continues below advertisement

ఒకవేళ త్రిషకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదా తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశం నిజంగానే లేకపోతే తన పేరు, ఫ్యాన్స్ ఆధారంగా సాగుతున్న ఈ ప్రచారానికి ఆమె ఇప్పటికే స్పష్టత ఇచ్చి ఫుల్‌స్టాప్ పెట్టేవారన్న వాదన బలంగా వినిపిస్తోంది. కానీ మౌనం పాటిస్తూ, ఈ చర్చను మరింత ఊపందుకునేలా వదలడం వెనుక ఆమె వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అనే కోణంలో సినీ, రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోలు నెట్టింట మళ్లీ వైరల్ అవుతుండటం ఈ చర్చకు మరింత ఆజ్యం పోస్తోంది.                                              

మరోవైపు, తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై టీవీకేలోనూ భిన్న స్వరాలు, వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. కొందరు టీవీకే నేతలు, కార్యకర్తలు త్రిష అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతుండగా, మరికొందరు సలహాదారులు రాజ్యసభ మార్గం వైపు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో, పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడిన కార్యకర్తలకే ఆ సీటు దక్కాలంటూ రాఘవ లారెన్స్ వంటి వారు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేయడంతో తిరుచ్చి ఈస్ట్ సీటుపై దృష్టి మరింతగా త్రిష వైపే కేంద్రీకృతమైంది.

Continues below advertisement

విజయ్ సొంత నియోజకవర్గంగా నిలిచిన తిరుచ్చి ఈస్ట్‌లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీవీకేకు, సినీ గ్లామర్, పాపులారిటీతో పాటు బలమైన ప్రచార ఆకర్షణ కలిగిన అభ్యర్థి అవసరమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల ఎత్తుగడలకు దీటుగా, యువత, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు త్రిష బరిలోకి దిగితే ఉపఎన్నికలో వేరే స్థాయి హైప్ క్రియేట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.                          

అయితే, సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం కేవలం అభిమానుల ఉత్సాహమా లేక భవిష్యత్ రాజకీయ ప్రవేశానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే వ్యూహమా అనేది త్వరలోనే తేలనుంది. ఉపఎన్నిక షెడ్యూల్, అభ్యర్థుల ఖరారు ప్రక్రియ మొదలయ్యే సమయానికి టీవీకే అధిష్ఠానం, త్రిష ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తమిళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.