BRS Vs MIM :  తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం జరిగింది. వివిద అంశాలపై ప్రభుత్వ తీరుపై అక్బరుద్దీన్  ఓవైసీ విమర్శలు గుప్పించారు. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు, మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నదే ఏడుగురని, వారికి అధిక సమయం కేటాయించరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని కేటీఆర్ అన్నారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తమ పార్టీ అధినేత అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిపై తాను పార్టీ చీఫ్ తో మాట్లాడతానని వెల్లడించారు. ఏడుగురు కాదు కనీసం 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేలా చూస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈసారి మరింతమంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెడతామని సవాల్ చేసారు. దీంతో ఒక్క సారిగా రాజకీయం మారిపోయింది. 


బీఆర్ఎస్‌ కు ఎంఐఎంకు సన్నిహిత సంబంధాలు !


బీఆర్ఎస్‌కు మజ్లిస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధికారికంగా పొత్తు పెట్టుకోరు తప్ప.. అన్నివిధాలుగా సహకరించుకుంటారు.  గత ఎన్నికల్లో కేసీఆర్ కు మజ్లిస్ పరోక్ష సహకారం ఎంతో లబించింది. ఎనిమిది చోట్ల తప్ప మజ్లిస్ ఇతర చోట్ల పోటీ చేయలేదు. అన్ని చోట్లా బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని పరోక్షంగా తమ వర్గానికి సంకేతాలు పంపింది. దీంతో ముస్లిం వర్లం ఎక్కువ ఉన్న చోట్ల బీఆర్ఎస్ విజయం సులువు అయింది. అయితే ఇటీవలి కాలంలో తమ పార్టీని విస్తరించాలనుకుంటున్న మజ్లిస్... మరికొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధయింది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్,బోధన్, నిజామాబాద్ లాంటి చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టాలని నిర్ణయించుకుంది.  అయితే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలతో  ఆ సంఖ్య యాభైకి చేరుకుంది. యాభై చోట్ల పోటీ చేస్తే బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. 


జాతీయ స్థాయిలో విస్తరణకు చాలా కాలంగా ఓవైసీ ప్రయత్నాలు !


మజ్లిస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడానికి అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయన పోటీ చేస్తున్నారు.  ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోనూ ఆయన పట్టు పెంచుకోవాలని చూడకుండా ఉండరు. రాజకీయాల్లో ఎవరికైనా అంతిమ లక్ష్యం తాము బలపడటమే. పరస్పర ప్రయోజనాలు ఉన్నప్పుడే.. సహకారం తీసుకుంటారు. ఒక పార్టీకే ప్రయోజనం కల్పించే సహకారాలు రాజకీయాల్లో నిలబడవు. అందుకే పరస్పర ప్రయోజనం ఉంటేనే మజ్లిస్ సహకారానికి ఒప్పుకుంటుంది. బీఆర్ఎస్ సహకారం ఉన్నా లేకున్నా.. మజ్లిస్ సులువుగా ఏడు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. అంతకు మించిన ప్రయోజనం ఉంటే తప్ప సహకారం ఇవ్వరు. మరి మజ్లిస్ కు మరో నాలుగైదు సీట్లలో అయినా గెలుపొందేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందా అన్నది ఇక్కడ కీలకం. అలాంటి చాన్స్ ఉండకపోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 


నిర్ణయాలు కేసీఆర్ - అసదుద్దీన్ స్థాయిలో ఉంటాయి! 


కానీ బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల నిర్ణయాలు కేటీఆర్, అక్బర్ చేతుల్లో ఉండవు. కేసీఆర్, అసదుద్దీన్ చర్చించుకుని రాజకీయ వ్యూహాలు ఖరారు చేస్తారు. అసదుద్దీన్ తానుత్యాగం చేయడానికి ఎప్పుడూ ముందుకురారు. తన అవసరం ఉందని ఇతర పార్టీలు అనుకుంటే... గరిష్టంగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తారు. అందుకే.. ఇప్పుడు అక్బర్ ప్రకటనతో ముందు ముందు బీఆర్ఎస్‌కు క్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతున్నారు.