Gorantla Madhav : న్యూడ్ వీడియో వివాదంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియోపై విచారణ జరుగుతోందని .. ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే ఆయనపై కఠినాతికఠినమైన చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మహిళాపక్షపాతి ప్రభుత్వంగా ఆ ముద్రను నిలబెట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంటే కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అయితే సస్పెన్షన్ వేటు వేస్తేనే కఠిన చర్యలు తీసుకున్నట్లు కాదని.. అంతకు మించి ఉంటుందని వైఎస్ఆర్‌సీపీలో ప్రచారం జరుగుతోంది.
గోరంట్ల మాధవ్ పై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్న ప్రచారం !
గోరంట్ల మాధవ్ దూకుడైన ప్రవర్తన. అసభ్యకరమైన భాషాప్రయోగంతో సొంతపార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తిని మూటగట్టుకున్నారు. పోలీసు అధికారిగా పని చేసినప్పుడు రెండు కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. అత్యాచారం, హత్య వంటి కేసులు ఉండటం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు మరింత దారుణంగా ఆయన వ్యవహారశైలి ఉంది. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయించాలన్న ఆలోచన పార్టీ హైకమాండ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సొంత పార్టీ వారు తప్పు చేసినా తాము క్షమించబోమన్న సందేశాన్ని పంపడంతో పాటు రాజకీయ పరమైన వ్యూహాలు అమలు చేయడానికి అవకాశం చిక్కినట్లు ఉంటుందన్న వాదన కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది.
రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లే ఆలోచనలో వైఎస్ఆర్‌సీపీ !
సాధారణంగా ఏ పార్టీ అయినా తమ ఎంపీతో రాజీనామా చేయించదు. పార్టీని ధిక్కరిస్తే అనర్హతా వేటు వేయించడానికి ప్రయత్నిస్తారు. విధేయంగా ఉంటే ఎంత తప్పు చేసినా సస్పెన్షన్ వరకూ ఆలోచిస్తారు కానీ రాజీనామా చేయించేందుకు సిద్ధపడరు. ఎందుకంటే మళ్లీ ఉపఎన్నిక ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు కోరుకోవు. కానీ ఇప్పుడు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. గోరంట్లతో రాజీనామా చేయించి.. ఆ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించడం ద్వారా ప్రజాభిప్రాయం తమకే అనుకూలంగా ఉందని నిరూపించాలని వైఎస్ఆర్‌సీపీ వ్యూహం పన్నే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇదే రాజకీయం నడుస్తోంది.
ప్రభుత్వంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టే వ్యూహం ?
ఉపఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకే అనుకూల ఫలితం వస్తుంది. ఇంకా ఇరవై నెలల వరకూ పదవీ కాలం ఉన్న ఎంపీ స్థానానికి ఎన్నికలు జరిగితే ఏడు అసెంబ్లీ స్థానాల్లో వచ్చే మెజార్టీలను బట్టి తమ స్థానం సుస్థిరంగా ఉందని విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని నమ్మడం లేదని నిరూపించే అవకాశం వైఎస్ఆర్‌సీపీకి లభిస్తుంది. ఈ ఆప్షన్‌పై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ గట్టిగా కసరత్తు చేస్తే గోరంట్లతో నేరుగా రాజీనామా చేయించే అవకాశాలున్నాయని భావించవచ్చు.