TSPSC Issue :  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ల లీక్ కావడం ఇప్పుడు  మరోసారి తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య రచ్చకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.  పేపర్ లీక్  పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్‌గా ఉన్నట్లు గవర్నర్ సంకేతాలు పంపుతున్నారు.  టీఎస్‌పీఎస్సీ వ్యవహారం, విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని తనతో భేటీ కావడానికి వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలతో చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. 


టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే  అధికారం గవర్నర్‌కు ఉందా ? 


టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై బుధవారం టీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారితో గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలతో సిరిసిల్లలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ఘటనను గవర్నర్ ప్రస్తావించారని, ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్నానని తన వరకు వచ్చిన ఫిర్యాదులుపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటానని వారితో చెప్పారు.  విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నందున రాజ్యాంగానికి లోబడి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని అందువల్లే లీగల్ ఒపీనియన్ ప్రకారం తన నిర్ణయం ఉంటుందని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ బోర్డును తప్పించే చర్యలు తీసుకుని విచారణ పారదర్శకంగా చేస్తారని భావించినప్పటికీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అందువల్ల విచారణ పూర్తి అయ్యే వరకు టీఎస్ పీఎస్సీని రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉంటుందని రేవంత్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై గవర్నర్ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. 


పేపర్ లీకేజీ చిన్నది కాదు ... తవ్వేకొద్దీ సంచలన విషయాలు !
 
టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేస్తున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇప్పటికే ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న విచారిస్తోన్న సిట్.. తాజాగా టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తోన్న 42 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లతో సన్నిహితంగా ఉన్నవారిపై సిట్ ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సిట్ పలువురు ఉద్యోగులు, అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే కమిషన్‌లో పనిచేస్తోన్న 10 మంది గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు గుర్తించిన సిట్.. దర్యాప్తులో భాగంగా వారందరికి నోటీసులు పంపింది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌చార్జ్‌గా ఉన్న శంకరలక్ష్మీ పాత్రపై మరింత దర్యాప్తు చేయాలని సిట్ నిర్ణయం తీసుకుంది.   ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితురాలు రేణుకతో టచ్‌లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులు.. అభ్యర్థులను కూడా విచారించేందుకు సిట్ సిద్ధం అయ్యింది. అలాగే నిందితుడు రాజశేఖర్ స్నేహితుడు రమేష్ పాత్రపై మరోసారి సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.


టీఎస్‌పీఎస్సీ సభ్యురాలు మాజీ జాగృతి నేత అని ఆరోపణలు ! 


మరో వైపు ఈ కేసులో రాజకీయంగా సంచలన ఆరోపణలను రాజకీయ పార్టీల నేతలు చేస్తున్నారు.   బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ మెంబర్ గా ఉన్న తనోబా ఒకప్పుడు తెలంగాణ జాగృతి మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారని గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఎన్ని పోస్టులు ఎవరెవరికి అమ్ముడు పోయాయో అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 


మొత్తంగా పేపర్ లీకేజీ అంశం ఊహించనంత మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు గవర్నర్ కూడా జోక్యం చేసుకుంటే.. ఇక ఎలాంటి మలుపులు తిరుగుతుందో అంచనా వేయడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.