Challenge for Jagan : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తన కేబినెట్‌లో మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాక ముందే కేబినెట్‌లో మార్పు చేర్పుల గురించి సీఎం జగన్ సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఖచ్చితంగా మంత్రివర్గాన్ని మార్చాలని అనుకుంటున్నట్లగా తెలుస్తోంది. అయితే గతంలోలా అంత సులువుగా అయ్యే రాజకీయ పరిస్థితులు లేవు . గతంలో మంత్రులందరి వద్ద రాజీనామాలు తీసుకున్నప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. గతంలో ఆయన మాటను సీనియర్లు కూడా జవదాటేవారు కాదు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 

 

ఎమ్మెల్యేలు ఎక్కువ - ఆశావహులూ ఎక్కువే !

 

సీఎం జగన్ గత  ఎన్నికల్లో అతి భారీ మెజార్టీ సాధించడం కూడా ఆయనకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది రాజకయంగా తనతో నడుస్తున్న వారే ఉన్నారు. వారంతా మంత్రి పదవులు కోరుకుంటున్నారు. కానీ వివిధ రాజకీయ సమీకరణాల రీత్యా మధ్యలో వచ్చి చేరిన సీనియర్లకు పదవులు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కారణంగా తనతో పాటు నడిచిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోయారు.వారంతా తమకు చాన్స్ కోరుకుంటున్నారు. తమకు లేని చాన్స్ మధ్యలో వచ్చిన వారికి రావడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సీనియర్లు ప్రతీ జిల్లాలోనూ ఉన్నారు.  ఆ అసంతృప్తి గతంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడే  బయటపడింది. చాలా మందిని సీఎం  జగన్ ప్రత్యేకంగా బుజ్జగించాల్సి వచ్చింది.

 

పార్టీపై జగన్ పట్టు కోల్పోయిన రాజకీయ పరిణామాలు !

 

ఏడాది కిందట వరకూ సీఎం జగన్ ఏది చెబితే అది శాసనం. కానీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేసిన తర్వాత సీన్ మారిపోయింది. ఆయన పై ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాటలను కూడా వినిపించుకోలేదు. ఇలాంటి వారిలో అత్యధికులు జగన్ వెంట నడిచినవారే. అదే సమయంలో మంత్రి పదవులు కోల్పోయినవారిలోనూ అసంతృప్తి ఉంది. కానీ బయట పడలేదు. కొడాలి నాని, పేర్ని నాని, సుచరిత వంటి వారు తామేం తప్పు చేశామని ఫీలయ్యారు. సుచరిత ఒక్కరే బయటపడ్డారు. తమ ప్రాధాన్యతను సీఎం జగన్ గుర్తిస్తారని ఇతర మంత్రులు ఆశతో ఉన్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పు చేర్పులు అనేసరికి వారు కూడా ఆశలు పెంచుకుంటున్నారు. ఇలాంటి వారికి అందరికీ సీఎం జగన్ పదవులు ఇవ్వలేరు. అలాగే వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తే బుజ్జగించడమూ కష్టమే. 

 

ఎమ్మెల్యేలు ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న అనుమానాలు !

 

ఎమ్మెల్యేలపై సీఎం జగన్‌కు పూర్తి స్థాయి పట్టు ఉందని అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది పూర్తిగా నిజం కాదని తేలిపోయింది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీని ధిక్కరించి ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడం అంటే చిన్న విషయం కాదు.  అదీ కూడా ఏడాదిపైగా అధికారం ఉన్న సమయంలో. అధికార పార్టీకి విపక్ష సభ్యులు మద్దతిస్తే అందులో ఓ లాజిక్ ఉంటుంది . కానీ  పార్టీపై పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు ఉన్నట్లుగా భావిస్తున్న జగన్ పార్టీలో ఇలా జరగడం మాత్రం ఆశ్చర్యమే కాదు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరగడమూ ఇబ్బందికరమే. వీరిలో పార్టీలో ...ప్రభుత్వంలో  ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇలాంటి వారిని కంట్రోల్ చేయడం కష్టమే. 

 

ప్రస్తుతం పదవుల్ని  కోల్పోయే మంత్రులు కూడా అసహనానికి గురవుతారు. తమను  పనికి రాని వాళ్లుగా తేల్చి తీసేస్తున్నారని వారు ఫీలయితే మొదటికే మోసం వస్తుంది. అందుకే సీఎం  జగన్ ఇప్పుడు కత్తిమీద సాములా కేబినెట్‌లో మార్పుచేర్పులు చేయాల్సి ఉంది.