TDP – BJP Alliance :   అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుతో ఈ పదవి దక్కింది. ఇది గొప్ప ముందడుగు అన్నట్లుగా జేపీ నడ్డా.. టీడీపీ, బీజేపీ అలయన్స్ గురించి పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ అయింది. నిజానికి పోర్టు బ్లెయిర్‌లో ఇప్పుడు ఎన్నికలు జరగలేదు. ఏడాది కిందట జరిగాయి.  అప్పట్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. విడివిడిగా పోటీ చేసాయి. టీడీపీ రెండు స్థానాల్లో గెలిచింది. ఆ రెండు స్థానాలే మేయర్ పీఠాన్ని ఎవరికి దక్కాలో డిసైడ్ చేస్తున్నాయి. అప్పట్లో బీజేపీ నేతలు టీడీపీతో సంప్రదింపులు జరిపి పొత్తు కోసం అంగీకరింపచేశారు. దానిప్రకారం… మొదట బీజేపీ.. తర్వాత టీడీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. మొదట బీజేపీ తీసుకుంది. వారి టర్మ్ అయిపోయిన తర్వాత పద్దతిగా టీడీపీకి అప్పచెప్పింది.  


టీడీపీ, బీజేపీ పొత్తు అన్నదాన్ని హైలెట్ చేసిన జేపీ నడ్డా 


పోర్టుబ్లెయిర్‌లో టీడీపీ తపున గెలిచిన ఆ ఇద్దర్నీ చేర్చేసుకుంటే పదవి ఇవ్వాల్సిన అవసరం ఉండదుగా అని బీజేపీ ఆలోచించి కార్యాచరణ ఖరారు చేసుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. టీడీపీ, బీజేపీ పొత్తు అనే అభిప్రాయాన్ని కల్పించడానికి .. .మాత్రం నడ్డా ఈ విషయాన్ని హైలెట్ చేశారు. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తులపై మరోసారి చర్చ ప్రారంభమయింది.  టీడీపీ అంటే తెలుగు రాష్ట్రాలు అనే చూస్తారు. అండమాన్‌లో టీడీపీ ఉనికి ఆ పార్టీ నాయకత్వానికే తెలుసు. అలాంటిది నడ్డా ఇప్పుడు… టీడీపీ అండమాన్ లోనూ ఉందని జాతీయ స్థాయిలో చూపించడమే కాదు.. తాము టీడీపీతో పొత్తులో ఉన్నామనట్లగా సందేశం పంపారు. అండమాన్ లో కలిసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు కలవకూడదని ఆయన సందేశం ఇచ్చారేమో కానీ ముందు ముందు పరిస్థితులు మరింత మారిపోయే అవకాశం ఉంది. 


పోర్టు బ్లెయిర్ పొత్తు తెలుగురాష్ట్రాలకు వస్తుందా  ?


పోర్టు బ్లెయిర్ నుంచి పొత్తు.. ఏపీకి వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన అందుకే వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ యాక్టివ్ కావడం వెనుక.. బీజేపతో పొత్తు ఆశలు.. అంచనాలు ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీకి సహకరిస్తాం.. ఏపీలో తమకు సహకిరంచాలన్న ఒప్పందం కోసమే.. తెలంగాణలో టీడీపీని యాక్టివ్ చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అనుమానం  వ్యక్తం చేశారు. ఏపీలోనూ పొత్తు అంశంపై చర్చలు జరుగుతున్నాయి. 2014  పొత్తు రిపీట్ అవుతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.కానీ బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం టీడీపీతో పొత్తు ఉండనే ఉండదని ఖండిస్తున్నారు. జనసేన పార్టీ మాత్రం టీడీపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తోంది.


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు ! 


పొత్తుల విషయంలో రాష్ట్ర నేతలు ఏం చెప్పినా చివరికి హైకమాండ్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. అయితే  పైకి ఏం మాట్లాడినా ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశాభావంతో ఉన్నకొంత మంది నేతలు మాత్రం..  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాలని నేరుగానే చెబుతున్నారు. హైకమాండ్‌కూ సలహాలిస్తున్నారు. అందుకే పోర్టుబ్లెయిర్ లో టీడీపీ, బీజేపీ పొత్తు తెలుగు రాష్ట్రాల దాకా వస్తాయా అన్న చర్చ ప్రారంభమైంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదని అనేక సార్లు నిరూపితమయింది. అందుకే ఈ పొత్తులు కూడా జరగవని చెప్పలేమంటున్నారు.