Why Pavan Not Invited :   ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానం పలికారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి ఆహ్వానం పంపారు. కానీ ఆయన సోదరుడు బీజేపీ మిత్రపక్షం అయిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదు. దీంతో ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమైంది. 


బీజేపీకి దగ్గరగా.. దూరంగా ఉంటున్న పవన్ కల్యాణ్ 
 
ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీ విషయంలో పవన్ కల్యాణ్ పెద్దగా పట్టనట్లుగా ఉంటున్నారు. అధికారికంగా పొత్తులో ఉన్న క్షేత్ర స్థాయిలో మాత్రం ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం లేదు. కలసి పని చేయడం లేదు. కలసి రాజకీయ పోరాటాలు కూడా చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో  బీజేపీతో కలిసి పోటీ చేయడం ఓ ఆప్షన్ అన్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయ పర్యటన కోసం రాజమండ్రి వచ్చినా పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించలేదు. జనసేనాని కూడా మర్యాదపూర్వకంగా కూడా  నడ్డాను కలిసేందుకు ప్రయత్నించలేదు. 


రాజకీయ కార్యక్రమం కాదంటున్న బీజేపీ 


ఈ పరిణామాల కారణంగా చిరంజీవిని పిలిచి మిత్రపక్షం అయిన పవన్ కల్యాణ్‌ను పిలవకపోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. చిరంజీవి ప్రస్తుతం  రాజకీయాల్లో లేరు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ఉండే ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారని ... ఈ కార్యక్రమానికి రాజకీయాలతో సంబంధం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అని చెబుతున్నారు. 


ఏం జరిగినా రాజకీయ చర్చ సహజమే !


రాజకీయ కార్యక్రమం అయితే పవన్ కల్యాణ్‌ను ఖచ్చితంగా ఆహ్వానించి ఉండేవారని.. చిరంజీవి ఆ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టే ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. అయితే చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్‌ కూడా సూపర్ స్టారేనని అదే సమయంలో పవన్ కూడా అదే జిల్లా వ్యక్తి అని కొంత మంది గుర్తు చేస్తున్నారు.  ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రతీది రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన అయ్యే వరకూ ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయని అంటున్నారు.