Mudragada Political Future : కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. కాపు సామాజికవర్గ ప్రజలకు ఉద్దేశించి రాసిన లేఖలో తుని రైల్వే కేసు కొట్టివేసినందున సత్యం జయించిందని సంతోషం వ్యక్తం చేశారు. తన జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 2016 వ సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీన తనను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీగా పెట్టారని.. బెయిల్ తెచ్చుకోండి, లేదా అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని సలహాలు ఇచ్చారన్నారు.
త్వరలో ముద్రగడ రాజకీయ నిర్ణయం
అదే చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యే ప్రమాదం ఉండేదన్నారు. అప్పటి డిజిపికి కూడా ఉత్తరం ద్వారా స సమస్త కేసులు నామీద పెట్టుకోండి అని లేఖలో ప్రస్తావించానన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పాడుచేయమని ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదని ముద్రగడ స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభంను వైఎస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ళ లేఖలో మాత్రం తన రాజకీయ భవిష్యత్తును త్వరలోనే ప్రకటించనున్నట్టుగా ముద్రగడ పద్మనాభం ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత కల్గించింది. ఆయనతో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూడా చర్చలు జరిపారు.
వైఎస్ఆర్‌సీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2016లో తునిలో రైలు దగ్దమైంది. ఈ కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేశారు. ఈ కారణంగానే లేఖ రాశారు. ఏపీ రాష్ట్రంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కాకపోతే ఆయన వారసుడ్ని అయినా రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.
వైసీపీ రిజర్వేషన్లు రద్దు చేసినా పెద్దగా స్పందించని ముద్రగడ
గత ప్రభుత్వంలో రిజర్వేషన్ల కోసం తీవ్ర ఉద్యమం చేసినా ఈ ప్రభత్వంపై ఆయన సాఫ్ట్ గా ఉన్నారు. ఎలాంటి ఉద్యమం చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లుతాయని కేంద్రం చెప్పినా ముద్రగడ పెద్దగా స్పందించలేదు. రద్దు చేసిన ఐదు శాతం రిజర్వేషన్లను పునరుద్దరించాలని ఆయన ఎలాంటి ఉద్యమం చేయలేదు. దీంతో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.