BRS KTR :   టిక్కెట్ రాని నేతలు, పార్టీ మారిపోతామని లీకులిస్తున్న  నేతలు, తాడోపేడో తేల్చుకుంటామని అంతర్గత వార్నింగ్‌లు ఇస్తున్న నేతలు, కుల సంఘాల సాయంతో పార్టీపై ఒత్తిడి తెస్తున్న నేతలుఇప్పుడు బీఆర్ఎస్‌లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తున్నారు. పార్టీ కోసం సుదీర్ఘంగా పని చేస్తున్నా తమకు టిక్కెట్ ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొంత మంది సీనియర్లు ఉన్నారు. చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. సిట్టింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎందుకు వారినే కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే టిక్కెట్ లిస్ట్ ప్రకటనకు ముందే కేటీఆర్ అమెరికా వెళ్లడంతో అసంతృప్తికి గురైన వారిని  బుజ్జగించేందుకు ఎవరూ లేరు. కేసీఆర్ ఆ టాస్క్ తీసుకోలేదు. దీంతో అందరూ కేటీఆర్ రాక కోసం ఎదరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చేశారు. బీఆర్ఎస్ అసలు టాస్క్ ప్రారంభమయిందని అంచనా వేస్తున్నారు. 


టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీని వీడిపోతామని లీకులు 
 
రకరకాల సమీకరణాలతో టిక్కెట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు బీఆర్ఎస్‌లో పూర్తిగా నిరాశకు గురయ్యాయి.  పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా  కష్టపడుతున్నామని.. సామాజిక సమీకరణాల ప్రకారం కూడా తమకు అన్నీ కలసి వస్తాయని  .. బలమైన ఓటు బ్యాంకును కలిగున్నామని భావిస్తున్న   నాయకులు  ప్రకటించిన  అభ్యర్థులను మార్చి తమకే టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.  కేసీఆర్‌ వారి మొరను ఆలకించ లేదు. అందుకే వారంతా కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నరాు.  ఆ నేతల్లో కొందరు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ తమకు టిక్కెట్‌ దక్కలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. తమ ఆవేదనను, ఆక్రందనను వెళ్లగక్కుతున్నారు. మరికొందర పార్టీని వీడిపోతామని హెచ్చరిస్తున్నారు. ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. 


రచ్చ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాటికొండ, ముత్తిరెడ్డి 


టిక్కెట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రోజూ రోడ్డెక్కుతున్నారు.   జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి…తనకు సీటు దక్కనీయలేదంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిపై తీవ్ర ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ఆయన   ఇటీవల అర్థనగ ప్రదర్శన చేసిన సంగతి విదితమే. పక్కనే ఉన్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి సీటు దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..  రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌ గూటికి చేరుతారనే ప్రచారం ఊపందు కుంది. దీంతోపాటు సిరిసిల్ల, సిద్ధిపేటలో మత్స్యకా రులు, ముదిరాజ్‌లు కలిసి ఆందోళనలు కొనసాగి స్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగి, బలమైన సామాజిక వర్గంగా ఉన్న తమకే టిక్కెట్‌ కేటాయించాలంటూ వారు పట్టుబడుతున్నారు. పటాన్‌చెరు నియోజక వర్గం లో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు కూడా కారు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.   ప్రస్తుత అభ్యర్థిని మార్చి.. కచ్చితంగా టిక్కెట్‌ తనకే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.  జహీరాబాద్‌ టిక్కెట్‌ను ఆశించిన ఢిల్లీ వసంత్‌… బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై తనదైన పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.  ‘మట్టి మనుషుల మనోగతం-భూమి పుత్రుల ఆకలి కేక’ అంటూ జహీరాబాద్‌లో నూత్న రీతిలో కార్యక్రమం చేపట్టారు.   


తుమ్మల, మండవ వంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్తారనిప్రచారం 


మరో వైపు సీనియర్ నేతలు తుమ్మల, మండవ వంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచంర జరుగుతోంది. మరికొంద మంది కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారని లీకులు వస్తన్నాయి.  వీరందరికీ టిక్కెట్ భరోసా ఇస్తే బీఆర్ఎస్ లోనే ఉంటారు.  అందుకే టిక్కెట్‌ దక్కిన నేతలకు టెన్షన్ తప్పడం లేదు. కేసీఆర్ నియోజకవర్గాల్లో ఇప్పటికీ సర్వేలు చేస్తూండటంతో ఏం జరుగుతుందో వీరికి అర్థం కావడం లేదు.  అధికార పార్టీ నుంచి సీటొస్తే ఓకే.. లేదంటే, ఏదో ఒక పార్టీ నుంచి, అదీ కుదరకపోతే స్వతంత్రులుగానైనా బరిలోకి దిగుతామమని హెచ్చరిస్తున్నారు. వీరందర్నీ ఇప్పుడు కేటీఆర్ పార్టీ లైన్ లోకి తేవాల్సి ఉంది.