Janasena : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నాయి. కానీ జనసేనాని మాత్రం నింపాదిగా ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ సిటీలో వారాహి విజయయాత్ర చేపట్టారు. అద్భుతమైన స్పందన వచ్చిందని జనసైనికులు సంతోషపడ్డారు. అయితే ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయారు పవన్ కల్యాణ్. కుటుబంంతో గడపేందుకు కొన్నాళ్లు విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు రెండు వారాల పాటు ఆయన కీలక సినిమా షూటింగ్‌లో ఉంటారని చెబుతున్నారు. అంటే.. ఈ నెలలో మరో రెండు వారాల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు. డిసెంబర్ లో జమిలీ ఎన్నికలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో జనసేనాని ఇంత నింపాదిగా ఉండటం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
పొత్తులు ఖాయమని చెబుతున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పొత్తులు ఖాయమని చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోటనే పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు స్పష్టత ఉంది. కానీ రాజకీయాల్లో ప్లాన్ ఏ .. ప్లాన్ బీ కూడా ఉండాలని చెబుతూంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా... రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి సిద్ధపడాలి. అందు కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ పవన్ కల్యాణ్ .. ఈ విషయంలో అంత చురుకుగా లేరన్న వాదన వినిపిస్తోంది. ఆయన రెండు, మూడు వారాల పాటు పూర్తిగా ఆఫ్ లైన్ లోకి వెళ్లడంతో పార్టీకి సరైన దిశానిర్దేశం ఉండటం లేదు. పార్టీలో నెంబర్ టు గా ఉన్న నాదెండ్ల మనోహర్ వీలైనంత వరకూ.. పార్టీ స్టాండ్ ను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చెబుతున్నారు కానీ.. క్షేత్ర స్థాయిలో పార్టీని యాక్టివ్ గా ఉంచడం శక్తికి మించిన పని అవుతోంది.
చివరి వారం నుంచి వారాహి యాత్ర ఉండే అవకాశం
పవన్ కల్యాణ్.. ఈ నెల చివరి వారం నుంచి మరోసారి వారాహి యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. విశాఖ సిటీలో యాత్ర పూర్తయినందున ఈ సారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్ర కొనసాగించే అవకాశం ఉంది. ప్రతీ నెలా రెండు వారాలు సినిమా షూటింగ్‌లకు కేటాయించాలని ఇది వరకే నిర్ణయించారు. ఎన్నికలకు ముందే ఓజీ, ఉస్తాద్ సినిమాలను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ లోనూ పొలిటికల్ పంచ్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ సినిమాలు కూడా జనసేనకు ప్రచారం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే సగం రోజులు షూటింగ్‌లకు కేటాయిస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఎన్నికలు అంటే చిన్న విషయం కాదని.. పార్లమెంట్ సమావేశాల్లో జమిలీపై స్పష్టత వస్తే పూర్తి సమయం ఎన్నికల కోసం కేటాయించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జమిలీ రాదని జనసేనాని నమ్ముతున్నారా ?
ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. దానికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ముందు నుంచీ.. ఏపీలో ముందుగానే ఎన్నికలు వస్తాయని.. కేంద్ర పెద్దలు తనకు చెప్పారని.. ఎన్నికల సంఘం ఈ మేరకు సన్నాహాలు చేస్తోందని గతంలో పవన్ ప్రకటించారు. కానీ ఆయనే మళ్లీ ఈ అంశంపై స్పష్టత కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు నెలలో సగం రోజులు షూటింగ్‌కు కేటాయిస్తే.. కేడర్ లోనూ అంత సీరియస్ నెస్ ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.