Will KCR go to the Assembly: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి  నీళ్లు-నిజాలు  నిప్పు రాజేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్ విరామం తర్వాత నేరుగా కృష్ణా జలాల అంశాన్ని  అందుకోవడంతో  దానికి దీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అసెంబ్లీ అస్త్రం  సంధించారు.  జనవరి 2 నుండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, దమ్ముంటే అక్కడికి వచ్చి ముఖాముఖి చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.  కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.  రేవంత్ వ్యూహం: ఇరుకున పెట్టేందుకేనా? 

Continues below advertisement

సాధారణంగా ఏదైనా కీలక అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తాయి. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ అయ్యింది. కేసీఆర్ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని ప్రకటిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం  అసెంబ్లీకి రా.. చర్చించుకుందాం అంటున్నారు. ఇది కేసీఆర్‌ను ఇరుకున పెట్టే వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే,  ఆరోపణలు చేయడానికి తప్ప, ఆధారాలతో చర్చించడానికి ఆయన సిద్ధంగా లేరు  అని ప్రజల్లోకి తీసుకెళ్లడం రేవంత్ ప్లాన్.

అసెంబ్లీలో జరిగే చర్చలకే విలువ ఎక్కువ   తెలంగాణ ఉద్యమ మూలాల్లో  నీళ్లు అత్యంత ప్రధానమైనవి. అందుకే కేసీఆర్ మళ్లీ అదే సెంటిమెంట్‌ను రగిలించాలని చూస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి దీనికి బలమైన కౌంటర్ ఇస్తున్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తెలంగాణకు మరణ శాసనం అని ఆయన ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 811 టీఎంసీల్లో కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకుని ద్రోహం చేశారని రేవంత్ అంటున్నారు. జూరాల వద్ద ఉండాల్సిన ఇన్ టేక్ పాయింట్‌ను శ్రీశైలంకు మార్చడం ద్వారా కాంట్రాక్టర్లకు మేలు చేశారని మండిపడుతున్నారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టాలంటే కేసీఆర్ సభల కంటే, అసెంబ్లీ వేదికగా రికార్డులతో సమాధానం చెప్పడం వల్ల ఎక్కువ మైలేజ్ ఉంటుందని భావిస్తున్నారు.  అసెంబ్లీకి వెళ్లేందుకు కేసీఆర్ ఎందుకు విముఖం?

Continues below advertisement

కేసీఆర్ గత కొన్నాళ్లుగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. విపక్ష నేతగా ఆయన ఉన్నా.. బాధ్యతలను హరీశ్ రావు, కేటీఆర్ నిర్వహిస్తున్నారు. కేసీఆర్ రాకపోవడాన్ని రేవంత్ తరచూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేసీఆర్ స్వయంగా వచ్చి తన వాగ్ధాటితో ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రభుత్వం అసెంబ్లీలో కేసీఆర్ లేని సమయంలో గత పదేళ్ల పత్రాలను బయటపెట్టి, ఆయనపై  జల ద్రోహి  ముద్ర వేసే ప్రమాదం ఉంది. అసెంబ్లీకి రాకుండా కేవలం సభలకే పరిమితమైతే రేవంత్ వేసిన పారిపోయారు అనే విమర్శను ఎదుర్కోవడం కష్టమవుతుంది.

ప్రజలకు కావాల్సింది రాజకీయాలు కాదు.. నిజాలు 

కృష్ణా  నీటిలో  తెలంగాణకు దక్కాల్సిన హక్కుల విషయంలో రాజకీయం పక్కన పెట్టి నిజాలు బయటకు రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి  నీళ్లు-నిజాలు పేరుతో చర్చకు పిలిచిన ఈ తరుణంలో, కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి తన అనుభవంతో సమాధానం ఇస్తారో లేక తనదైన శైలిలో సభల ద్వారానే ప్రజలను ఆకట్టుకుంటారో చూడాలి. జనవరి 2న అసెంబ్లీ గంట మోగితే తప్ప ఈ సస్పెన్స్ వీడదు.