AP Reorganisation Act Section 26 Assembly Seats: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే డీలిమిటేషన్ చట్టం అమల్లోకి వస్తే కేవలం లోక్‌సభ స్థానాలే పెరుగుతాయా లేక రాష్ట్రాల శాసనసభ సీట్లు కూడా పెరుగుతాయా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిళ్లలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. డీలిమిటేషన్ అనగానే చాలామంది కేవలం ఎంపీ సీట్ల పెంపు గురించే చర్చిస్తున్నప్పటికీ, రాజ్యాంగ నిబంధనలు , ప్రతిపాదిత 131వ రాజ్యాంగ సవరణల ప్రక్రియ ప్రకారం పార్లమెంట్ సీట్లతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. రాజ్యాంగంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రత్యేకమైన అధికరణలు ఉండటమే దీనికి ప్రధాన కారణం.
రెండింటికీ వేర్వేరుగా లేదా ఒకే రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సవరణలు
భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ స్థానాల విభజన ఆర్టికల్ 81, 82ల ప్రకారం జరిగితే.. రాష్ట్ర శాసనసభ స్థానాల పునర్విభజన ఆర్టికల్ 170 పరిధిలోకి వస్తుంది. డీలిమిటేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, రాజ్యాంగంలోని ఈ రెండింటికీ వేర్వేరుగా లేదా ఒకే రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 170 పై ఉన్న నిషేధాన్ని తొలగించకుండా కేవలం ఎంపీ సీట్లను పెంచడం సాధ్యపడదు. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైతే లోక్‌సభతో పాటు ప్రతీ రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్యను కూడా దామాషా పద్ధతిలో పెంచడానికి చట్టపరమైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది.
విభజన చట్టం ప్రకారం సీట్లు పెంచాల్సిందే!
ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టపరమైన కోణం కూడా ఉంది. 2014లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోని సెక్షన్ 26 ప్రకారం.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలో ఉన్న 119 సీట్లను 153కి పెంచాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల వరకూ సీట్ల పెంపుపై ఫ్రీజ్ ఉన్నందున, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఆ నిబంధన అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ద్వారా ఆర్టికల్ 170 సవరణ జరిగి నియోజకవర్గాల సరిహద్దుల ఫ్రీజ్ తొలగిపోతే.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు ఉన్న ఏకైక రాజ్యాంగ అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది.
సీట్లు ఖచ్చితంగా పెరిగాల్సిందే!
మరి ఏపీ, తెలంగాణల్లో సీట్లు పెరుగుతాయనడానికి ఖచ్చితమైన గ్యారంటీ ఉందా అంటే.. సమాధానం నూటికి నూరు శాతం గ్యారంటీ అనే చెప్పాలి. ఎందుకంటే, కేంద్రం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక డీలిమిటేషన్ నమూనా 50 శాతం స్థానాల పెంపు ప్రాతిపదిక ప్రకారం లేదా ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం చూసినా సీట్ల సంఖ్య పెరగడం ఖాయం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. డీలిమిటేషన్ అమల్లోకి వస్తే ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కి, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు 26కి పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు పెరిగినప్పుడు, దానికి అనుగుణంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల విస్తరణ జరగడం తప్పనిసరి. ప్రస్తుతం ఒక పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి కనీసం 225 లేదా అంతకంటే ఎక్కువకి , తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153 లేదా 160కి పైగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కావడం, అది ప్రకటన విడుదల చేయడం ద్వారా మాత్రమే కొత్త నియోజకవర్గాల సరిహద్దులు, ఎస్సీ/ఎస్టీ రిజర్వుడు స్థానాల వర్గీకరణ ఖరారవుతాయి.
ప్రత్యేకంగా అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం లేదు!
దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీలు మళ్లీ తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర పార్లమెంట్ ఆమోదించే డీలిమిటేషన్ చట్టమే రాష్ట్ర స్థానాల పెంపుకు నేరుగా వర్తిస్తుంది. ఈ సీట్ల పెంపు ప్రక్రియ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన రాజకీయ సంచలనాలకు, సమీకరణలకు దారితీయనుంది. ప్రతి నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులకు, యువ నాయకులకు కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేసే సువర్ణావకాశం లభిస్తుంది. అంతేకాకుండా, గ్రేటర్ హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లోనూ, అమరావతి పరిసర ప్రాంతాల్లోనూ జనాభా ప్రాతిపదికన మరిన్ని కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. డీలిమిటేషన్ పార్లమెంట్‌కే పరిమితం కాదు, అది రాష్ట్రాల శాసనసభలను కూడా సమాంతరంగా పునర్వ్యవస్థీకరిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లులు చట్ట రూపం దాల్చిన మరుక్షణమే డీలిమిటేషన్ కమిషన్ రంగంలోకి దిగుతుంది. అందువల్ల ఏపీ , తెలంగాణ అసెంబ్లీలలో స్థానాలు పెరగడం అనేది కేవలం ఒక రాజకీయ అంచనా మాత్రమే కాదు, రాజ్యాంగపరంగా, చట్టపరంగా జరగబోయే ఒక అనివార్యమైన పరిణామం!
