AP Liquor Policy :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  మళ్లీ లిక్కర్ పాలసీ మార్చబోతోంది. అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న దుకాణాల వేలం పాట విధానాన్ని అమలులోకి తేవాలనుకుంటున్నారా ? ఈ అంశంపై ఏపీ అధికార వర్గాల్లో అంతర్గతంగా విస్తృత చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.  ఇంకా ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి వరకూ వెళ్లలేదని మధ్య స్థాయిలోనే మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలపై నివేదిక సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. 


దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా పాలసీ మార్పు 


ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు. దశల వారీగా మద్య నిషేధం  చేయడం వైసీపీ హామీ. వచ్చే ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేసి ఓట్లు అడుగుతామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఈ హామీపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. మొదటి ఏడాది దుకాణాల సంఖ్యను తగ్గించారు కానీ తర్వాత లిక్కర్ మార్టుల పేరుతో కొత్తవి ఏర్పాటు చేశారు. దీంతో దుకాణాల సంఖ్యలో పెద్దగా తేడా లేదు. 2022-23 సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తరగా 2,934 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి కాలపరిమితి వచ్చే నెల 30వ తేదీతో ముగియనుంది. 


అక్టోబర్ నుంచి ఉన్న పాలసీ కొనసాగింపా ? కొత్త విధానమా ? 


  అక్టోబర్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యే కొత్త ఏడాది నుంచి ఉన్న పాలసీనే కొనసాగిస్తారా, లేక మళ్లీ వేలం పాటల ద్వారా ప్రయివేటు వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాత విధానంలోకి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ప్రభుత్వంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇలా లిక్కర్ పాలసీకి వేలంపాటలు వేయడం మంచిదని వైసీపీ నేతలు కూడా  పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఇదే విషయాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయమే కీలకం కావడంతో ఆయన్ను ఎలాగైనా ఒప్పించడాని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.  


ప్రభుత్వానికి దండిగా ఆదాయం వచ్చే  అవకాశం !                          


తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి నిధుల సమీకరణ కోసం ఎప్పుడో డిసెంబర్ లో ముగిసే లైసెన్స్ ల కోసం ఇప్పుడే దరఖాస్తులు తీసుకుని వేలం వేస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షలకుపైగా ఫీజు పెట్టడంతో.. రెండున్నర వేల కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. అదే ఏపీ ప్రభుత్వ పెద్దలను కూడా ఆకర్షిస్తోందని చెబుతున్నారు.  ప్రస్తుతం ఏపీ సర్కార్  కు నిధుల కటకట ఉంది.  ఈ విధానానికి మారడం వల్ల సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులు ఒకేసారి సమకూరుతాయని అంటున్నారు. విధాన మార్పు చేయాల్సి వస్తే దీనిని శాసనసభలో పెట్టాల్సి ఉంటుందని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. సిఎం సానుకూలంగా స్పందిస్తే వచ్చే నెలలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లో మద్యం పాలసీ మార్పు బిల్లును కూడా పెట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.