Andhra Politics :  ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అగ్రనేతలు రెండు రోజుల వ్యవధిలో రెండు సభలు పెడుతున్నారు. అమిత్ షా విశాఖలో,  బీజేపీ అధ్యక్షుడు నడ్డా తిరుపతిలో సభలు పెడుతున్నారు. ఈ ఇద్దరు నేతల బహిరంగసభలపై ఈ సారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమ పార్టీ నేతలకు వారు రోడ్ మ్యాప్ ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. జనసేన పార్టీ మాతోనే ఉందని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము టీడీపీతో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో బీజేపీ అగ్రనేతల వద్దకు టీడీపీ, వైసీపీ నేతలు వెళ్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకే పొత్తులపై విస్తృత చర్చ జరుగుతోంది. 


ఏపీ పొత్తులపై క్లూ లెస్ గా రాష్ట్ర బీజేపీ నేతలు


ఢిల్లీ పెద్దలు ఏపీ రాజకీయాల విషయంలో ఏం చేస్తున్నారో రాష్ట్ర నేతలకు అసలు సమాచారం లేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలో  ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలుస్తున్నారు. రాజకీయం లేదని అధికారికం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఏపీ బీజేపీ నేతలు పడిపోయారు. ఇలా భేటీలు జరిగాయి.. కదా పొత్తులుంటాయా అని అడుగుతున్న వారికి ఏపీ బీజేపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. తమకు సమాచారం లేదని వారు వాపోతున్నారు. 


రెండు పార్టీలతోనూ పొత్తుల ప్రచారం


సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత .. ఎన్డీఏలో చేరడానికి వైసీపీ అధినేత ఆసక్తి కనబర్చారని వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కూటమిలో చేరుతారన్న ప్రచారం ప్రారంభమయింది. చంద్రబాబు ఎన్డీఏలో చేరకుండా ఉండేందుకే ఆయనీ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకున్నారు. తర్వాత టీడీపీతో పొత్తు ఖరారైందని.. బీజేపీకి  పార్లమెంట్ సీట్లు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇవన్నీ ఊహాగానాలే. చంద్రబాబు తాను అమిత్ షాతో భేటీ అయ్యానని కూడా ఎక్కడా చెప్పడం లేదు. రాష్ట్రం కోసమే తాను సమావేశాలు నిర్వహిస్తున్నానని.. పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని చెబుతున్నారు. ఇది బీజేపీ నేతలకు మరింత ఇబ్బందికరంగా మారింది. తాము ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. 


అమిత్ షా, జేపీ నడ్డాలు సంకేతాలు ఇస్తారనే ఆశలో ఏపీ బీజేపీ నేతలు


ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీల నాయకులూ  బీజేపీకి తాము దూరం కాదు అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారన్నది నిజం.  ఈ సమయంలో ఏపీలో ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలా అన్నది బీజేపీ నేతలకు పజిల్ గా మారింది. అమిత్ షా, నడ్డాలు ఈ మేరకు వారికి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై రాజకీయం విమర్శలు చేస్తే.. వైసీపీకి ఈ సారి పరోక్ష మద్దతు కూడా ఉండదని చెప్పినట్లవుతుందని అంటున్నారు . కేంద్ర ప్రభుత్వ పాలనా విజయాల గురించి ప్రచారం చేసుకుని వెళ్లిపోతే.. ఏపీ విషయంలో హైకమాండ్ లోనే గందరగోళం ఉందన్న అభిప్రాయం బలపడుతుంది.  అందుకే… నడ్డా, అమిత్ షాలు ఇచ్చే సందేశం కోసం ఏపీ బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు.