Why Vijaysaireddy Lost Post :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో మొదట చేర్చిన రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ అనూహ్యగా తర్వాత తొలగించారు. రాజ్యసభ కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం కూడా వచ్చింది. అలాగే రాజ్యసభ వెబ్‌సైట్‌లో ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితాను పెట్టినప్పుడు ఎనిమిదో పేరుగా విజయసాయిరెడ్డిని ప్రస్తావించారు. కానీ రాజ్యసభలో అధికారిక ప్రకటన చేస్తున్న సమయంలో రాజ్యసభ చైర్మన్ , ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాత్రం.. ప్యానల్ వైఎస్ చైర్మన్ జాబితా పునర్‌వ్యవస్థీకరించామని చెప్పి ఏడు పేర్లే ప్రకటించారు. ఎనిమిదో పేరుగా ఉన్న విజయసాయిరెడ్డి పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆయన పేరు తొలగించినట్లుగా స్పష్టమయింది. 


రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌గా మొదట విజయసాయికి పదవి


రాజ్యసభ చైర్మన్ ఆఫీసు నుంచి తనకు సమాచారం రావడంతో విజయసాయిరెడ్డి కూడా .. ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. రాజ్యసభ చైర్మన్ ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితా నుంచి తన పేరును తొలగించినట్లుగా స్పష్టత రావడంతో విజయసాయిరెడ్డి కూడా ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయితే చివరి క్షణంలో విజయసాయిరెడ్డి పేరును రాజ్యసభ చైర్మన్ ఎందుకు తొలగించారన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. విజయసాయిరెడ్డి నియామకం గురించి  బయటకు తెలిసిన తర్వాత ఆయన తీరుపై రాజ్యసభ చైర్మన్‌కు పలువురు ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విజయసాయిరెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. 


చివరి క్షణంలో తప్పించిన రాజ్యసభ చైర్మన్ 


విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా అభ్యంతరకంగా పోస్టులు పెడుతూ ఉంటారు. ఇతర పార్టీల నేతలు ప్రజాస్వామ్య  బద్దంగా విమర్శించినా వారిని.. వారి కుటుంబాలను విమర్శిస్తూ పోస్టులు పెడుతూంటారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి .. ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి పెట్టే పోస్టులు ఎన్నో సార్లు వివాదాస్పదమయ్యాయి. ఆయనకు ఏ మాత్రం గౌరవ మర్యాదలు లేవని.. అలాంటి వ్యక్తిని రాజ్యసభ చైర్మన్ చైర్‌లో కూర్చోబెడితే ఆ పదవికే అగౌరవం ఏర్పడుతుందని  రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను..  ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్ లేషన్ చేసి మరీ.. రాజ్యసభ చైర్మన్‌కు పంపారని అంటున్నారు. 


అసభ్య ట్వీట్లు చేస్తున్నారని ఫిర్యాదులు చేయడమే కారణమా ? 


ఈ కారణంగా విజయసాయిరెడ్డికి లభించిన అరుదైన గౌరవం కొద్దిలో తప్పినట్లయిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి ట్వీట్లు చూసిన వారు.. బయట జెంటిల్మెన్‌లా కనిపించే ఆయన ఇంత అసభ్యకరంగా తోటి రాజకీయ నేతల్ని.. వారి కుటుబాల్ని వ్యక్తిగతంగా ఎలా దూషించగలరని ఆశ్చర్యపోతూంటారు. ఆయనను సోషల్ మీడియాలో ఇతర పార్టీల వాళ్లూ అంతే దారుణంగా ట్రోల్ చేస్తూంటారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తన పంధాను వీడలేదు. ఇలాంటి ట్వీట్ల వల్ల పదవి పోయినా ఆయన బాధపడలేదన..  మళ్లీ మళ్లీ విపక్ష నేతలపై ఆయన పెడుతున్న పోస్టులతోనే అర్థం చేసుకోవచ్చంటున్నారు.