Telugu State Politics :   తెలుగు రాష్ట్రాల సీఎంలకు మహారాష్ట్రలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ ప్రారంభించిన భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ప్రతీ వారం తెలంగాణ భవన్‌కు నేతలు వస్తున్నారు. ఇప్పటికి మహారాష్ట్రలో మూడు  బహిరంగసభలు పెట్టి చాలా మందిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని కావాలంటూ మహారాష్ట్ర నుంచే డిమాండ్ వినిపిస్తోంది. అందు కోసం సైకిల్ యాత్రలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఈ క్రేజ ఉండటం సహజంగానే అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. 


జగన్ ప్రధాని కావాలంటూ సైకిల్ యాత్ర చేస్తూ వచ్చిన కాక్డే !  


ఏపీ సీఎం జగన్ పై అభిమానం రాష్ట్రాల సరిహద్దులు దాటింది. ఓ మహారాష్ట్ర రైతు సీఎం జగన్ పై అభిమానంతో మహారాష్ట్ర నుంచి సైకిల్ యాత్రగా  వచ్చాడు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందినవాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నా, ఆయన విధానాలు అన్నా లక్ష్మణ్ కాక్డే ఎంతో అభిమానించేవాడు. దాంతో జగన్ ను ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాడు. రై ఈ నెల 17న మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి ఓ సైకిల్ పై బయల్దేరాడు. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తాడేపల్లి చేరుకున్నాడు.  రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టును ధరించివచ్చారు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అని రాసివుంది. జగన్ ప్రధాని అయితేనే దేశ ప్రజల సమస్యలు తీరుతాయని ఆయన నమ్మకం. సీఎం జగన్ కాక్డేను పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు.  


 





 


మహారాష్ట్ర నుంచే బీఆర్ఎస్‌లోకి చేరికలు! 


మరో వైపు మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితిలోకి చేరికలు ఉంటున్నాయి. మరే ఇతర రాష్ట్రం నుంచి వచ్చి చేరేవారు లేరు కానీ మహారాష్ట్ర నుంచి మాత్రం వారానికోసారి నేతలు వస్తున్నారు.  చేరికల పరంపర కొనసాగుతూనే ఉన్నది.  మహారాష్ట్ర చంద్రపూర్‌, గడ్చిరోలి జిల్లాలకు చెందిన, పలు రంగాల నేతలు, విద్యాధికు లు, నిపుణులు బుధవారం తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పుకొని బీఆర్‌ఎస్‌  చేరారు. ఒక్క మహారాష్ట్ర నుంచే ఎందుకు వస్తున్నారు.. ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు రావడం లేదన్న విషయం  పక్కన పెడితే.. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు మంచి ఆదరణ ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. 


 





 


వైసీపీ చీఫ్ కూడా ప్రధాని పదవి కోరుకుంటున్నారా ?


కేసీఆర్ దేశ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని వారి తరపున బీఆర్ఎస్ నేతలు రోజూ ప్రకటిస్తూనే ఉంటారు. కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటున్నారని అలా నేరుగానే చెబుతారు.  ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారని తాజా  పరిణామాలు చూస్తున్నవారు అంటున్నారు.  సీఎం జగన్ ప్రధాని కావాలనే స్లోగన్‌తో టీ షర్టు తో మహారాష్ట్ర వ్యక్తి వచ్చిన విషయాన్ని   వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆ విషయాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో ప్రధాని పదవిపై జగన్ ఆశపడ్డారని.. స్ట్రాటజీలు ప్రారంభించేశారని అంటున్నారు.  ఇప్పటికే వైసీపీ నేతలు అనేక మంది జగన్ ప్రధానమంత్రి అవుతారని ప్రకటించారు.  ప్రకటిస్తూనే ఉన్నారు. స్వయంగా మంత్రులు ఇలాంటి ప్రకటనలు చేసే వారిలో ఉన్నారు. వారంతా జగన్ ను మెప్పించేందుకు .. ఆయన మనసులో ఉన్న కోరికను ఇలా బహిరంగంగా చెబుతున్నారు.  ఎలా చూసినా జగన్ కూడా ప్రధాని పదవిపై గట్టిగానే ఆశలు పెట్టుకుంటున్నారు.