౩ Capitals Garjana : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. విశాఖలో వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల పేరుతో గర్జన నిర్వహించింది. ఆ గర్జన.. హిట్టా, ఫ్లాపా అన్న సంగతి పక్కన పెడితే అసలు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉండి ..151 మందిసొంత ఎమ్మెల్యేలు.. మరో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తిరుగులేని స్థానంలో ఉండి ఎందుకు గర్జనలు నిర్వహిస్తోంది. చేయాలనుకుంటే మూడు రాజధానుల్ని తక్షణం చేయవచ్చు కదా? చేయడం సాధ్యం కాకపోతే.. మూడు రాజధానుల గర్జనల పేరుతో ప్రజల్ని మోసం చేసినట్లు కాదా?
అధికార పార్టీ గర్జనలు నిర్వహించడం వింత !
ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా.. అధికార పార్టీ నిరసనలు.. గర్జనలు నిర్వహించదు. సొంత ప్రభుత్వంపై అసలు నిర్వహించదు. కేంద్రానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నిరసనలు నిర్వహించింది. అయితే ఏపీలో వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల కోసం అంటూ గర్జనలు నిర్వహిస్తోంది. అధికార పార్టీగా ఉండి... ఎందుకు గర్జనలు నిర్వహిస్తున్నరన్నది ప్రజలకు ప్రాథమికంగా వచ్చే సందేహం. చేయాలనుకుంటే చేయవచ్చు కదా.. ఈ నిరసనలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం.. ఎందుకనేది ఎక్కువ మంది అభిప్రాయం.
మూడు రాజధానులు ఎందుకు చేయడం లేదు ?
తిరుగులేని మెజార్టీ ఉన్న వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల్నిఎందుకు చేయడం లేదు. అలా చేయకుండా గర్జనలు నిర్వహిస్తే రాజధాని ఏర్పడుతుందా ? రాష్ట్రం చేతుల్లో ఉన్న రాజధాని ఏర్పాటు ఎందుకు సాధ్యం కావడం లేదు ? వైఎస్ఆర్‌సీపీ పాలనపై ప్రజల్లో వస్తున్న సందేహాలు ఇవి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌కు చాలాస్పష్టంగా తెలుసు.. మూడు రాజధానులు అనేది అసాధ్యం అని. కోర్టు తీర్పు కానీ.. రాజ్యాంగ నిబంధనలు కూడా మూడు రాజధానులకు సహకరించవని తెలుసు. అందుకే మూడు రాజధానులు చేయలేకపోతున్నారు. కానీ ఆ పేరుతో రాజకీయం మాత్రం చేస్తున్నారు.
సాధ్యం కావని తెలిసీ ప్రజల్ని మభ్య పెడుతున్నారా?
మూడు రాజధానులు.. రాజకీయ పరంగానేకాదు.. సాంకేతికపరంగా కూడా సాధ్యం కావని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా రిట్ ఆప్ మాండమస్ ప్రకటించింది. సుప్రీంకోర్టుకువెళ్లి స్టే తెచ్చుకుంటే తప్ప మూడు రాజధానులు సాధ్యం కాదు. కానీ తీర్పు వచ్చిన ఆరు నెలల వరకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. ఆరు నెలల తర్వాత సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే తమ వాదనలు వినాలని రైతులు కూడా పిటిషన్ వేశారు. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అసాధ్యం. ఈ విషయం అందరికీ తెలుసు. అధికార పార్టీకి.. ముఖ్య నేతలకు తెలియని అనుకోలేం. మరి మూడు రాజధానులు పెట్టేస్తామని.. గర్జనలు ఎలా చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ?
ప్రజల్ని రెచ్చగొడితే ఏం వస్తుంది ?
మూడు రాజధానులు సాధ్యం కావని తెలిసిన తర్వాత కూడా.. ఏర్పాటు చేయలేమని తెలిసిన తర్వాత కూడా .. అవి చేస్తామని .. విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రచారం చేయడం వల్ల రాజకీయంగా లాభం కలగవచ్చు కానీ.. రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితుల వల్ల పెట్టుబడులు ఆగిపోతాయి. ప్రజల్లో విద్వేషాలు పెరుగుతాయి. ఇది అధికార పార్టీగా బాధ్యతగా వ్యవహరించడం కాదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.