TDP Supports BJP :  రివర్స్ గిఫ్ట్ ! ఈ మాట 2018 ఎన్నికల సమయంలో ఎక్కువగా వినిపించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మహా కూటమి తరపున లీడ్ తీసుకుని విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం టీఆర్ఎస్‌ ఏపీలో వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలికింది. రెండు పార్టీల మధ్య ఇప్పుడు కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే కాలం తిరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీకి మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. మునుగోడులో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి స్వయంగా వచ్చి చంద్రబాబును కలిసి మద్దతు అడిగారు. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు చూస్తే బీజేపీకి మద్దతు పలకడం ఖాయమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  టీడీపీ మద్దతు బీజేపీకి అడ్వాంటేజేనా ? టీఆర్ఎస్‌కు టీడీపీ రివర్స్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నట్లేనా ?


బీజేపీకి మద్దతివ్వడానికే టీడీపీ పోటీ పెట్టలేదా ?


మునుగోడులో టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ చివరి క్షణంలో విరమించుకున్నారు. బూర నర్సయ్య గౌడ్ లాంటి నేత పేరు కూడా వినిపించింది. కానీ చంద్రబాబు పోటీకి విముఖత చూపారు. ముందు  పార్టీని  బలోపేతం చేసుకోవాలన్న కారణం చెప్పారు..కానీ బీజేపీతో  ఇప్పటికే చంద్రబాబు ఓ అంతర్గత అవగాహనకు వచ్చారని అందుకే పోటీ విషయాన్ని ఆలోచించలేదని చెబుతున్నారు. ఆ అవగాహన ఏమిటనేది ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఖాయమైందనుకోవచ్చు. 


గతంలోలా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టలేని పరిస్థితిలో టీఆర్ఎస్ !


నిన్నామొన్నటి వరకూ తెలంగాణలో తెలుగుదేశం మద్దతు తీసుకోవాలంటే చాలా మంది ఆలోచించేవాళ్లు. ఎందుకంటే కేసీఆర్... చంద్రబాబు లేదా టీడీపీని బూచిగా చూపి సెంటిమెంట్ రెచ్చగొడతారనే ఆందోళన వారికి ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ తన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. మళ్లీ తెలంగాణపై దండెత్తుతున్నారని కానీ.. తెలంగాణను మళ్లీ ఏపీలో కలుపుతారని కానీ.. లేకపోతే మరో రకమైన తెలంగాణ సెంటిమెంట్ ను కానీ రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేరు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం బీజేపీ నేరుగా ప్రయత్నిస్తోంది. 


టీడీపీ బలాన్ని తక్కువ అంచనా వేయని రాజకీయ పార్టీలు!


తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్న బలాన్ని రాజకీయ పార్టీలు తక్కువగా అంచనా వేయడం లేదు. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ విషయంలో అన్ని పార్టీలు వ్యవహరించిన  విధానమే దీనికి సాక్ష్యం. అదే సమయంలో అసలు తెలంగాణ సెంటిమెంటే లేని రాజకీయ వాతావరణంలో బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఎక్కువే. అందుకే తెలంగాణలో బీజేపీతో కలిసి నడవాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైతే మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇస్తుంది. తర్వాత ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ మునుగోడులో టీడీపీ మద్దతు ప్లస్ అయితే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీకి తిరుగుండదనే వాదన  బలపడుతుంది. 


కేసీఆర్‌కు చంద్రబాబు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ?


ఇంత కాలం తమను టార్గెట్ చేసిన కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారన్న వాదనను టీ టీజీపీ నేతలు తెరపైకి తెచ్చారు. టీడీపీ క్యాడర్, లీడర్లందర్నీ టీఆర్ఎస్ లాగేసుకుంది. కాసాని జ్ఞానేశ్వర్‌తో ప్రారంభించి... ముందు ముందు భారీ స్థాయిలో చేరికలకు టీడీపీని సిద్ధం చేస్తున్నామని వారు చెబుతున్నారు. మునుగోడులో బీజేపీకి మద్దతు రిటర్న్ గిఫ్ట్‌కు స్టార్టింగేనని ముందు ముందు అసలు షాకులిస్తామని చెబుతున్నారు. బీజేపీకి టీడీపీ మద్దతు ప్లస్ అయితే అది కేసీఆర్‌కు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అయ్యే అవకాశం ఉందనేది రాజకీయవర్గాల నమ్మకం.