Why is YSRCP highlighting Mavigan politically:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి సరికొత్త మలుపు తిరిగింది. అమరావతికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించి, రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిన తరుణంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్కోప్ లేకపోయినా ఈ అంశాన్ని వైసీపీ రోజూ ప్రస్తావిస్తూ చర్చకు పెడుతోంది. 

Continues below advertisement

 ఏమిటీ మావిగన్? జగన్ కొత్త వ్యూహం! 

అమరావతిని కేవలం ఒక పరిమిత ప్రాంతానికే పరిమితం చేయకుండా.. మచిలీపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN) ప్రాంతాలను కలుపుతూ 110 కిలోమీటర్ల మేర ఒక అర్బన్ కారిడార్‌ ను అభివృద్ధి చేయాలన్నదే జగన్ ప్రతిపాదన. దీనినే ఆయన మావిగన్ గా వ్యవహరిస్తున్నారు. అమరావతి ఒక  తెల్ల ఏనుగు  అని, అక్కడ మౌలిక సదుపాయాల కోసమే రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతాయని, అదే మావిగన్ కారిడార్‌లో ఇప్పటికే ఉన్న వనరులను వాడుకుంటే అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఆర్థిక మండలిని నిర్మించవచ్చని ఆయన వాదిస్తున్నారు.

Continues below advertisement

 ముగిసిన అధ్యాయం.. చట్టబద్ధమైన చిక్కులు 

రాజకీయంగా ఈ చర్చ ఎంత జోరుగా సాగుతున్నా, సాంకేతిక ,  చట్టపరమైన కోణంలో రాజధాని అంశం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏకై, శాశ్వత రాజధానిగా చట్టబద్ధత పొందింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని మార్చడం అంత సామాన్యమైన విషయం కాదు. భవిష్యత్తులో మరే పార్టీ అధికారంలోకి వచ్చినా, రాజధానిని మార్చాలంటే మళ్లీ పార్లమెంటులో చట్టసవరణ జరగాల్సి ఉంటుంది. ఈ కారణంగా మావిగన్ చర్చ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతుందని  భావిస్తున్నారు.

 వైసీపీ ఎందుకు ఈ అంశాన్ని చర్చకు పెడుతోంది? 

ఉపయోగం లేని ఈ అంశంపై వైసీపీ పదేపదే ఎందుకు మాట్లాడుతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అమరావతి నిర్మాణంపై జరుగుతున్న భారీ వ్యయం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తోందని ప్రజల్లో ఒక రకమైన ఆందోళన రేకెత్తించడం. రెండోది,  వికేంద్రీకరణ  అనే తమ పాత నినాదానికి కొత్త రూపమిచ్చి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తమ పట్టును కాపాడుకోవడం. మూడోది, చంద్రబాబు నాయుడి విజన్‌కు దీటుగా తమకూ ఒక బృహత్తర విజన్  ఉందని చెప్పుకోవడం అనుకోవచ్చు. 

 వ్యూహమా? అపసవ్య రాజకీయమా? 

మొదటి నుంచి వైసీపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు తరచుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో మూడు రాజధానుల అంశంపై ఐదేళ్ల పాటు కాలయాపన చేసి, చివరకు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. మళ్లీ అదే తరహాలో కొత్త నినాదాన్ని తీసుకురావడం చర్చనీయాంశమైంది. ఒకవైపు కోర్టులు, మరోవైపు పార్లమెంటు నిర్ణయాలు అమరావతికి అనుకూలంగా ఉన్నా, జగన్ మాత్రం తన  మావిగన్ 2029 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇది కేవలం తమ కేడర్‌ను ఉత్సాహపరచడానికి చేస్తున్న ప్రయత్నమా లేక భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం చేస్తున్న కొత్త ఎజెండానా అనేది వేచి చూడాలి. రాజధానిపై పదేపదే ఇలాంటి భిన్నమైన ప్రకటనలు రావడం వల్ల పెట్టుబడిదారులు వెనుకాడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ తర్వాత కూడా ఇంకా గందరగోళం సృష్టించడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అమరావతి పనుల్లో వేగం పెంచుతున్న తరుణంలో, వైసీపీ ఈ  మావిగన్  మంత్రాన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.