Pawan Vs YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నంగా ఉంటున్నాయి. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్‌సీపీ చాలా దారుణంగా దాడి చేస్తోంది. చంద్రబాబుకు దగ్గరవుతున్నారని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారనేదానికి ఒక్కో ఘటన చోటు చేసుకున్నప్పుడు ఈ దాడి మరింత తీవ్రంగా జరుగుతోంది. అయితే ఈ దాడి రాజకీయ అంశాలపై కాకుండా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతూండటం.. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అందుకుంటూడటంతో .. అసలు వైఎస్ఆర్‌సీపీ రాజకీయ వ్యూహం ఏమిటన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.
పవన్ పై ఎటాక్ తో ప్రజల్లో సానుభూతి పెరిగే చాన్స్
పవన్ కల్యాణ్ పై ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీ చేస్తున్న విమర్శలు చాలా దారుణంగా ఉంటున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థి అయినంత మాత్రాన అంత దారుణంగా విమర్శిస్తారా అన్న అభిప్రాయం సామాన్యుల్లో వస్తోంది. ఇంతకూ పవన్ ఏం చేశారంటే.. టీడీపీకి దగ్గరయ్యారు. రాజకీయాల్లో పొత్తులు సహజం. పొత్తులపై ఇతర పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తే చేయవచ్చు కానీ.. పొత్తు పెట్టుకుంటున్నారని ఇలా వ్యక్తిగత హననానికి పాల్పడటం మాత్రం రాజకీయాల్లో కొత్త ధోరణే. ఈ కారణంగా పవన్ కల్యాణ్ కూడా ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వారిని అదే తరహాలో విమర్శిస్తున్నారు. ఈ కారణంగా పవన్ కు ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం వైఎస్ఆర్‌సీపీకి తెలియదా అంటే...తెలియదని.. అంచనా వేయలేదని అనుకోలేం.
టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఇబ్బందని పవన్ ను రెచ్చగొడుతున్నారా ?
దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయ్.. మీ సామాజికవర్గం ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తూంటే.. చంద్రబాబుకు మద్దతిచ్చి ఆయనను సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్నావని వైఎస్ఆర్‌సీపీ నేతలు పవన్ కు చాలెంజ్ చేస్తున్నారు. అందుకే పవన్ చాలా తెలివిగా కౌంటర్ ఇచ్చారు. తన వెనుక తన సామాజికవర్గం లేకపోయినా పర్వా లేదని ప్రకటించారు. కులాల ఐక్యత అంటే.. అన్ని కులాలను కలుపుకుని పోవడమేనంటున్నారు. నిజానికి వైసీపీ నేతలు ఆయనను ఓ కులానికి పరిమితం చేయడానికో.. లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా చేయడానికో ఈ విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం.. చంద్రబాబు, పవన్ కలిస్తే తమ అధికారానికి ఇబ్బంది ఎదురవుతుందని ఫ్రస్ట్రేషన్ కు గురి కావడమేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు.పవన్ ఒంటరిగా పోటీ చేస్తే భారీగా ఓట్లు చీలి వైసీపీ సునాయాసంగా గెలుస్తుందని వారి ప్లాన్ కావొచ్చంటున్నారు.
పవన్ ను వ్యూహాత్మకంగా బలపర్చే ప్రయత్నం చేస్తున్నారా ?
పవన్ కు అత్యధిక ప్రయారిటీ ఇచ్చి విమర్శలు చేయడం వెనకు వైఎస్ఆర్‌సీపీ ప్రత్యేక వ్యూహం ఉందంటున్నారు. ఆయనను బలపర్చడం వల్ల కూడా మేలు జరుగుతుందని.. ఆ పార్టీ వ్యూహకర్తల అభిప్రాయం కావొచ్చంటున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరాలంటే సీట్ల మధ్య ఓ అవగాహనకు రావాలి. తనకు బలముందని.. తనకు క్రేజ్ పెరిగిందని పార్టీకి ఆదరణ పెరిగిందని జనసేన అనుకుంటే టీడీపీని ఎక్కువ సీట్లకు డిమాండ్ చేయవచ్చు. అప్పుడు రెండు పార్టీల మధ్య తేడాలొస్తాయి. చివరికి పొత్తులు పెట్టుకున్నా ఓట్ల బదిలీ సాఫీగా సాగదని ప్లాన్ కావొచ్చంటున్నారు. మొత్తంగా వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ అత్యంత వ్యూహాత్మకంగా ఉందని.. మాత్రం రాజకీయ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.