Telangana BJP Crisis : కొత్తగా వచ్చే వారికి టిక్కెట్ హామీ అని ఇటీవల తరుణ్ చుగ్ ప్రకటించారు. ఇలాంటి హామీ సాధారణంగా బీజేపీ ఇవ్వదు .కానీ ఇచ్చిందంటే వలసల కోసం ఆ పార్టీ ఎంతగా ఎదురు చూస్తుందో అనేదానికి సాక్ష్యం అనుకోవచ్చు. అయినా వలసలు భారీగా లేవు. దీనికి కారణం రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆశపడి పార్టీలో చేరిన వారిని ఎదగకుండా చేస్తున్నారన్న ప్రచారమే. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పిస్తాని.. ఈటల రాజేందర్‌కు చాన్సిస్తారని ఇటీవల ఒక్క సారిగా గుప్పుమంది. ఇదొక్కటే కాదు.. వరుసగా ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా పరిస్థితి ఉందని.. కాంగ్రెస్ పార్టీలా రోడ్డు మీదకు ఎక్కకపోయినా అంతర్గతంగా తీవ్ర సంక్షోభం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే వలసలు లేవంటున్నారు.
వలస నేతలకు దక్కని ప్రాధాన్యం !
బీజేపీ కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో చేరికల్ని ప్రోత్సహించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన నేతలందరూ చేరారు. తర్వాత ఈటల చేరారు. ఈటలతో పాటు పలువురు నేతలు చేరారు. అంతకు ముందే డీకే్ అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు చేరారు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు చేరారు. వీరందరితో మాత్రమే కాదు..వీరి రాకతో ఓ మూమెంటం వస్తుందని ... చేరికల వరద పారుతుందని అనుకున్నారు. కానీ బీజేపీ అనుకున్నది వేరు.. చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటి వాళ్లు బ్యాక్ టు పెవిలియన్ అయ్యారు. బీజేపీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి , విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వారి కిప్రాధాన్యత ఉండటం లేదు.
ఇతర రాష్ట్రాల్లో వలస నేతలకు సీఎం పదవులూ ఇచ్చిన బీజేపీ !
బీజేపీకి ఓ ప్రత్యేకమైన సిద్దాంతం ఉంది. ఆ పార్టీ సిద్ధాంతాన్ని పాటించేవాళ్లు మాత్రమే ఆ పార్టీలో ఇమడగలుగుతారు. అయితే పార్టీ మోదీ, అమిత్ షా చేతుల్లోకి వచ్చాక.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీలోకి నేతల వలస పెరిగింది. రావాలనుకునేవారిని మాత్రమే కాదు.. తాము కావాలనుకున్న వారినీ .. బీజేపీ ఆకర్షించింది. ఇలా బీజేపీ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ బలపడింది. ఇలా తమ పార్టీలో చేరిన వారిని బీజేపీ ఎక్కడా నిరాశపర్చలేదు. అసోం లాంటి చోట్ల ఏకంగా ముఖ్యమంత్రి పదవుల్నే ఇచ్చారు. ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ ప్రయోగించాలనుకున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. దీనికి కారణం.. ఇతర పార్టీలు కాదు.. తెలంగాణ బీజేపీ నేతలే.
పాత నేతల వల్ల ఇమడలేకపోతున్న వలస నేతలు !
తెలంగాణ బీజేపీలో వలస నేతల రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతోందన్న అభిప్రాయం ఉంది. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఆయన మాత్రమే ఫోకస్ అవుతున్నారని.. ఈటల గెలిచినా.. కేసీఆర్ ను టార్గెట్ చేసుకునేందుకు స్కోప్ ఉన్నా పడనీయలేదన్న విమర్శలు ఆ పార్టీలో ఉన్నాయి. తాను కేసీఆర్ పై పోటీ చేస్తానంటే.. దాన్నీ తప్పు పట్టారు. ఇక ఫైర్ బ్రాండ్ డీకే్ అరుణ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్లు ఉపఎన్నికలు వస్తే ఆ సమయంలోనే కనిపిస్తారు. వీరంతా.. ఇప్పుడు తమ సంగతేమిటో తేల్చాలని హైకమాండ్ వద్ద పంచాయతీ పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత బీజేపీలో ఈ పరిస్థితి ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు.