TDP Ready For Early Polls : ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఖాయమని తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఆ పార్టీ వ్యూహ కమిటీ భేటీలో ఈ మేరకు తీర్మానించేసుకుని  ఎన్నికల సన్నాహాలు కూడా ప్రారంభించాలని డిసైడయ్యారు. ముందస్తు ఉండదన్న నమ్మకంతోనే లోకేష్ వచ్చే ఎన్నికల వరకూ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఖాయమని నమ్ముతున్నారు. టీడీపీకి అందిన సమాచారం ఏమిటి ? వైఎస్ఆర్‌సీపీ అదే ఆలోచనల్లో ఉందా ?


పార్టీ క్యాడర్ ను రెడీ చేస్తున్న చంద్రబాబు !


ముందస్తు ఎన్నికల విషయంలో టీడీపీ చాలా నమ్మకంగా ఉంది. ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయిందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అప్పుల భారం మరింత ఎక్కువ అవుతుందని.. తీసుకున్న రుణాల చెల్లింపులకు వచ్చే ఆదాయం సరి పోదని.. అదే సమయంలో జీతాలు, బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో  కొత్త అప్పుల కోసం కేంద్రం అనుమతి ఇస్తుంది. ఆ అప్పులకు సంబంధించి ఆర్బీఐ వద్ద నాలుగైదు నెలల్లో మొత్తం తీసుకుని పథకాలకు నిధులు పంపిణీ చేసి ఎన్నికలకు వెళ్తారని టీడీపీ వ్యూహకర్తలు ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 


అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహాలపై చంద్రబాబు కసరత్తు !


రాష్ట్రంలోని 175 నియోజకవర్గా లను ఐదు జోన్లుగా విభజించి ముందస్తు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని టీడీపీ నిర్ణయానికి వచ్చింది.  పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంలో భా గంగా ప్రతి 35 నియోజకవర్గాలను ఒక జోన్‌గా విభజించాలని నిర్ణయించారు.  అలాగే జోన్ల వారీ గా సమావేశాన్ని కూడా నిర్వహించే తేదీలను కూడా ఖరారు చేశారు.  ఈ నెల 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు జోన్ల వారీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమా వేశాల్లో చంద్రబాబు  స్వయంగా పాల్గొం టారు.  21న కడపలో, 22న నెల్లూరులో, 23న అమరావతి లో, 24న ఏలూరులో, 25న వి శాఖలో పార్టీ జోన్‌ సమావేశాలు ఉంటాయి.


ఎన్నికల సన్నద్ధతపై సమావేశాల్లో కార్యాచరణ ! 


నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అవలంభించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై  జోన్ల సమావేశాల్లో చంద్రబాబు స్పష్టత ఇస్తారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్ర జల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.  అధికార పార్టీ లో దాదాపు 75 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా టీడీపీ హైకమాండ్ ఓ అంచనాకు వచ్చింది. పరిస్థితులు దిగజారక ముందే సీఎం జగన్ ఎన్నికలకు  వెళ్లే అవకాశం ఉందని ..టీడీపీకి  కి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న నేతలందరూ ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు.  జోన్ల వారీ సమావేశాల్లో నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, ముఖ్యనేతలు, క్లస్టర్‌ ఇంఛార్జ్‌లు, డివిజన్‌ ఇంఛార్జ్‌లు హాజరవనున్నారు. 


ముందస్తు వస్తే లోకేష్ పాదయాత్ర ఎలా ?


ముందస్తు ఖాయమనుకుంటున్న  తెలుగుదేశం లోకేష్ పాదయాత్ర విషయంలో మాత్రం క్లారిటీగానే ఉంది. సీఎం జగన్ అధికారికంగా అసెంబ్లీని రద్దు చేసే చివరి క్షణం వరకూ పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.  అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత  పరిస్థితిని బట్టి పాదయాత్ర పై నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ప్రజల్లో గ్రాఫ్‌ పడిపోవ డంతో పల్లె నిద్రలు, బస్సు యాత్రల పేరుతో జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని టీడీపీ నమ్ముతోంది.