Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నారు. అగ్రనేతలంతా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకున్నారు. కానీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. డీకే శివకుమార్ తో షర్మిల సమావేశం అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఢిల్లీలో రాహుల్, సోనియాలతో షర్మిల చర్చలు జరిపారు.. ఆ తర్వాత ఎలాంటి సమాచారం షర్మిలకు అందలేదు. ఆమె ఎదురు చూస్తున్నారు. శివకుమార్ కూడా ఏదీ చెప్పడం లేదు. దాంతో ముందు ముందు తన రాజకీయ భవిష్యత్‌పై షర్మిలకు టెన్షన్ ప్రారంభమయింది.
కాంగ్రెస్ లో విలీనంపై సమస్యలు
కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి షర్మిల సిద్ధంగా ఉన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం సిద్ధంగా లేరు. షర్మిల వల్ల ఒక్క ఓటు రాకపోగా.. భారీగా నష్టం జరుగుతుందని గట్టిగా హైకమాండ్ వద్ద వాదించారు. వారికి ఇష్టం లేకుండా షర్మిలను పార్టీలోకి తీసుకునేంత ధైర్యం హైకమాండ్ చేయలేకపోయింది. మరో వైపు షర్మిల కూడా తనకు తన అనుచరులకు టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారు. తనకు పాలేరు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని ఆమె పట్టుబడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఆమె వల్లనే నష్టం అనుకుంటూ ఉంటే.. ఇంకా టిక్కెట్లు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా పార్టీ విలీనానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
కాంగ్రెస్ తరపున ఏపీలో రాజకీయంకూ చాన్స్ లేనట్లే !
ఎలా చూసినా తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు ఇప్పుడు ఎలాంటి స్థానం కనిపించడం లేదు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా దాని వల్ల వచ్చిన ఇంపాక్ట్ అసలు లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే్ సమయంలో ఆమె పార్టీకి నిర్మాణం లేదు. కనీసం నిర్మాణం లేకపోవడం వల్ల అభ్యర్థులు కూడా లేరు. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో లీడర్ అంటే షర్మిల మాత్రమే. ఆమె విలీనం చర్చల గురించి బయటకు చెప్పకుండా ఉంటే.. కనీసం తాను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గంలో అయినా బలంగా ఉండేవారన్న అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. ఏపీలో రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు జరుగుతుందని చెప్పుకున్నారు. షర్మిల కూడా ఆసక్తి చూపించారని కానీ.. చివరి క్షణంలో హైకమాండ్ హ్యాండిచ్చిందని చెబుతున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల అవసరం లేదని భావిస్తోందా ?
షర్మిలతో వ్యవహరిస్తున్న విధానం చూస్తే కాంగ్రెస్ హైకమాండ్.. ఇక షర్మిలతో పని లేదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమె వల్ల ఉపయోగంలేదని అనుకుంటున్నారు. పార్టీని విలీనం చేయడం వరకూ ఓకే కానీ.. ఎక్కడ బాధ్యతలివ్వాలి.. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది తమకు వదిలేయాలని హైకమాండ్ సూచించే అవకాశం ఉంది. ఈ నిబంధనకు షర్మిల ఒప్పుకుంటారో లేదో కానీ.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల వరకూ చూస్తే.. షర్మిల తెలంగాణ రాజకీయాలకూ దూరమవుతున్నట్లుగానే ఉందన్న వాదన వినిపిస్తోంది.