AP Fake Vote Politics :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓటర్ల జాబితా అంశం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్‌సీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్లను గుర్తించామని తీసేయాలని ఫామ్ 7లు  అప్లయ్ చేస్తున్నారు. అయితే  వైసీపీ కుట్ర పూరితంగా నిజమైన ఓటర్లను.. తమ పార్టీకి ఓటు వేయని వారిని వాలంటర్ల ద్వారా గుర్తించి.. తీసేస్తుందని ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమేనని మండి పడుతోంది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ అంశంపై చేసిన పోరాటానికి ఈసీ చాలా ఆలస్యంగానైనా  స్పందించింది. పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఒక్క  ఉరవకొండ కాదని దేశం మొత్తం అదే పరిస్థితి ఉందని టీడీపీ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయింది. 


ఏ రాష్ట్రంలోని ఓటర్ల జాబితా గందరగోళం ఏపీలోనే ఎందుకు ?


ప్రజాస్వామ్యంలో ఓటర్లు ముఖ్యం.  దేశంలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు  హక్కు ఉంటుంది. కానీ ముందుగా జాబితాలో ఉండాలి. అలా జాబితాలో లేకుండా ఎవరికైనా ఓటు నిరాకరిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఓటర్ల జాబితా అంశంలో సీరియస్ గానే ఉంటారు. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా జోలికి అధికార పార్టీలు కూడా వెళ్లవు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఈసీ వద్ద ఉన్న ఓటర్ల జాబితాను తీసుకుని తాము సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాయి  రాష్ట్ర ఎన్నికల సంఘాలు. అప్పుడు కొన్ని ఓట్లు గల్లంతవుతాయన్న  ఆరోపణలు వస్తాయి. కానీ ఇప్పుడు ఏపీలో  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయాల్సిన వారి జాబితా మ్యానిపుల్టే అయిపోయిందన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. 


మైక్రో లెవల్‌లో సమాచార సేకరణ చేసిన వైఎస్ఆర్‌సీపీపైనే విమర్శలు  


వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం ఇంటి సమాచారాన్ని సేకరించింది. ఆ ఇళ్లలోని వారు ఎవరి ఓటర్లు అనేది కూడా మ్యాపింగ్ చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా సేకరించిన సమాచారం అంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థకు వెళ్తుందని.. పవన్ కల్యాణ్ ఆరోపించారు. అక్కడ్నుంచి వచ్చిన విశ్లేషణ మేరకు క్షేత్ర స్థాయిలో బీఎల్వోలు , అధికారులు కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను తీసేస్తున్నారని అంటున్నారు. ఓటర్లు ఉన్న చోటనే  ఉండరు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు. కానీ ఓటేయడానికి ఇంటికే వస్తారు. ముఖ్యంగా పట్టణాలకు ఉపాధి కోసం వెళ్లిన  చాలా మంది తమ ఓట్లను గ్రామాల్లో...  సొంత ఊళ్లలోనే ఉంచుకుంటారు. వీరి ఓట్లు తీసేయడం అక్రమమే. అయినా ఇలాంటి వారిన  టార్గెట్ చేసుకుని తీసేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లు తీసేస్తే.. పది  వేల ఓట్లు కలిసి వచ్చినట్లే ! 


మనది  మెజార్టీ ప్రజాస్వామ్యం.అంటే పోటీ దారుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజేత. బరిలో ఐదుగురు ఉండి.. వంద ఓట్లు పోలైతే.. ఎవరికైనా 21 ఓట్లు వస్తే వారే విజేత. ఆయనకు వ్యతిరేకంగా 79 ఓట్లు వచ్చాయన్నది లెక్క కాదు. ఈ సమీకరణాలు చూసుకుంటే..  ప్రతీ నియోజకవర్గంలో ఐదు నుంచి పది వేల ఓట్లు  ప్రత్యర్థి పార్ట సానుభూతి పరులవి తప్పిస్తే ఫలితం తారుమారవుతుంది. కానీ ప్రజాస్వామ్యం తలకిందులవుతుంది. ఇప్పుడు ఏపీలో ఏదే చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఈసీకి చేసిన ఫిర్యాదులో ఓట్ల తొలగింపు కోసం అధికారులు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారని వెల్లడించారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి,  మంత్రి సీదిరి అప్పలరాజు నేరుగానే మన పార్టీ ఓట్లు కాకపోతే అబ్జెక్షన్ చెప్పాలని క్యాడర్ ను ఆదేశించారు. అంటే అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే  ఓట్లను తొలగించే ప్రయత్నం  చేస్తున్నారన్న అనుమానాలు  బలపడుతున్నాయి. 


అవన్నీ దొంగ ఓట్లు అంటున్న వైసీపీ


అయితే వైసీపీ మాత్రం  భిన్నమైన వాదన  వినిపిస్తోంది. టీడీపీ హయాంలో ఒక్కో నియోజకవర్గంలో పదిహేను వేలకుపైగా దొంగ ఓట్లు నమోదు చేశారని వాటిని తొలగించేదుకు తాము పట్టుబడుతున్నామని  అంటున్నారు. అప్పట్లో అన్ని దొంగ ఓట్లు నమోదైతే..  టీడీపీ ఎందుకు అంత ఘోరంగా ఓడిపోతుందనేది సగటు ఓటర్ కు వచ్చే సందేహం. కారణం ఏదైనా అనర్హులకు.. ఓట్లు ఉండటం ఎంత తప్పో.. అర్హులకు ఓట్లు తీసేయడం కూడా అంతే  తప్పు. ఏది జరిగినా ప్రజాస్వామ్యానికి ముప్పే. ఈసీ సీరియస్ గా తీసుకుంటే... ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక  ఉన్న రాజకీయ నేతలకు ఏమీ కాదు.. కానీ వారు చెప్పినట్లుగా చేసిన అధికారులు మాత్రం బలైపోతారు. ఇప్పటికే అనంతపురంలో అదే జరిగింది.