AP NDA Alliance :   ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలన్నీ బీజేపీతో సఖ్యతగా ఉంటున్నాయి. బీజేపీ నేతృత్వంలోని అధికార పార్టీ కూటమి ఎన్డీఏలో భాగం అయ్యేందుకు అన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. జనసేన పార్టీ ఇప్పటికే ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంది. ఇక ప్రధాన పార్టీలైన జనసేన, వైసీపీల సంగతి చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీల్లో  ప్రధాని మోదీ, అమిత్ షా ఎవర్ని ఎంచుకుంటే వారు ఎన్డీఏలో చేరిపోతారు. తిరస్కరించడానికి అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ ఎవర్ని ఎంచుకుంటుందన్నది సస్పెన్స్ గా మారింది. 


ఎన్డీఏ కూటమి సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ


భారతీయ జనతా పార్టీకి  రెండు సార్లు ఫుల్ మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాన్నే కొనసాగిస్తున్నారు. కేబినెట్ లో బీజేపీ మంత్రులే కాకుండా మిత్రపక్షాలకూ అవకాశం కల్పిస్తున్నారు. కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్ రాను రాను చిక్కిపోయింది. బీజేపీ తప్ప కాస్త బలంగా ఉండే పార్టీ ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ కూటమిని బలోపేతం  చేయాలనుకుంటున్నారు.  కాంగ్రెస్ తో పాటు కలిసి నడిచేందుకు పద్దెనిమిది పార్టీలు రెడీ కావడంతో.. తమ కూటమిలోనూ అంత బలం ఉందని నిరూపించాలని  బీజేపీ అనుకుంది. అందుకే దూరమైన మిత్రపక్షాలను కూడా పిలిచి పద్దెనిమిదో తేదీన ఎన్జీఏ సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. 


టీడీపీకి బీజేపీ దగ్గర కాకూడదని కోరుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ !


ఇదే సమయంలో ఏపీలో ఎన్డీఏ కూటమిలో గతంలో ఉన్న టీడీపీకి కూడా ఆహ్వానం పలికారని జాతీయ చెబుతోంది.  అయితే  ఈ విషయం లో స్పష్టత లేదు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ కూడా తాము ఎన్డీఏలో చేరుతామన్న ఆసక్తిని కనబరుస్తోంది. బయటకు చెప్పడం లేదు కానీ.. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేరకుండా చేయడానికైనా తాము బీజేపీ కూటమిలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలకు కూడా చెప్పారని అంటున్నారు. ఇటీవల ఓ హిందీ చానల్ లో వచ్చిన సర్వే రిపోర్ట చూపించి పార్లమెంట్ సీట్లు ఏపీలో ఇతర పార్టీలకు వచ్చే అవకాశం లేదని.. బీజేపీ పెద్దలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వారి వైపు నుంచి ఎలాంటి స్పందన ఉందన్నది స్పష్టత లేదు. బహుశా.. పద్దెనిమిదో తేదీన ఎన్డీఏ మీటింగ్‌కు వైఎస్ఆర్‌సీపీకి ఆహ్వానం వస్తే.. ఆ పార్టీనే కూటమిలో బీజేపీ కోరుకుంటోందని అనుకోవచ్చు. 


ఎన్డీఏలో చేరికపై కాలమే  చెబుతుందంటున్న టీడీపీ ! 


మరో వైపు తెలుగుదేశం పార్టీ గతంలో బీజేపీకి దూరమై తప్పు చేశామని అనుకుంటోంది. అందుకే బీజేపీ విషయంలో సానుకూలంగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల.. తాను మోదీ విధానాలను సమర్థిస్తానని చెబుతున్నారు. ఎన్డీఏలో చేరిక అంశంపై కాలమే నిర్ణయిస్తుందని ప్రకటించారు.  ఆ తర్వాత  అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. అయితే  అంశంపై ఆయన ఎక్కడా మాట్లాడటం లేదు. పార్టీ నేతలను కూడా మాట్లాడవద్దని అంటున్నారు. బీజేపీ నేతలు కూటమిలో టీడీపీ ఉండాని కోరుకుంటే..ఎన్డీఏ సమావేశానికి పిలిచే అవకాశం ఉంది. జాతీయ మీడియా టీడీపీని కూడా పిలిచారని చెబుతోంది. ఈ అంశంపై టీడీపీ, బీజేపీల్లో స్పష్టత లేదు. 


బీజేపీ ఎవరు కోరుకుంటే వారే కూటమిలోకి !


ఏపీలో మూడు పార్టీలు ఉన్నాయి. జనసేన కాకుండా మిగిలిన రెండు పార్టీల్లో ఏ పార్టీ  కూటమి ఉండాలని కోరుకుంటే ఆ పార్టీ ఉంటుంది. బీజేపీ ఏ పార్టీని కోరుకుంటుందన్నదే కీలకం. కూటమిలో టీడీపీ చేరడానికి ఆ పార్టీకి సమస్యలేమ ఉండవు. కానీ వైసీపీకి మాత్రం సమస్యలు వస్తాయి. ఆహ్వానాన్ని తిరస్కరించలేరు.  ఎన్డీఏలో చేరితే కోర్ ఓటు బ్యాంక్ .. కొంత దూరం అవుతుంది. అదే జరిగితే విజయావకాశాలపై ప్రభావం పడుతుంది.