టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎన్నారైలను ఇబ్బందులు పెడితే సహాయం చేసేందుకు భవిష్యత్‌లో ఎవ్వరూ ముందుకు రారని ఘాటుగా వ్యాఖ్యానించారు.


ఆంధప్రదేశ్ పాలిటిక్స్‌లో నిత్యం ఏదోక సంచలనం వెలుగు చూస్తోంది. జనవరి ఒకటో తేదీన గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ తొక్కిసలాట రాజకీయంగా సంచలనం రేకెత్తించింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయింది. కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించిన ఉయ్యూరు శ్రీనివాసరావు అనే ఎన్నారైపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. 


ఈ ఘటనను ఆధారంగా చేసుకొని సభలు, సమావేశాల నిర్వాహణపై ఆంక్షలను వైసీపీ ప్రభుత్వం విధించింది. అంతే కాదు మంత్రులు, వైసీపీ లీడర్లు టీడీపీ, శ్రీనివాసరావును కార్నర్‌ చేశారు. ఈ హాట్ కామెంట్స్ నడుస్తున్న టైంలోనే వైసీపీ మైలవరం శాసన సభ్యుడు వసంత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఉయ్యూరు శ్రీనివాసరావు తనకు మంచి మిత్రుడని ఆయన అందరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పని చేస్తారని కితాబిచ్చురు. ఎన్నారైలపై ఇలాంటి కేసులు పెడితే భవిష్యత్‌లో రాష్ట్రంలో సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారని వసంత అన్నారు. దీంతో వైసీపీలోనే ఈ వ్యవహరం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది.


పార్టీ, ప్రభుత్వం ఒక లైన్‌లో ఉంటే... వసంత కృష్ణ ప్రసాద్‌ మరో లైన్ తీసుకున్నారు. అంటే వైసీపీ గీసిన లైన్ క్రాస్ చేశారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరి ఇప్పుడు దీనిపై వైసీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో... లేకుంటే లైట్ తీసుకుంటుందో అన్న చర్చ నడుస్తోంది. అసలు వసంత ఈ కామెంట్స్ చేయడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉందంటున్నారు ఆయన గురించి తెలిసిన లీడర్లు. 
 
మైలవరంలో వసంత ఇష్యూ ఇదే...


మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఇటీవల కాలంలో విభేదాలు బయటపడ్డాయి. గతంలో నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా పని చేసిన ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌తో వసంతకు విభేదాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇరువురు నేతలను వైసీపీ సలహాదారు సజ్జల విడివిడిగా పిలిపించి మాట్లాడారు. ఆ తరువాత వసంత నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలో భాగంగా జగన్ వద్ద కూడా జోగి వ్యవహరాన్ని ప్రస్తావించారు. అయితే జగన్ వీటిని తరువాత చూద్దాంలే అన్న...అంటూ వసంతతో అన్నారట. అయితే స్థానికంగా మాత్రం ఇద్దరు నేతల మధ్య విభేదాలు తగ్గేదేలే అన్నట్లుగా నడుస్తున్నాయి.


వాయిస్ పెంచిన వసంత.....


జోగి రమేష్‌తో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని వసంత పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాను రాను ఇబ్బందులు ఎక్కువ కావటంతో వసంత ఈ విషయాలపై పార్టీ నాయకులతో చర్చించటంతో ప్రచారం కూడా పెరిగింది. ఆ తరువాత బహిరంగంగానే జోగితో ఉన్న విభేదాలపై వసంత వ్యాఖ్యాలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ నుంచి అత్యంత కీలకమైన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. దేవినేని ఉమాను ఎదుర్కోవాలంటే జోగి రమేష్‌కు బలం లేదని వసంత వర్గం ప్రచారం చేస్తోంది. ఇదే ఈక్వేషన్‌ను వసంత తన బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే సైలెంట్‌గా రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్న వసంత స్వరం పెంచుతున్నారట. అదే బలంతో మిత్రుడు ఉయ్యూరు శ్రీనివాస్‌కు సపోర్ట్‌గా నిలిచారట. ఈ కారణంగానైనా తన బాధను అధిష్ఠానం పట్టించుకొని మైలవరం జోలికి రావద్దని జోకి రమేష్‌కు చెబుతుందని వసంత ప్లాన్ అంటున్నారు.