Mamata Banerjee not resign:  పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరించడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. దీన్ని చాలామంది ఆమె సాగిస్తున్న రాజకీయ నాటకం గా ఎక్కువ మంది భావిస్తున్నారు.  రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆమె ఎంతగా నిరాకరించినప్పటికీ, చట్టపరంగా ఆ కుర్చీలో కొనసాగడం అసాధ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు వెలువడిన తర్వాత, పాత ప్రభుత్వం తప్పుకోవాల్సిందేనని రాజ్యాంగ సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

 ఆర్టికల్ 164: గవర్నర్ సంతృప్తి ఉన్నంత వరకే!                   

భారత రాజ్యాంగంలోని  ఆర్టికల్ 164  ప్రకారం.. ముఖ్యమంత్రి పదవి అనేది గవర్నర్  అభీష్టం  మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అభీష్టం అంటే గవర్నర్ వ్యక్తిగత ఇష్టం కాదు, సదరు ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మెజారిటీ మద్దతు ఉందా లేదా అనేది మాత్రమే. ఎన్నికల ఫలితాల ద్వారా తృణమూల్ కాంగ్రెస్ తన మెజారిటీని కోల్పోయిందని స్పష్టమైన తర్వాత, మమత ఆ పదవిలో కొనసాగే నైతిక, రాజ్యాంగ హక్కును కోల్పోయినట్లే.

 ఐదేళ్ల గడువు.. అంతకు మించి సాధ్యమా?                   

ఆర్టికల్ 172 ప్రకారం శాసనసభ గడువు ఐదేళ్లు మాత్రమే. ఒక సారి కొత్త ఎన్నికల ఫలితాలు వెలువడి, కేంద్ర ఎన్నికల సంఘం గెలిచిన అభ్యర్థుల జాబితాను నోటిఫై చేసిన తర్వాత, పాత అసెంబ్లీ రద్దవుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. సంఖ్యాబలం లేని పక్షంలో, మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా.. గవర్నర్ తనకున్న విచక్షణాధికారంతో కొత్తగా మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించవచ్చు.

గవర్నర్ ముందున్న మార్గాలు..                         

ఒకవేళ మమత మొండిగా రాజీనామా లేఖ ఇవ్వకపోతే, గవర్నర్ నేరుగా రంగంలోకి దిగుతారు. మెజారిటీ సాధించిన పార్టీ నేతను పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరతారు. అదే సమయంలో పాత మంత్రివర్గాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం పడిపోయినప్పుడు, ముఖ్యమంత్రి అంగీకారంతో సంబంధం లేకుండానే గవర్నర్ ఆమెను పదవి నుంచి తొలగించే అధికారం కలిగి ఉంటారు. కాబట్టి ఆమె రాజీనామా చేయకపోయినా, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన క్షణమే ఆమె మాజీ అయిపోతారు.

 రాజకీయ నిరసన మాత్రమే!                           

ప్రస్తుతం మమత చేస్తున్న ప్రకటనలు కేవలం రాజకీయంగా తన నిరసనను వ్యక్తం చేయడానికి, ఈవీఎంలపై తన అనుమానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె రాజీనామా చేయకపోవడం వల్ల ఒరిగేదేమీ లేదు సరే కదా, అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలమే శాసిస్తుంది కాబట్టి, బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం చట్టపరంగా ఎవరూ ఆపలేరు.