Kcr Reservation Politics :  తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ రాజకీయ వ్యూహంతో ఎస్టీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారో కానీ దాన్ని రాజకీయంగా ఎలా లాభం కలిగేలా మల్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. వారంలో జీవో ఇచ్చేస్తాను కేంద్రం అంగీకరించకపోతే అప్పుడు చూస్తానని సవాల్ చేశారు కేసీఆర్. కానీ పది రోజులు అవుతున్నా జీవో జారీ చేయలేకపోయారు. ఎలా జీవో జారీ చేయాలన్నదానపై విస్తృతమైన చర్చలు జరుపుతున్నారు. కానీ సేఫ్‌గా రిజర్వేషన్లు ఇచ్చే మార్గం కనిపించడం లేదు. పోటీగా ముస్లింలు మా రిజర్వేషన్ల సంగతేంటి అని తెర ముందుకు వస్తున్నారు. 


రిజర్వేషన్ల జీవో కోసం ఎదురు చూస్తున్న ఎస్టీ వర్గం ! 


వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్ల జీవో జారీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ పది రోజులైంది. జీవో జారీ కాలేదు. న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఒక్క సారి జీవో ఇస్తే రిజర్వేషన్ల తుట్టెను కదిలించినట్లేనని అది మొత్తానికే మోసం తెస్తుందన్న ఆందోళన పార్టీలో వ్యక్తం కావడం వల్లే ఆగిందని చెబుతున్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధినతే కేసీఆర్ ఎస్టీలు, ముస్లింలకు చెరో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో 2017లోనే తీర్మానం చేశారు. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ఒకే బిల్లును కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం మాత్రం అంగీకరించలేదు. అసలు ఆ తీర్మానాన్ని పట్టించుకోలేదు. 


తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్న ముస్లింలు 


ఇప్పుడు ఇప్పుడు ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల కోసం జీవో ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఓవైసీ ముస్లింల రిజర్వేషన్ల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మజ్లిస్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముస్లిం వర్గాల మద్దతు టీఆర్ఎస్‌కు ఎంతో బాగా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారాయి. ముస్లింలకు రిజర్వేషన్ల జీవో ఇస్తే.. అది బీజేపీకి ప్రత్యేకంగా ఇచ్చిన అస్త్రం అవుతుంది. ఎస్టీ, ముస్లింల కోసం వేర్వేరుగా జీవోలిస్తే ఇతర వర్గాలు వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పుడు కేసీఆర్ ముందున్న అది పెద్ద సవాల్. 


రిజర్వేషన్ల జీవోకు కేంద్ర అనుమతి అవసరం లేదు !


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16(4) ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ఇప్పుడు ఎస్టీల రిజర్వేషన్‌ను పెంచుతోంది. ఏడాది క్రితం వరకు.. రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్‌ పెంచుతూ జీవో జారీ చేసినా కేంద్రం ఆ జీవోను నోటిఫై చేయాల్సి ఉండేది. కానీ, గత ఏడాది జరిగిన ఆర్టికల్‌ 342(ఏ) 105వ సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్‌ పెంచుతూ జారీ చేసే జీవోకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు.  ఇప్పుడు జీవో జారీ చేసి రిజర్వేషన్లను తెలంంగాణ సర్కార్ అమలు చేయవచ్చు.    కానీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఎవరైనా కోర్టుకు వెళ్తే రిజర్వేషన్లు ఆగిపోయే అవకాశం ఉంది.  


ఇచ్చిన తర్వాత కోర్టుల్లో ఆగిపోతే ప్రభుత్వంపై మరింత ఆగ్రహం పెరుగుతుంది. ఈ విషయంలో కేంద్రం పాత్రమే లేదీని వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్రం పాత్ర ఉంది. తెలంగాణ సర్కార్ పంపించిన  తీర్మానాన్ని అంగీకరించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తే తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఇవ్వవొచ్చు. కానీ ఆ విషయాన్ని టీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసకెళ్లలేకపోతోంది.