TDP BJP :  ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరాలని బారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుటోంది. జాతీయ మీడియాలో ఈ అంశంపై తరచూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.  చంద్రబాబునాయుడు కూడా తాము బీజేపీ విధానాలతో ఏకీభవిస్తామని ప్రకంచారు. మోదీ పరిపాలన విధానాన్ని ఆయన సమర్థించారు. అయితే ఎన్డీఏలో చేరికపై మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు. ఏదీ తేల్చడం లేదు. గతంలో ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయ్యారు. తర్వాత  వారు ఏపీలో బహిరంగసభలు పెట్టి వైసీపీని విమర్శించారు. రాష్ట్రంలోనూ వైసీపీపై బీజేపీ నేతలు యుద్ధం ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్డీఏలో చేరడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆయన  ఎందుకు సందేహిస్తున్నారన్న అంశం జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశం అవుతోంది. 


ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై చర్యలు కోరుతున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఇంత కాలం కేంద్రం పట్టించుకోకపోయినా ఎన్నికలకు ముందు వాటిపై కేంద్రం చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. గత వారం టీడీపీ అధినేత కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. అది సుదీర్ఘమైన లేక. 9 పేజీల్లో తన ఏపీ ప్రభుత్వ  రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు తనపై జరిగిన  ఉద్దేశపూర్వక దాడులు, హత్యాయత్నాల కుట్రలు చెబుతూ.. తన ప్రాణానికీ ముప్పు ఉందన్న సందేశం పంపారు. దీనికి సాక్ష్యంగా 70పేజీలకుపైగా డాక్యుమెంట్లు, వీడియోలు పంపించారు. వీటిపై చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ఆశిస్తున్నారు. తాను రాసిన లేఖలో ఉన్న అంశాలపై కేంద్రం స్పందిస్తే.. ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు అంగీకరించే అవకాశం ఉంది. 


వైసీపీపై విమర్శలకే ఇప్పటి వరకూ బీజేపీ సరి - సహకారం ఆపేస్తుందా?


వైసీపీతో బీజేపీ ఎప్పుడూ సన్నిహితంగా లేదు. కానీ బీజేపీతో వైసీపీ ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటోంది. బహిరంగంగా వైసీపీ మద్దతును బీజేపీ ఏ సందర్భంలోనూ కోరలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రతి సందర్భంలోనూ  బీజేపీకి మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇలాంటి మద్దతు ప్రకటన సమయంలో అయినా రాష్ట్రానికి రావాల్సిన అంశాల్లో ఒకటి, రెండు షరతులు  పెట్టే ప్రయత్నాలు కూడా చేయలేదు. అంటే.. వైసీపీ.. తాము బీజేపీకి అనధికారిక మిత్రపక్షం అన్నట్లుగా  వ్యవహరిస్తోంది. వైసీపీతో సంబంధాలున్నాయని  బీజేపీ ఎప్పుడూ అంగీకరించదు. అదే సమయంలో.. రాష్ట్రంలో అవినీతిపై ఇటీవలి కాలంలో విమర్శలు కూడా ప్రారంభించారు. అయితే.. కేంద్రం సహకారం వల్లేనే రాజ్యాంగ వ్యతిరేకంగా సీఎం జగన్ అప్పులు చేస్తున్నారని.. వాటి వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోందని టీడీపీ ఆందోళన చెందుతోంది. అప్పుల విషయంలో నిబంధనలు పాటించాలని కోరుతోంది. ఏం జరిగిందో కానీ ఇటీవల లిక్కర్ బాండ్లను బీఎస్‌ఈలో లిస్టింగ్ చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. గతంలో కేంద్రం సహకరించింది.. ఈపీఎఫ్‌వోను రంగంలోకి దింపి బాండ్లను కొనుగోలు చేసేలా చేసింది. ఈ సారి మాత్రం అలాంటి సహకారం అందలేదని బాండ్లకు ఎనరూ కొనకపోవడంతో అర్థమైందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడే అంచనాకు రాలేమని.. జగన్ ప్రభుత్వంపై నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే నమ్మవచ్చని టీడీపీ భావిస్తోంది. 


బీజేపీ ఆలోచనలేంటి ?


వైసీపీని మిత్రునిగా చూడలేరు. అలాగని  శత్రువు కాదు. వైసీపీ ఉన్న ఎంపీల బలం.. పూర్తిగా బీజేపీదే. వారు కోరే కొన్ని పనులు చేస్తే చాలు .. ఇతర విషయాల్లో ఇబ్బంది  పెట్టారు. మనతో స్నేహంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటే ఎలా అన్న మీమాంస బీజేపీ నేతల్లో ఉందని చెబుతున్నారు. ఇప్పుడున్నట్లుగా ఉంటే..ఏపీలో రెండు పార్టీలు బీజేపీకి మద్దతుగానే ఉంటాయి. అంటే.. ఎవరు గెలిచినా పాతిక సీట్ల మద్దతు బీజేపీకే ఉంటుంది. కానీ రాజకీయం అంటే అవకాశ వాదం. కూటమిలో లేకపోతే.. వచ్చే ఎన్నికల తర్వాత ఎవరు ఏ వైపు ఉంటారో చెప్పడం కష్టం. ఢిల్లీలో తిప్పేందుకు చక్రం కోసమే చూస్తున్నామని అన్ని  పార్టీలు చెబుతున్నాయి. దురదృష్టం కొద్దీ బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చిందని జగన్  కూడా ఓ సారి వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో  బీజేపీ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది.