AP Capital Row :   ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు లైవ్‌లో ఉంచడానికే ప్రయత్నిస్తోంది. సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ మంత్రులు సబ్ జ్యూడిస్ అవుతుందన్న  భయం కూడా లేకుండా ఉగాది నుంచి రాజధాని తరలిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఏప్రిల్ వరకూ అవసరం లేదు. తర్వాతి రోజే తరలించుకోవచ్చు. కానీ కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోయినా.. విచారణ పూర్తి కాకపోయినా తరలించడం సాధ్యం కాదు. ఆ విషయం మంత్రులకూ తెలుసు. మరి అయినా ఎందుకు తరలింపు ప్రకటనలు చేస్తున్నారు ? రాజధాని అంశాన్ని లైవ్ లో ఉంచడానికా ? ప్రజల్లో గందరగోళం ఏర్పర్చే రాజకీయ వ్యూహమా ?


కోర్టు తీర్పు అనుకూలంగా రాకుండా రాజధానిని తరలించడం అసాధ్యం !


అమరావతి రాజధాని కోసం రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాలను ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం లేదని రిట్ ఆఫ్ మాండమస్ విధించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సీఆర్డీఏ చట్టం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన  తీర్పుపై  మాత్రమే స్టే ఇచ్చారు. కానీ రిట్ ఆఫ్ మాండమస్ పై మాత్రం ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతివాదంలదరికీ నోటీసులు జారీ చేశారు. 261  మంది ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేస్తారు. వారి వాదనలు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. 31వ  తేదీన విచారణ జరగనుంది. ఆ రోజున సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఒప్పించి... రాజధాని తరలింపు వద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశంపైనా  అంశంపైనా స్టే తెచ్చుకుని.. తరలింపు కోసం సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటే  ఏ సమస్యా లేకుండా తరలించుకోవచ్చు. లేకపోతే సాధ్యం కాదు. 


29వేల మంది రైతులకు న్యాయంతో ముడిపడి ఉన్న అంశం !


రాజధాని అనే విషయంలో రైతులు స్టేక్ హోల్డర్లు కాకపోతే అసలు వివాదం అయ్యేది కాదు. రాజధాని కోసం వారు భూముల్ని ఇచ్చారు. భూముల్ని ఇచ్చినందుకు  వారికి కల్పిస్తామన్న ప్రయోజనాలు .. ఇస్తామన్న ప్లాట్లు.. భవిష్యత్‌పై నమ్మకం కల్పించాల్సి ఉంది. అలా కల్పించకపోతే చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ఈ రైతుల దగ్గర గతంలో ప్రభుత్వం భూసేకరణ చేసి ఉన్నాసమస్య ఉండేది కాదు. రైతులందరికీ నష్టపరిహారం చెల్లించేసి.. రాజధానిని తరలించేవారు. కానీ భూసమీకరణ చేశారు. అంటే రైతులకు రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అభివృద్ధి ఫలాల్ని అందిస్తామన్నారు. ఇప్పుడు రాజధాని తరలిస్తే రైతులు అన్యాయమైపోతారు. ఇలా తమను సుప్రీంకోర్టు అన్యాయం చేస్తుందని రైతులు కూడా అనుకోవడం లేదు. అందుకే రాజధాని తరలించాలంటే ముందుగా రైతులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా అంత తేలికగా జరగే విషయం కాదనేది నిపుణుల మాట. 


మంత్రుల ప్రకటనలు దేని కోసం ?


మంత్రి గుడివాడ అమర్నాథ్ .. మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఉగాదికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు వస్తుందని చెబుతున్నారు. శాఖల తరలింపు కూడా ఉంటుందని అంటున్నారు. విద్యాశాఖ కార్యాలయం అందరి కంటే ముందే విశాఖకు వస్తుందని.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఉద్యోగులంతా తమ పిల్లలను విశాఖ స్కూళ్లలో చేర్పించుకునేలా చూస్తారని అంటున్నారు. అయితే అదే సమయంలో.. రాజ్యాంగంలో రాజధాని అన్న ప్రస్తావనే లేదని.. సీఎం ఎక్కడి నుంచి  పరిపాలిస్తే అదే రాజధాని అనే కోణంలో సీఎం జగన్ విశాఖ వెళ్లి పరిపాలిస్తారని అంటున్నారు. అప్పుడు ఇది అధికారిక తరలింపు కాదు. అది మరో వివాదం అవుతుంది. 


ఎలా చూసినా రాజధాని విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రకటనలు.. పూర్తి స్థాయి గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. పూర్తి క్లారిటీగా ఏ పనీ చేయలేకపోతున్నారు. ఇంత అర్జంట్‌గా ఇలా ఎందుకు తరలించాలనుకుంటున్నారో కూడా స్పష్టత లేదు. అన్ని రకాల న్యాయపరమైన చిక్కులు తొలగిపోయేలా చేసుకునే వెళ్లవచ్చు కదా అన్న వాదన వినిపిస్తుంది. కానీ ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను అంచనా  వేయడం చాలా కష్టం