కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా  పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై గెలిచిన శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్, ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీకి దగ్గర అవటాన్ని టీడీపీ పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ, వల్లభనేని వంశీ మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి టీడీపీపై విమర్శలు చేయటంతో వల్లభనేని వంశీ టీడీపీకి పూర్తిగా టార్గెట్ అయ్యారు. రాజకీయాల్లో పార్టీలు మారటం, అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరగా వెళ్ళాలనుకోవటం కామన్ గా జరిగే విషయాలే.  అయితే రాజకీయాల కోసం గెలిచిన పార్టీని విమర్శించటం, ఆ పైన నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ ,భువనేశ్వరి లను టార్గెట్ చేసి అసభ్యంగా కామెంట్స్ చేయటం, అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఘటన తరువాత, చంద్రబాబు కన్నీరు పెట్టుకోవటం వంటి విషయాల్లో కొడాలి నానితో పాటుగా వంశీ పాత్ర కూడా ఉందనే ఆరోపణలతో  టీడీపీ శ్రేణులు వంశీని పూర్తిగా వ్యతిరేకించాయి. అయితే అసెంబ్లీ ఘటన తరువాత వంశీ నారా భువనేశ్వరికి బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు మాత్రం వంశీని ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వంశీ వైసీపీకి దగ్గర అయినప్పటి నుండి ఆయనతో పాటు ఉన్న టీడీపీ నియోజకవర్గ నేతలు నారా ఫ్యామిలీపై కామెంట్స్ తో తిరిగి టీడీపీకి వచ్చేశారు. వంశీపై టీడీపీ నేతలు గుర్రుగానే ఉన్నారు. టీడీపీ నేతలు వంశీ వర్గం...టీడీపీ వర్గంగా విడిపోయి పార్టీ క్యాడర్ ను ఇంకా గందరగోళ పరిచే పరిస్థితుల్లోనే ఉన్నారు.


గన్నవరం  వైపీపీలో పరేషాన్ 


ప్రతిపక్ష పార్టీలో గ్రూపు తగాదాలు అంటే అంతగా పట్టించుకోని పరిస్థితి ఉంది. అయితే అధికార పార్టీలో గ్రూపులు మాత్రం హాట్ టాపిక్ కావటం కామన్. అందులోనూ గన్నవరం వంటి పొలిటిక్ హీట్ ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావటంతో, అప్పటికే గ్రూపులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనధికార శాసనసభ్యుడిగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం జగన్ కు సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో తిరిగి ఆయనకే మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అంతే కాదు గతంలో జగన్ తో ప్రత్యేకంగా సమావేశం అయిన వల్లభనేని వంశీ గన్నవరం సీటు తిరిగి తనకే అంటూ ప్రచారం చేసుకున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని గన్నవరం నేతలు ఫైర్ అయ్యారు. 


వైఎస్ఆర్ కాంగ్రెస్ లో గ్రూపులు 


గన్నవరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలున్నాయి. దీంతో పార్టీ నేతలకు మెుదటి నుంచి తలనొప్పులుగానే మారాయి. నేతల మధ్య విభేదాలను సర్దిపుచ్చేందుకు పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో , అదే సమయంలో టీడీపీ నుంచి శాసనసభ్యుడిగా ఉన్న వల్లభనేని వంశీ వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్ళటం, మాజీ మంత్రి కొడాలి నానితో ఉన్న స్నేహం తోడు కావటంతో వంశీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. వంశీ రాకతో పార్టీలో విభేదాలకు చెక్ పడుతుందని పార్టీలోని పెద్దలు భావించారు. అయితే అదే సమయంలో వంశీ రాకను వ్యతిరేకిస్తూ వైసీపీకి ఇంచార్జ్ గా ఉన్న దుట్టా రామచంద్రరావు, కోపరేటివ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ యార్ల గడ్డ వెంకటరావు నిరసన తెలిపారు. పార్టీని మొదటి నుంచి వెంటపెట్టుకొని ఉంటున్న దుట్టాను కాదని వంశీకి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటంపై అప్పటి వరకు వ్యతిరేక వర్గంగా ఉన్న గ్రూపులన్నీ వంశీని కేంద్రంగా చేసుకొని ఏకం కావటం విశేషం.


గన్నవరంలో వంశీకి ఎదురీత 


 గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీకి రెండు వైపుల నుంచి పోటీ తప్పటం లేదు .వచ్చే ఎన్నికల్లో వంశీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని, టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక అదే సమయంలో వైసీపీకిలో వంశీ రాకను వ్యతిరేకిస్తున్న వర్గం కూడా వంశీని టార్గెట్ గా చేసుకొని పావులు కదుపుతున్నారు. దీంతో గన్నవరంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు వంశీనే టార్గెట్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది.