బెజవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు తీరుపై సొంత పార్టీ నేతలే అసహనంతో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గ స్దాయిలో పార్టీని పూర్తిగా తన కంట్రోల్ లో పెట్టుకున్న మల్లాది విష్ణు, తోటి పార్టీ నాయకులను కూడా దగ్గరకు రానీయటం లేదని అంటున్నారు. శాసనసభ్యుడిగా ఉన్న మల్లాది విష్ణుకు అదనంగా ప్రణాళికా సంఘం బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో పార్టీ నేతలకు మల్లాది విష్ణు టచ్ లో ఉండటం లేదని చెబుతున్నారు. మరో వైపున మల్లాది విష్ణు తన తోటి నాయకులను సైతం నమ్మరనే ప్రచారం ఉంది. రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి పరిస్దితుల్లో పెద్ద వారయిపోతారో, ఎవరికీ తెలియదు, అలాంటి పరిస్దితులు తన నియోజకవర్గంలో రాకూడదనే ఉద్దేశంతో మల్లాది విష్ణు ఉంటారని, అందుకే ఆయన ఇతర నేతలను కనీసం ప్రోత్సహించరని చెబుతుంటారు. నియోజవకర్గంలో తనకు తెలియకుండా ఏం జరిగినా మల్లాది విష్ణు సహించరనే ప్రచారం కూడా లేకపోలేదు.
ప్రజా ప్రతినిధులను సైతం దూరం
నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత ఆయనకు అత్యంత సన్నహితంగా మెలిగే వారు డివిజన్ కార్పొరేటర్లు, అలాంటిది కార్పొరేటర్లను సైతం ఎమ్మెల్యే మల్లాది విష్ణు దూరం పెడతారని పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఆఖరికి కార్పొరేషన్ కు చెందిన వ్యవహరాల్లో సైతం కార్పొరేటర్లకు ప్రాధాన్యత లేకుండా అన్నింటిలో తనను మాత్రమే సంప్రదించాలంటూ ఎమ్మెల్యే అధికారులను ఆదేశాలు ఇవ్వటంలో ఎవరికి ఏం చేయాలో పాలుపోని పరిస్దితులు నెలకొన్నాయి. అంతే కాదు నియోజకవర్గ స్దాయిలో చివరకు బిల్డింగ్ ప్లాన్ ను సైతం ఆమోదించాలన్నా, అధికారులు నేరుగా ఎమ్మెల్యేనే సంప్రదించాల్సిన పరిస్థితి. దీంతో కార్పొరేటర్లకు ఏ మాత్రం అధికారం లేకుండాపోయింది. ఈ వ్యవహరంపై నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. అంతే కాదు డివిజన్ లో చిన్నపాటి రోడ్డు నిర్మాణం చేయాలన్నా, వీధి దీపాలు వెలిగించాలన్నా కార్పొరేటర్ ప్రమేయం లేకుండా నేరుగా అధికారులు, సిబ్బంది తనకు మాత్రమే సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే శాసించారని సమాచారం. దీంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడుపడని అంశంగా మారింది.
ఇక అధికారులు సైతం
కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, అధికారులు కూడా ఎమ్మెల్యే వైఖరితో తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు. ఆదాయ వ్యవహరాలన్నింటిని తనకు మాత్రమే వివరించాలంటూ ఎమ్మెల్యే ఇటీవల ఆదేశాలు ఇచ్చారంట. దీంతో అధికారులు సైతం ఆయన తీరు పై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. లేదంటే తన నియోజకవర్గ పరిధి నుంచి ఆ అధికారిని సాగనంపేందుకు అవసరం అయిన అన్ని ప్రయత్నాలను ఎమ్మెల్యే చేస్తారని, చివరకు బదిలీ పేరుతో వేధింపులకు గురికావాల్సి వస్తుందని, అధికారులు ఉన్నత స్థాయి అధికారులు వద్ద వాపోతున్నారని ప్రచారం ఉంది.
జగన్ కు అత్యంత సన్నిహితుడు
మల్లాది విష్ణు, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. వైఎస్ మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ వెంట వచ్చిన వ్యక్తుల్లో మల్లాది విష్ణు కీలకంగా వ్యవహరించారు. దీంతో మల్లాదికి జగన్ వద్ద మంచి గుర్తింపు ఉంది. అదే గుర్తింపుతో ఇప్పుడు అధికారం చెలాయించటం, ఏకపక్షంగా వ్యవహరించటం, అధికారులు, ప్రజా ప్రతినిధులను సైతం విష్ణు పట్టించుకోకుండా, వారిని పక్కన పెట్టి అన్నీ తానే...తాను మాత్రమే అన్నట్లుగా నియోజకవర్గంలో చక్రం తిప్పటంతో పార్టీ నేతల్లో అసంతృప్తి చాప కింద నీరులా ఉందనే ప్రచారం సొంత పార్టీలోనే కొనసాగుతుంది.