ఏం మాట్లాడుకున్నారు ?  ఏ నిర్ణయం తీసుకున్నారు ? అన్న మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ ఆసక్తిని రేపుతున్నాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మీడియాతో మాట్లాడిన మాటలే కాదు.. ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ సభలో అన్న మాటలు కూడా  రాజకీయవర్గాల్లో హీటు పెంచేస్తున్నాయి. వీరి మాటల వెనక ఉన్న అర్థం ఏంటిరా బాబూ అని ఎవరికి వారే లెక్కలు తీస్తున్నారు. 
కొన్ని రోజుల కిందట జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రా రాజకీయ ముఖచిత్రం మారుతుందని ప్రకటించారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవడమే కాకుండా అధికార పార్టీకి ఇక నా దెబ్బ ఏంటో రుచి చూపిస్తానని చెప్పు చూపించి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. ఈసారి మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా వైసీపీనీ ప్రతీ విషయంలోనూ ఇరుకునపెడుతూ యుద్ధానికి సమరశంఖం పూరించారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు కావడం, జనసేన అధినేతకు ప్రత్యేకంగా పిలుపు రావడంతో పవన్‌ కళ్యాణ్ చెప్పిన రాజకీయ ముఖచిత్రం మాటలు రాష్ట్ర ప్రజలకు గుర్తుకువచ్చాయి. దాదాపు అరగంటకు పైగా ప్రధాని మోదీ, పవన్‌ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై ఇటు బీజేపీ నుంచి కానీ అటు పవన్‌ కళ్యాణ్ కానీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఏపీకి మంచి రోజులు వస్తాయన్న మాటలపైనే రకరకాల అర్థాలు తీస్తున్నారు. 
2014లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీజేపీకి మద్దుగా నిలిచి టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా పనిచేసి ప్రభావం చూపింది. అయితే కమలం పార్టీకి మాత్రం ఎప్పటిలానే ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా కొంత లాభం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నవ్యాంధ్రకు సీఎం అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినా ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ, బీజేపీ- జనసేన కొట్టుకుపోయాయి. అప్పటినుంచి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు విపక్షాలు ఉన్నా, సీఎం జగన్‌ పాలన తీరుని ఎండగట్టే విషయంలో మాత్రం టీడీపీకి జనసేన అండగా ఉంటూ వచ్చింది. చంద్రబాబు దత్త పుత్రడన్న అధికారపార్టీ ఆరోపణ నిజమనేలా మొన్నా మధ్య పవన్‌ - టీడీపీ అధినేత భేటీ కావడం, పొత్తులపై త్వరలోనే క్లారిటీ ఉంటుందని చెప్పడంతో 2024 ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయని దాదాపు ఖరారైంది. అంతేకాదు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇవ్వకపోవడం వల్లే టీడీపీతో కలిశానని ఎప్పుడైతే పవన్‌ కళ్యాణ్ చెప్పాడో అప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ పవన్‌ ని కలవడం వెనక పొత్తు మ్యాటరే ఉందన్న వాదన రాజకీయవర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది.





ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పాలన, వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు బీజేపీ నేతలు ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకి విన్నవిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ప్రత్యేకంగా పవన్‌ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదన్నది ఓ వర్గం వాదన. అందుకే బీజేపీతోనే జనసేన కలిసి ఉండాలన్న ప్రతిపాదననే వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చిందంటున్నారు. అంతేకాదు రెండు ప్రతిపాదనలను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది.
మొదటిది జనసేన ఇటు టీడీపీ అటు బీజేపీతోనూ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్‌ కళ్యాణ్ మోదీ దృష్టికి తీసుకువచ్చారట. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే మూడు పార్టీలు కలిసి పోటీచేయడమే మంచిదన్న వాదన వినిపించినట్లు తెలుస్తోంది. అయితే సీఎం అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్ ని నిలబెట్టి ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్‌ ని బలపర్చాలన్న ప్రతిపాదన కూడా వీరి మాటల్లో వచ్చినట్లు తెలుస్తోంది. 
చంద్రబాబుకి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఊహాగానాలే. వీటికి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. అవును అనేవారు లేరు, కాదు అనే వారు కూడా లేరు. అయితే సీఎంగా పవన్‌ కళ్యాణ్ ని బీజేపీ ప్రతిపాదిస్తే టీడీపీ ఒప్పుకుంటుందా ? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. అంతేకాదు 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు డైరక్ట్‌ గా కానీ ఇండైరక్ట్‌ గా కానీ కలిసి పనిచేసినా వైసీపీ పార్టీకి గట్టిపోటీ ఇవ్వలేకపోయాయన్నది వాస్తవం. 2014లో వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ మూడు పార్టీలు కలిసి 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు అటు ఇటుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
ఏపీకి త్వరలోనే మంచిరోజులు వస్తాయన్న పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యల్లో మరో కోణాన్ని కూడా బయటకు తీస్తున్నారు. ఈ మధ్యనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో కూడా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. టీఆర్‌‌ఎస్‌ అధినేత అలా అన్నారో లేదో ఇలా ఇప్పటం గ్రామాన్ని సందర్శించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వాన్ని కూలదొబ్బుతామంటూ ఆవేశంతో మాట్లాడారు. అంటే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు ఉంటాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎవరి ఆలోచనలు, ఎవరి వాదనలు, ఎవరి ప్రణాళికలు ఎలా ఉన్నా కానీ రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ మళ్లీ ఒంటరిపోరు చేయడం ఖాయమన్నది తేలిపోయింది. అందుకే జగన్‌ ఎప్పటిలాగానే తన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని చెప్పకనే మోదీ సభలో చెప్పేశారు. పార్టీలకతీతమైన బంధం మనదంటూ సెంటిమెంట్‌ తో దువ్వి, మంచి చేస్తే మనసులో పెట్టుకుంటారు.. చెడు చేస్తే గత పార్టీల గతే పడుతుందంటూ పరోక్షంగా హెచ్చరిక చేశారని చెబుతున్నారు. ఈ మాటలు టీడీపీ- బీజేపీలకే కాదు జనసేనకి కూడా వర్తిస్తుందని జగన్‌ తన మార్క్‌ రాజకీయాన్ని చూపించాడంటున్నారు. 
ఈ సారైనా జనసేన పార్టీ పొత్తుల విషయంలో రాజకీయపరిపక్వత చూపిస్తుందా లేదంటే ఎప్పటిలాగానే బోర్లా పడుతుందా అన్నది తెలియాంటే బీజేపీ - టీడీపీల్లో ఎవరితో కలిసి ముందుకు వెళ్తారన్న దానిపై పవన్‌ కళ్యాణ్ క్లారిటీ  ఇవ్వవలసి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. మోదీ - పవన్ భేటీలో ఏం జరిగిందో వాళ్లే చెప్పాల్సి ఉంటుంది. ప్రధాని ఎలాగూ చెప్పరు. కనీసం పవన్ కళ్యాణ్ అయినా పూర్తిగా వివరంగా చెప్తారా? అంటే అదీ లేదు. ఆయన నర్మగర్భంగానే చెప్పారు. ఇక ఆయన ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్ తోనో, ఇతర నేతలతో షేర్ చేసుకంటే తప్ప భేటీలో చర్చించిన అంశాలు బయటికి వచ్చే అవకాశం లేదు. 
ఇక ప్రధాని మోదీ, జనసేనాని పవన్ మధ్య జరిగిన చర్చ విషయాలు భయటికి రావాలంటే ఆ రెండు పార్టీలు రాబోయో రోజుల్లో అనుసరించబోయే వ్యూహాలు, ఎత్తుగడలు, పార్టీ ప్రణాళికలు, కలిసి చేయబోయే పోరాటాలు, కార్యక్రమాలపైనే ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకూ ఏపీ రాజకీయాలపై మరిన్ని ఊహాగానాలు వెల్తువెత్తుతూనే ఉంటాయి. ముఖ్యంగా పొత్తులపై క్లారిటీ కోసం జనసేన, బీజేపీ, టీడీపీ కసరత్తు చేయనున్నాయి.