Vote bank politics: ఏపీ(Andhrapradesh)లో మ‌రోసారి ఓటు బ్యాంకు(Vote bank) రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ(YSRCP)కి 49.8 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇది రాష్ట్ర రాజ‌కీయ హిస్ట‌రీలో పెను సంచ‌ల‌నం. దేశంలో మోడీ(PM Modi) ప్ర‌భావం ఉన్న స‌మ‌యంలో కూడా.. 34 శాతం ఓటు బ్యాంకు మాత్ర‌మే బీజేపీ(BJP) సంపాదించుకుంది. ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు కేవ‌లం ఆరు మాసాల్లోనే ఆయ‌న అధి కారంలోకి వ‌చ్చినా.. అప్ప‌ట్లో ఆయ‌న‌కు వచ్చిన ఓటు బ్యాంకు 44 శాతం. ఆ త‌ర్వాత‌.. టీడీపీ ఈ రేంజ్‌లో ఓటు బ్యాంకును సొంత చేసుకోలేక పోయింది.


స్వ‌ల్ప తేడాలే అయినా.. 


2004లో టీడీపీ(TDP)కి వ‌చ్చిన ఓటు షేర్ 21 శాతం. అప్ప‌ట్లో ఉమ్మ‌డి రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుతో పార్టీ కొంత వెనుక‌బ‌డింది. 2009కి వ‌చ్చే స‌రికి కొంత పుంజుకుని.. దీంతో టీడీపీ ఓటు బ్యాంకు 29 శాతానికి  చేరుకుంది. ఆ త‌ర్వాత‌.. విభ‌జిత రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌(జ‌న‌సేన కేవ‌లం ఎన్నికల్లో ప్ర‌చారానికే ప‌రిమిత‌మైంది) ఉమ్మ‌డిగా సాధించిన ఓటు బ్యాంకు 39-40 శాతం. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ సీట్ల వాసి 23కు ప‌డిపోయినా.. ఓటు బ్యాంకు మాత్రం 2014తో పోల్చుకుంటే.. ప‌దిలంగానే ఉంది. 41 శాతం ఓటు బ్యాంకును టీడీపీ కైవ‌సం చేసుకుంది.


వైసీపీ ఓటు బ్యాంకు త‌గ్గిందా?


ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో వైసీపీ(YSRCP) ఓటు బ్యాంకు ప‌రిస్థితి ఏంటి?  అదేస‌మ‌యంలో కాలికి బ‌ల‌పం క‌ట్టుకునిరాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న టీడీపీ అధినేత దూకుడుతో పెరిగిన ఓటుబ్యాంకు ఎంత‌? అంటే.. వైసీపీకి ప్ర‌స్తుతం ఓటు బ్యాంకు4 నుంచి 6 శాతం వ‌ర‌కు త‌గ్గిందని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన ప‌ట్ట‌ణ ఓట‌రు.. ఇప్పుటు త‌ట‌స్థంగా మారిపోయాడని అంటున్నారు. ఎటువైపు మొగ్గు చూపుతార‌నేది ఇంకా తేలాల్సి ఉంటుందని, కానీ, త‌మ‌కు అనుకూలంగా ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని అంటున్నారు. 


స‌ర్వేలు చెబుతున్న‌ది ఏంటంటే.. 


ఇక‌, వైసీపీకి గత ఎన్నిక‌ల్లో 49.3 శాతం ఓటు బ్యాంకు ఉన్నా.. ఇప్పుడు ఇది 44-45 మధ్య కొన‌సాగుతోందనే ది స‌ర్వేలు చెబుతున్నాయి. మ‌రోవైపు.. నియోజ‌క‌వ‌ర్గాలను ప్రామాణికంగా తీసుకుంటే.. జ‌న‌సేన ఓటు బ్యాంకు ప‌లు నియోజ‌క‌వర్గాల్లో పెరిగిన‌ట్టు ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సాలిడ్‌గా 6-7 శాతం ఉన్న ఓటు బ్యాంకు 18-20 శాతానికి పెరిగింద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. ఇదంతా వైసీపీ అనుకూల ఓటు బ్యాంకేన‌ని ఆయ‌న చెబుతున్నారు. 


చివ‌రికి ఏం జ‌రుగుతుంది?


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40-50 నియోజ‌క‌వ‌ర్గాల్లో(Constituencies) ఇలా ఓటు బ్యాంకు భారీ సంఖ్య‌లో చెదిరిపోతే.. వైసీపీకి ఇబ్బంది త‌ప్పేలా లేద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ కుల సంఘాలు, కార్పొరేష‌న్ల‌ను.. అలెర్ట్ చేస్తోంది. ఓటు బ్యాంకు త‌గ్గ‌కుండా చూసుకుంటోంది. అంతేకాదు.. బీసీలకు మెజారిటీ సంఖ్య‌లో టికెట్లు ఇవ్వ‌డం ద్వారా.. త‌న ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, టీడీపీ కూడా దాదాపు ఇంతే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. బీసీల‌కంటే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో ఓసీల‌కు ఎక్కువ‌గా టికెట్లు ఇవ్వాల్సి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.  మ‌రోవైపు జ‌న‌సేన కూడా ఓటు బ్యాంకుపై బాగానే దృష్టి పెడుతోంది. దీంతో ఎన్నిక‌ల్లో ఓటు బ్యాంకు రాజ‌కీయం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.