Viveka Murder Witnes Mysterious Deaths: ఆయన ఓ మాజీ ఎంపీ.. అంతే కాదు.. ఓ మాజీ సీఎంకు సోదరుడు.. ఆ జిల్లాలో అతిపెద్ద రాజకీయ కుటుంబానికి ఆయన ముఖ్యనేత. అలాంటి ఆయన తన సొంతింట్లో క్రూరంగా హత్యకు గురయ్యారు. అనుమానితులున్నారు... ఆధారాలున్నాయి. సాక్ష్యాలూ ఉన్నాయి. ఆరేళ్లు అయినా ఆ కేసుకు అతీగతీ లేదు. అంతలోనే ఆ కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరూ చనిపోతున్నారు. అందుకే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కడప జిల్లాలోని పలుకుబడి కలిగిన నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించే ఇదంతా అని మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది.
చాలా కాలంగా రాజకీయ నాయకులు, మీడియా కూడా బాగా మాట్లాడి మాట్లాడి వదిలేసిన ఈ కేసు గురించి మళ్లీ చెప్పుకోవడానికి కారణం.. ఈ కేసులో ప్రధాన సాక్షి వాచ్‌మెన్ రంగయ్య మరణం. చూడటానికి సహజ మరణంలానే కనిపిస్తోంది కానీ ఈ కేసులో ఇంతకు ముందు జరిగిన సంఘటనలు... కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడంతో ప్రతీ విషయాన్ని అనుమానించాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ ఇలా ఆరుగురు చనిపోయారు. జనంలో అనుమానాలుండటమే కాదు.. ఇప్పుడు పోలీసుశాఖ కూడా ఈ గొలుసుకట్టు మరణాల తీగను పట్టుకుంది. మరి డొంక కదులుతుందో లేదో చూడాలి.
అసలు ఈ కేసుపై ఎందుకు అనుమానాలంటే.. అప్పట్లో జరిగిన వ్యవహారాలు అలాంటివి మరి. ఆరేళ్ల కిందట వివేకా మర్డర్ జరిగిన దగ్గర నుంచి.. నిన్న రంగయ్య చనిపోయిన వరకూ అనేక మలుపులు తిరిగింది ఈ కేసు. ఈ హత్యలో ఉన్న కోణాలే కాదు.. ఆరేళ్ల కిందట రాష్ట్ర రాజకీయ రంగాన్నే మలుపతిప్పింది కూడా. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ప్రతీ అడుగులోనూ ఒక్కో ట్విస్ట్ ఉంది. వరుసగా ఏం జరుగుతూ వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
అసలేం జరిగింది.. అనుమానాలు ఎందుకు..?
2019, మార్చ్ 15 తెల్లవారుజామున రక్తపుమడుగులో పడి ఉన్న వివేకానందరెడ్డిని గుర్తించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చి రాత్రి ఇంట్లో పడుకున్న ఆయన్ను లేపేందుకు ఆయన పీఏ కృష్ణారెడ్డి తెల్లవారుజామున ఇంటికి వెళ్లారు. ఎంతకూ నిద్రలేవకపోవడంతో వెనుక నుంచి తలుపులు తెరిచి వివేకా రక్తపు మడుగులో పడిపోయినట్లు గుర్తించారు.
అసలు మొదటి అనుమానం ఇక్కడే వచ్చింది.. వివేకా ఒంటిపై తీవ్రమైన గాయాలున్నాయి. తలపైన గొడ్డలివేట్లు ఉన్నాయి. చూసిన ఎవరికైనా అది హత్య అని అర్థం అవుతోంది. అంత పెద్ద రాజకీయ నేత, జగన్ సొంతబాబాయ్ హత్యకు గురైతే.. కచ్చితంగా ఎవరైనా నిందితులను పట్టుకోవాలనుకుంటారు. కానీ విచిత్రంగా ఆ రోజు ఉదయం 9 గంటల వరకూ కూడా ఇది గుండెపోటు అని చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు పార్టీలో నెంబర్ -2గా ఉన్న విజయసాయిరెడ్డి స్వయంగా ఇది గుండెపోటు అని చెప్పారు. పోలీసులు రాకముందే ఆయన గాయాలను శుభ్రం చేసి కట్లు కట్టే పని మొదలుపెట్టారు. పోలీసుల వ్యవహార శైలి కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. ఎక్కువ మంది శవాన్ని చూడటం... మెల్లగా హత్య అన్న విషయం బయటకు వచ్చాకనే కుటుంబ సన్నిహితులు ఆ విషయాన్ని వెల్లడించారు.
ఓ వైపు హత్య విషయాన్ని దాచడంపై అనేక అనుమానాలుండగానే.. వైఎస్ జగన్ దీనిని రాజకీయ హత్య అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రోద్బలంతో ఆదినారాయణ రెడ్డి హత్య చేయించారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో విషయం రాజకీయ రంగు పులుముకుంది. 2019లో ఈ విషయం ప్రధాన ఎన్నికల అంశం అయింది. ఎన్నికలకు ముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మోహనరెడ్డి పిటిషన్ వేశారు.అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సిట్ వేసి కొంత విచారణ చేసి కొంతమందిని అరెస్ట్ చేసింది. అయితే ఇది రాజకీయ ప్రత్యర్థుల హత్య కాదని.. సన్నిహితులే ఆయన్ను చంపారని సిట్ తేల్చింది. ఈలోగా జగన్ సీఎం అయ్యారు.
అయితే అనూహ్యంగా ఆయన ఆ కేసుపై దృష్టిని తగ్గించారు. జగన్ ఈ కేసు విషయంలో చొరవ చూపడంలేదని అనుమానపడ్డ ఆయన సోదరి సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో పాత్ర ధారులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని.. అసలైన సూత్రధారుల జోలికి వెళ్లడం లేదంటూ ఆరోపించారు. ఇది జరుగుతుండగానే కేసును సీపీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్ ను జగన్ మోహనరెడ్డి 2020 ఫిభ్రవరిలో ఉపసంహరించుకున్నారు.
కేసు సీబీఐకి..
ఆ తర్వాత నెలరోజులకే అంటే మార్చి, 2020లో కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు విచారణలో సీబీఐ మొత్తం 24మందిని నిందితులుగా చేర్చింది. పలువురుని అరెస్టు చేసింది. ఇలా జరుగుతుండగానే వివేకా కుమార్తె సునీతకు జగన్ కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. వైఎస్ వివేకా తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి అని భావించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉందని వారిని విచారించారని సునీత పట్టుబట్టారు. దీనికి జగన్ అభ్యంతరం చెప్పారు. “వివేకాను హత్య చేయమంటూ తనను గంగిరెడ్డి ప్రోద్బలం చేశాడని.. తాను ఒక్కడినే చేయలేను అంటే దీని వెనుక తనతో పాటు.. శివశంకరరెడ్డి, భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి వంటి పెద్దలు ఉన్నారని చెప్పాడని.. తనకు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని.. ”ఈకేసులో నిందితుడు అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.
విచారణ హైదరబాద్‌కు బదిలీ
కడపలో విచారణ జరుగుతుంటే సాక్షులను బెదిరిస్తున్నారని.. ఈ విచారణను హైదరాబాద్‌కు మార్చాలని సునీత పిటిషన్ తో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. క్రమక్రమంగా విచారణ వైఎస్ అవినాష్ రెడ్డి వైపు వెళ్లింది. ఈ క్రమంలోనే జగన్ సొంత సోదరి షర్మిల సైతం ఈ కేసు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా నిలిచారు. మొత్తం మీద వివేకా ఫ్యామిలీ షర్మిల ఓవైపు- జగన్- అవినాష్ మరోవైపు అయ్యారు. 2023 జనవరి 28 న ఎంపీ అవినాష్ రెడ్డి ని సీబీఐ హైదరాబాద్ లో విచారించింది. రెండోసారి విచారణకు ఆయన రాకపోవడం.. ఆయన అనుచరులు ఆందోళన చేయడంతో గందరగోళం జరిగింది. ఆ తర్వాత సీబీఐ అవినాశ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ లోగా ఎన్నికలు వచ్చాయి.. ఇదీ ఈ కేసులో జరిగింది.
అంతుచిక్కని మరణాలు- అన్నీ అనుమానాలు
ఇవన్నీ ఓ ఎత్తైతే.. ఈ కేసులో ప్యారలల్‌గా మరికొన్ని సంఘటనలు జరిగాయి. ఈ కేసులో అనుమానితులు, సాక్షులు ఆరుగురు చనిపోయారు.
1. ఈ హత్య కేసులో సాక్షిగా ఉన్న కే శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్ 2న మరణించారు. ఆయన హఠాన్మరణం మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. హత్య కేసులో నిందితుడైన పరమేశ్వర్ రెడ్డికి మృతుడు శ్రీనివాసరెడ్డి తోడల్లుడు. పోలీసుల వేధింపుల వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నారుని చెప్పారు. కానీ దీనిపై సునీత అనుమానం వ్యక్తం చేశారు. స్వయంగా వైద్యురాలు అయిన ఆమె... శ్రీనివాసరెడ్డికి కిడ్నీల దగ్గర రక్తం గడ్డకట్టిందని పాయిజన్ తీసుకుంటే అలా జరగదని అన్నారు.
2. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడుగా ఉన్న డ్రైవర్ నారాయణ మరణం. వివేకా హత్య జరిగిన రోజు అతనే జగన్- ఆయన భార్య భారతిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. వివేకా మర్డర్ విషయం అందరికంటే ముందుగా జగన్ కే తెలిసిందని .. ఆయన పీఏలతో అవినాశ్ రెడ్డి తెల్లవారు జామున మాట్లాడారని సీబీఐ ఆరోపించింది. ఈ విషయాలన్నీ డ్రైవర్ కు తెలిసుంటాయని ఆయన మరణం సహజం కాదని ఆరోపణలున్నాయి.
3 జగన్ సొంత మామ, ఈసీ గంగిరెడ్డి వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే 2020 అక్టోబర్‌లో చనిపోయారు. పులివెందులలో ప్రముఖ వైద్యుడైన ఈయన వివేకా చనిపోయాక ఆయన బాడీకి కట్లు కట్టారు. దీనిని హత్య కాదు అని నమ్మించేందుకే అలా చేశారు అని ఆరోపణలున్నాయి. ఏమైనా ఆయన చనిపోయారు.
4. నాలుగో వ్యక్తి గంగాధర్ రెడ్డి. ఇతను వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు శివశంకరరెడ్డి తనను ఈ కేసు తనపై వేసుకోవాలని బెదిరిస్తున్నారని ముందు చెప్పారు. ఆ తర్వాత సీబీఐనే అలా చెప్పమని చెప్పింది అని, అవినాష్ రెడ్డి పేరు బలవంతంగా చెప్పిస్తున్నారని చెప్పారు. కానీ ఇతను 2022 జూన్ లో నిద్రలోనే చనిపోయాడు.
5. ఇక ఈ మధ్య జరిగిన డాక్టర్ అభిషేక్ రెడ్డి మరణం. ఇతను జగన్ కు చాలా సన్నిహితుడు. వైద్యుడు. వివేకా మర్డర్ జరిగిన రోజు. గంగిరెడ్డితో కలిసి ఇతను కట్లు వేయడానికి సహకరించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతోనే ఈయన ఈమధ్యనే చనిపోయారు. అయితే కేసులో చాలా కీలకం కావడంతో దీనిపై కూడా అనుమానాలున్నాయి
6. ఇక లేటెస్ట్ గా వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న. ఇతను ఆ రోజు వివేకాను చంపి పారిపోతున్న వ్యక్తులను చూశాను అని వాంగ్మూలం ఇచ్చాడు. 70 ఏళ్ల వయసున్న రంగన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఒక్కరోజులోనే చనిపోయారు. పెద్దగా అనుమానాస్పదంగా ఏం లేకపోయినా.. వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్లతో దీనిపై కూడా అనుమానాలు మొదలయ్యాయి.
వరస మరణాలపై దర్యాప్తు
ఓ వైపు వివేకా హత్య కేసు విషయం తేలలేదు. ఈలోగా ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లంతా ఒక్కక్కరిగా చనిపోతుండటంపే అనుమానాలు పెరిగాయి. పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించారు. తాజాగా వాచ్ మెన్ రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అందరు సాక్షుల మరణాలపై విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని కడప ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. ఎప్పటికి అసలు విషయం బయటకొస్తుందన్నది ఇప్పటికీ అనుమానంగానే ఉంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముందుకు జరగలేదని ఆగ్రహం చెందిన సుప్రీంకోర్టు మరో బృందాన్ని ఏర్పాటు చేసి నెలరోజుల్లో కేసు సంగతి తేల్చాలని చెప్పింది. అలా చెప్పి కూడా ఏడాది దాటింది. ఈ కేసు ఏమవుతుందో చూడాలి. ఓ ప్రధాన రాజకీయ నేతను అంత ఘోరంగా చంపిన ఆ కేసులో ఇప్పటికే నిందితులు, అనుమానితులు ఉన్నా కాడూ ఇంకా ముందుకు సాగకపోవడం, రెండు ప్రభుత్వాలు మారినా ఏమీ జరక్కపోవడం ఈ వ్యవస్థలో ఉన్న లోపాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా తన తండ్రి హత్యకు సమాధానం కావాలంటూ ఆరేళ్లుగా పోరాడుతన్న సునీతకు ఎప్పుడు ఆన్సర్ వస్తుందో చూడాలి.