Vijayawada Mayor : బెజ‌వాడ మేయ‌ర్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే స్పంద‌న కార్యక్రమంలో మేయ‌ర్ రాయ‌న భాగ్యల‌క్ష్మి పాల్గొన‌టం ప‌ట్ల టీడీపీ అభ్యంత‌రాన్ని లేవ‌నెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా స్పంద‌న కార్యక్రమాన్ని కేవ‌లం అధికారులు మాత్రమే నిర్వహిస్తుంటే, బెజ‌వాడ‌లో మాత్రమే అందుకు భిన్నంగా ప్రజా ప్రతినిధులు స్పంద‌నలో కూర్చోని ప్రజా స‌మ‌స్యలపై అర్జీలు తీసుకోవ‌టం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. అయితే మేయ‌ర్ మాత్రం తాను స్పంద‌న‌లో పాల్గొంటే మీకేంటి న‌ష్టం అంటున్నారు. 


సినిమా టిక్కెట్ల వ్యవ‌హ‌రం 


బెజ‌వాడ కార్పొరేష‌న్ లో నిత్యం ఏదోక అంశం చ‌ర్చనీయాశంగా మారుతోంది. ఇటీవల  కొత్త సినిమాలు విడుద‌ల అయితే టిక్కెట్లు ఇవ్వండి అంటూ థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు మేయ‌ర్ త‌న లెట‌ర్ హెడ్ పై అధికారిక హోదాలో రాసిన లేఖ తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఆ త‌రువాత ఈ వ్యవ‌హ‌రంపై పార్టీ పెద్దలు సైతం దృష్టి సారించి, మేయ‌ర్ కు క్లాస్ తీసుకున్నార‌నే ప్రచారం జ‌రిగింది. అయినా ఆమె మాత్రం త‌న వాద‌న‌ను స‌ర్దిపుచ్చుకునే ప్రయ‌త్నం చేశారు. సినిమా టిక్కెట్లను డ‌బ్బుల‌కే ఇవ్వమ‌ని అడిగాం కానీ ఫ్రీగా ఇవ్వమ‌న‌లేదుగా అంటూ ఎదురు ప్రశ్నించారు. .


స్పంద‌న వేదిక‌గా 


 తాజాగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న స్పంద‌న కార్యక్రమంలో మేయర్ హోదాలో రాయ‌న భాగ్యల‌క్ష్మి పాల్గొని ప్రభుత్వం నుంచి అర్జీలు తీసుకోవ‌టంపై టీడీపీ నేతలు అభ్యంత‌రాన్ని లేవ‌నెత్తారు. ఈ మేర‌కు ఏకంగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కు స్పంద‌న కార్యక్రమంలో, మేయ‌ర్ ముందే ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవ‌హ‌రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మేయ‌ర్ స్పంద‌న కార్యక్రమంలో పాల్గొన‌టం ద్వారా బాధితులు త‌మ స‌మ‌స్యల‌ను నేరుగా అధికారుల‌కు చెప్పుకునే అవ‌కాశం లేకుండాపోతోంద‌ని, దీని వ‌ల‌్ల అర్జీదారులు కూడా భ‌య‌ప‌డే పరిస్థితి ఏర్పడుతుంద‌ని టీడీపీ వాద‌న వినిపిస్తోంది. క‌మిష‌న‌ర్ ను సైతం ప‌క్కన కుర్చోపెట్టి, కార్పొరేష‌న్ లోని అన్ని శాఖ‌ల హెడ్వోడీల‌తో మేయ‌ర్ స్పంద‌నలో కుర్చోవ‌టం ఏంట‌ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మేయ‌ర్ హోదాలో ఉండి అధికారులు నిర్వహించే స్పంద‌న‌లో పాల్గొన‌టంపై అభ్యంతరం తెలిపారు. మేయ‌ర్ త‌న వైఖరిని మార్చుకోకుంటే ఆందోళ‌న చేస్తామ‌ని టీడీపీ నేతలు హెచ్చరించారు.


లైట్ తీసుకున్న మేయ‌ర్ 


ఈ వ్యవ‌హ‌రంపై అటు మేయ‌ర్ కూడ ధీటుగానే స్పందించారు. స్పంద‌న‌లో తాను పాల్గొంటే టీడీపీకి వ‌చ్చిన న‌ష్టం ఏంటని ప్రశ్నించారు. అధికారుల‌కు  లేని అభ్యంత‌రం టీడీపీ నేత‌ల‌కు ఎందుకు వ‌చ్చిందో అర్ధం కావ‌టం లేద‌న్నారు. స్పంద‌న‌లో తాను పాల్గొన‌టం వ‌ల్ల ప్రజా స‌మ‌స్యలు వేగంగా ప‌రిష్కారం అవుతున్నాయ‌ని, దీని వ‌ల్ల వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు రావడం టీడీపీ నేత‌ల‌కు మింగుడుప‌డడం లేద‌ని వ్యాఖ్యానించారు. వీటంటిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదంటూ ఆమె చెబుతున్నారు.  మేయ‌ర్ అధికారిక హోదాలో ఇష్టం వ‌చ్చినట్లుగా వ్యవ‌హ‌రిస్తే తాము ఆందోళ‌న‌కు దిగుతామ‌ని టీడీపీ హెచ్చరిస్తున్న తరుణంలో  ఈ  వ్యవ‌హ‌రం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందనే అంశం ఇప్పుడు విజయవాడలో చ‌ర్చనీయాశంగా మారింది.


Also Read :  వాళ్ల భేటీ ఖచ్చితంగా రాజకీయమే - రాజకీయాలు ఎలా మారతాయో చెప్పిన ఉండవల్లి !


Also Read : జనసేనలో కోవర్టులెవరు ? పవన్ వార్నింగ్‌లతో జనసేన నుంచి వెళ్లే వాళ్లు ఎంత మంది ?