Three Capitals :   ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటు పై ఆ రాష్ట్ర శాసనసభకు స్ప‌ష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ వైఎస్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి   రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రం చెబుతోంది. దీనిపై మరింత స్పష్టత కోరుతూ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్దంగా తిరుగులేని అధికారం కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్‌ 3ఏ ని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ప్రవేశ పెట్టిన బిల్లు కారణంగా మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్‌సీపీ పట్టుదలగా ఉందని చెప్పుకుంటున్నారు. కానీ అసలు విషయం మాత్రం..  పార్లమెంట్‌లో ఆ బిల్లు సంగతి తేలే వరకూ ఇక  మూడు రాజధానుల గురించి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేదనే సంగతిని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 


మూడు రాజధానుల బిల్లు మరోసారి అసెంబ్లీలో పెట్టే అవకాశం కోల్పోయిన ఏపీ ప్రభుత్వం !


వచ్చే అసెంబ్లీ సమవేశాల్లో మరోసారి మూడు రాజధానుల బిల్లు పెడతామని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి అమర్నాథ్ పలుమార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాష్ట్రాలకు ఒకటి మించి రాజధానులను ఏర్పాటు చేసుకునే విధంగా హక్కును ఇస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని ఒక ప్రైవేటు బిల్లుని ప్రవేశపెట్టారు . దీంతో  మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు అవకాశం లేదని , ఆ హక్కు లేదని  రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్‌సీపీ అంగీకరించినట్లయింది. అంటే.. ఈ బిల్లు సంగతి తేలే వరకూ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం సాంకేతికంగా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే.. రాష్ట్రానికి ఆ అధికారం లేదని వైఎస్ఆర్‌సీపీనే అంగీకరించి రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 


ప్రైవేటు బిల్లులు చట్టమవడం సాధ్యమవుతుందా ?


పార్లమెంట్ చరిత్రలో ప్రైవేటు బిల్లులు చట్టంగా మారిన సందర్భాలు దాదాపుగా లేవు. ఒక వేళ అది ప్రజలకు అత్యవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా తీసుకుని స్వయంగా బిల్లు పెడుతుంది. అంతే కానీ సభ్యులు ప్రైవేటుగా పెట్టే బిల్లులు ఎప్పుడూ చట్టాలుగా మారవు. అదే సమయంలో ఈ అంశంపై చర్చ జరగడానికి మాత్రం ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశ పెట్టినందున చర్చ జరిపి ఓటింగ్‌పై రాజ్యసభ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే పార్లమెంట్లో ఇలాంటి ప్రైవేటు  బిల్లులు చాలా వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. విజయసాయిరెడ్డి పెట్టిన బిల్లు ఎప్పుడు చర్చకు వస్తుందో చెప్పడం కష్టం. అప్పటి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడం సాధ్యం కాదు.


రాజ్యాంగ సవరణ అసాధ్యం!


విజయసాయిరెడ్డి పెట్టింది రాజ్యాంగ సవరణ బిల్లు. మామూలు బిల్లు వేరు.. రాజ్యాంగ సవరణ  బిల్లు వేరు. రాజ్యాంగ సవరణకు మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి. కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వమే ఈ స్థాయి మద్దతు కూడగట్టడం సాధ్యం కాదు. మరి విజయసాయిరెడ్డి కూడగట్టలరా అంటే.. సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. 


మూడు రాజధానులు సాధ్యం కావనే వ్యూహాత్మకంగా ఆటంకాలు సృష్టించుకుంటున్నారా ?


ఇప్పటి వరకూ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్‌కు చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజధాని నిర్మించి తీరాలని హైకోర్టు స్పష్టమన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఇంకా సవాల్ చేయలేదు. చేస్తుందో లేదో స్పష్టత లేదు. న్యాయ పరమైన వెసులుబాటు మూడు రాజధానులకు లేదు. అంటే చట్టం కూడా మళ్లీ చేయలేరు.పైగా రైతులు వేసిన పిటిషన్లపై ఇంకా విచారణ జరుగుతోంది.ఈ కోణంలోనూ బిల్లు పెట్టలేరు. అంటే ఇప్పుడు ఇంక పార్లమెంటు నిర్ణయం ప్రకారమే ఏదైనా జరుగుతుంది. అప్పటి వరకూ మూడు రాజధానుల అంశం పక్కన పడినట్లే.