Karunanidhi vs Jayalalithaa New Political Version: తమిళనాట దశాబ్దాల నాటి కరుణానిధి వర్సెస్ జయలలిత శైలి పగ, ప్రతీకార రాజకీయం కొత్త రూపంలో పునరావృతమవుతోందనే చర్చ నెట్టింట, పొలిటికల్ సర్కిళ్లలో తీవ్రంగా సాగుతోంది. దీనికి కారణం ఉదయనిధిని విజయ్ ప్రభుత్వం అరెస్టు చేయించడం. బయట వేదికలపై ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం, కేసులు, రాత్రికి రాత్రి అరెస్టులతో ఉద్రిక్తతలు పెంచడం చూస్తుంటే ఇద్దరు బద్దశత్రువులైన నాయకులు తలపడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దళపతి విజయ్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌లు ఇద్దరూ చిన్ననాటి క్లాస్‌మేట్స్. చెన్నైలోని ప్రతిష్టాత్మక డాన్ బోస్కో పాఠశాలలో ఒక్కటిగా చదువుకున్న పాత మిత్రులే నేడు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. విజయ్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఉదయనిధి
సినిమా రంగంలో ఉన్న కాలం నుంచే వీరిద్దరి మధ్య అద్భుతమైన వ్యాపార అనుబంధం ఉంది. ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా విజయ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల పంపిణీ బాధ్యతలను ఏళ్ల తరబడి సమర్థవంతంగా నిర్వహించారు. అటువంటి మిత్రులు నేడు చెన్నై వేదికగా అధికారం, ప్రతిపక్ష హోదా అనే రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ ముఖాముఖి తలపడటం వెనుక వ్యక్తిగత వైషమ్యాల కంటే పక్కా పొలిటికల్ ఇంజనీరింగ్ దాగి ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎం.కె. స్టాలిన్ వ్యూహాత్మక సహకారంతో కూడిన వాతావరణం, అలాగే అన్నాడీఎంకే సైలెంట్ ప్లే లేకపోతే తమిళగ వెట్రి కళగం ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగేది కాదనేది బహిరంగ రహస్యం. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడిన నాయకత్వ శూన్యత, డీఎంకే పాలనపై కొంత వ్యతిరేకత వచ్చిన ప్రతిసారీ ఆ ఓటు బ్యాంకు బీజేపీ వైపో లేక ఇతరుల వైపో మళ్లకుండా ఉండేందుకు విజయ్ పార్టీ ఒక సేఫ్ ఆల్టర్నేటివ్ గా ఉపయోగపడింది. ఫలితంగానే రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉన్న డ్రావిడ పార్టీల ఆధిపత్య శైలి మారుతూ టీవీకే అధికార పీఠాన్ని అధిరోహించింది.
అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడమే టార్గెట్
బయటకు మాత్రం ఒకరిపై ఒకరు కేసులు పెట్టడం, మీడియా సాక్షిగా విమర్శనాస్త్రాలు సంధించుకోవడం వెనుక అన్నాడీఎంకే ను నిర్వీర్యం చేసే వ్యూహం కనిపిస్తోంది. సంప్రదాయక డ్రావిడ ఓటు బ్యాంకును, ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని అన్నాడీఎంకే , జాతీయ పార్టీలు చేజిక్కించుకోకుండా, వార్తల్లో ఎప్పుడూ విజయ్ వర్సెస్ ఉదయనిధి ట్రెండ్ అయ్యేలా ఈ రాజకీయ డ్రామా డిజైన్ అయిందనే వాదన బలంగా ఉంది. కేసులు, పోలీసుల విచారణల పేరుతో హడావుడి చేసి ప్రజల దృష్టిని కేవలం తమ ఇద్దరిపైనే కేంద్రీకరింపజేయడం ద్వారా మిగతా ప్రతిపక్షాలకు రాజకీయ స్థానం లేకుండా చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు , అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు, ఒకరి వ్యాఖ్యలపై మరొకరు చట్టపరమైన చర్యలకు దిగడం కేవలం కంటితుడుపు చర్యగా ప్రారంభమైనా, క్షేత్రస్థాయిలో ఉన్న అభిమానులు, శ్రేణులలో మాత్రం తీవ్ర భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. తమిళనాడు రాజకీయం ఎప్పుడూ వ్యక్తిగత ఇమేజ్, సెంటిమెంట్ లపై ఆధారపడి నడుస్తుంది. దాంతో, ఈ స్నేహపూర్వక పోరు చివరకు కంట్రోల్ తప్పి నిజమైన రాజకీయ శత్రుత్వంగా మారుతుందా అనే అనుమానం కూడా తెరపైకి వస్తోంది.
స్నేహం ..శత్రుత్వంగా మారుతుందా?
తమిళనాడు రాజకీయ రంగస్థలంపై ప్రస్తుతం నడుస్తున్న విజయ్ వర్సెస్ ఉదయనిధి ఎపిసోడ్ దశాబ్దాల నాటి డ్రావిడ సెంటిమెంట్‌కు సరికొత్త డిజిటల్ వెర్షన్. ఈ పొలిటికల్ అండ్ ఫ్రెండ్‌షిప్ డ్రామా ద్వారా తమిళగ వెట్రి కళగం తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, డీఎంకే తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అన్నాడీఎంకే, బీజేపీ వంటి పార్టీలను ప్రధాన స్రవంతికి దూరంగా ఉంచడంలో ఈ పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి!
