చిత్తూరు జిల్లా నగరి ( Nagari ) నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మరో హీరోయిన్ పోటీకి వస్తున్నారు. ఆమె వాణి విశ్వనాథ్. తమిళనాడుకు చెందిన వాణి విశ్వనాథ్ ( Vani Viswanadh ) . తన పూర్వికులు నగరికి చెందిన వారని చెబుతున్నారు. అందుకే నగరిలో పర్యటించారు.  కొంత మంది కౌన్సిలర్లు.. ఇతర అనుచరులతో కలిసి ఒకటిలో వార్డులోని సమాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆమె తన రాజకీయ ఆలోచనలు వెల్లడించారు. తన  మేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయా న్ని చూసి సహించలేక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడినట్లు చెప్పారు. నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పనిచేశారని, ఈ ప్రాంత వాసులు తమకు సుపరిచితులన్నారు. 


నగరిలో తమిళ, సంస్కృతి ఉందని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసి ప్రజా సమస్యల పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమని ప్రకటించారు.  నగరిలో ఉన్న తమిళులు ఎంతో ఆదరిస్తున్నారని… అంటున్నారు. వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. పోటీ చేస్తాను కానీ ఏ పార్టీ అనేది చెప్పలేనంటున్నారు. అంతే కాదు… ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే.. తాను ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానంటున్నారు. 


 వాణి విశ్వనాథ్ ఇలా రాజకీయ ప్రకటనలు చేయడంఇదే మొదటిసారి కాదు. గతంలో  టీడీపీలో ( TDP ) చేరేందుకు ప్రయత్నించారు.  కానీ చివరి క్షణంలో ఆమె చేరిక వాయిదా పడింది. తర్వాత ఆమె సైలెంటయిపోయారు.  ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో వాణి విశ్వనాథ్ ఈసారి నేరుగా నగరిలోకి రంగంలోకి దిగారు. నగరిలో పర్యటించడం ప్రారంభించారు. అయితే ఆమె వెనుక టీడీపీ ఉందా లేదా అన్నదానిపై స్పష్టతలేదు. అయితే ఆమె ఇండిపెండెంట్‌గా అయినా పోటీకి సిద్ధమని చెబుతున్నారంటే... ఏదో ఓ పార్టీ ప్రోత్సాహం ఉంటుందని భావిస్తున్నారు. 


నగరిలో తమిళ ఓటర్లు ( Tamil Voters ) గెలుపు ఓటములను తేల్చే స్థాయిలో ఉన్నారు. రోజా ( ROja ) భర్త  సెల్వమణికి ( Selvamani ) తమిళ ఓటర్లలో పలుకుబడి ఉంది. ఈ కారణంగా తమిళుల ఓట్లు రోజాకు వస్తున్నాయి. ఆమె గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాణి విశ్వనాథ్ రంగంలోకి రావడం రోజా వర్గీయుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. రోజాకు సొంత పార్టీలో అసంతృప్తులుఎక్కువయ్యారు. వారిలో ఎవరైనా వాణి విశ్వనాథ్‌ను ప్రోత్సహిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నాయి.