TVK vijay Special focus on 25 seats: తమిళనాడు ఎన్నికల పోలింగ్ గంటల్లోకి వచ్చేసింది.  రాజకీయ పార్టీలు పరిస్థితుల్ని విశ్లేషించుకుని తుది వ్యూహాలు ఖరారు చేసుంటున్నాయి. ఈ క్రమంలో తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ తన వ్యూహాన్ని సమూలంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, అంచనాలల ప్రకారం విజయ్ ఒక స్పష్టమైన ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు.   ఎంజీఆర్, జయలలిత తరహాలో తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం ప్రస్తుత సామాజిక సమీకరణాల్లో సాధ్యం కాదని ఆయన గ్రహించారు. అందుకే  ప్లాన్ ఏ నుంచి  ప్లాన్   వైపు తన దృష్టిని మళ్లించి, తమిళ రాజకీయాన్ని ఒక కొత్త మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Continues below advertisement

మెజార్టీకి గండి కొట్టే వ్యూహం

తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల ఆధిపత్యానికి గండి కొట్టడమే విజయ్ తక్షణ లక్ష్యం. రెండు ప్రధాన కూటములకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్పష్టమైన మెజార్టీ రాకుండా చేయగలిగితే, తను గెలిచే కొన్ని స్థానాలే రాష్ట్ర భవిష్యత్తును శాసిస్తాయని ఆయన నమ్ముతున్నారు. కనీసం 20 నుండి 25 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తే, ఏ కూటమి అధికారంలోకి రావాలన్నా టీవీకే మద్దతు తప్పనిసరి అయ్యేలా పరిస్థితులు కల్పించడం విజయ్ అసలు వ్యూహం.

Continues below advertisement

ఎంపిక చేసిన నియోజకవర్గాలపైనే ఫోకస్

విజయ్ తన ప్రచార శైలిని కూడా చాలా తెలివిగా మార్చుకున్నారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో తిరిగి శక్తిని వృధా చేసుకోవడం కంటే, గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాలపైనే తన కేంద్రీకరణ పెంచారు. దాదాపు సగం నియోజకవర్గాల్లో ఆయన కనీసం పర్యటించలేదు. ప్రధానంగా చెన్నై శివారు ప్రాంతాలు, ఉత్తర తమిళనాడులోని పట్టణ ఓటర్లపై ఆయన గట్టి నమ్మకం పెట్టుకున్నారు. యువత, మొదటిసారి ఓటు వేసే వారి ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల విజయ్ టీవీకే గట్టి పోటీ ఇస్తుందని తమిళ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నార్త్ తమిళనాడు.. విజయ్ కి కలిసి వచ్చేనా?

తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో వన్నియార్ సామాజిక వర్గం , దళిత ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఇక్కడ పీఎంకే, వీసీకే లాంటి పార్టీల పట్టును చీల్చడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని విజయ్ భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న అభిమాన సంఘాల నెట్‌వర్క్ బలమైన క్యాడర్‌గా మారింది. రెండు ప్రధాన ద్రావిడ పార్టీలపై ఉన్న అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడంలో విజయ్ కొంతవరకు సఫలమవుతున్నారని భావిస్తున్నారు. 

కింగ్ మేకర్ పాత్రలో సరికొత్త రాజకీయం

ప్రస్తుతానికి విజయ్ లక్ష్యం ముఖ్యమంత్రి పదవి కాదు, అసెంబ్లీలో  నిర్ణయాత్మక శక్తి గా ఎదగడం. ఒకవేళ హంగ్ ఏర్పడితే, ఏ కూటమికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఆయన దగ్గర స్పష్టమైన షరతులు ఉండే అవకాశం ఉంది. తన మద్దతు కావాలంటే తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని లేదా ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అంటే, ప్రత్యక్షంగా పాలించకపోయినా, పరోక్షంగా అధికారాన్ని నియంత్రించే  కింగ్ మేకర్  పాత్రను విజయ్ పోషించబోతున్నారు.

విజయ్ తన బలాన్ని, బలహీనతను గుర్తించి చాలా ప్రాక్టికల్ గా వ్యవహరిస్తున్నారు. భావోద్వేగాలతో కాకుండా గణాంకాలతో రాజకీయం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఒకవేళ హంగ్ దిశగా వెళ్తే, సెయింట్ జార్జ్ కోటలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించే రిమోట్ కంట్రోల్ విజయ్ చేతుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టే దిశగా ఆయన వేస్తున్న ఈ  ప్లాన్ బి  ఎంతవరకు పారుతుందో చూడాలి.