తెలంగాణలో కొన్నేళ్లుగా బీజేపీలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరి రాజకీయం నడుస్తోంది. మొదట్లో రఘునందన్‌రావు పేరు మారుమోగింది. అంతే ఉపఎన్నికల వచ్చాయి. ఆయన విజయం సాధించారు. తర్వాత ఈటల వంతు వచ్చింది. అలా మొదలైంది ఈ సీజనల్‌ పాలిటిక్స్‌. 


ఈటల, రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత?
సీజన్ల వారీగా వలసలను ప్రోత్సహిస్తోంది భారతీయ జనతాపార్టీ. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత ఈటలకు కండువా కప్పిన కమలదళం ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాను ఎంచుకుంది. కాంగ్రెస్ పార్టీలోని కీలక నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తమవైపు తిప్పుకుంది. ఈసారి కమల దళపతులు ఖమ్మం జిల్లాపై గురిపెట్టారు. అధికార పార్టీలోని కీలక నేతలకు గాలమేశారు. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు భారీ చేరికలు ఉండేలా స్కెచ్ వేశారు. 


కురుక్షేత్రానికి తాను సిద్ధమని పొంగులేటి ప్రకటన


మునుగోడు ఎన్నికల అయిపోగా... ఖమ్మంపై ఫోకస్ పెట్టింది కాషాయదళం. అసంతృప్తితో ఉన్న పొంగులేటిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా కాలంగా బీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గులాబీ పార్టీలో అన్యాయం జరిగిందని ఆయన ఇటీవల చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఆగ్రహించిన గులాబీ హైకమాండ్ ఆయనకు ప్రభుత్వం భద్రత కుదించడం, ఎస్కార్ట్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారు దిగి కమలం గూటికి చేరుతారనే ప్రచారానికి బలం చేకూరింది.


ఆదివారం ఖమ్మంలో రైట్ చాయిస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పొంగులేటి తన మనసులోమాట బయట పెట్టారు. రాబోయే రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రానికి తాను సిద్ధంగా ఉన్నాని కుండబద్దలు కొట్టారు. ప్రజల అభిమానం ఉన్నవాడే అసలైన నాయకుడని... తనకు పదవి లేకపోయినా ప్రజాభిమానం ఎంతో ఉందన్నారు. 


ఖమ్మం గుమ్మంలో భారీ సభకు బీజేపీ ప్లాన్


పొంగులేటితో ఏకంగా బీజేపీ ఢిల్లీ పెద్దలే రంగంలోకి సంప్రదింపులు జరుపుతున్నారు. ఈనెల 19న ఢిల్లీలో ప్రధాని మోదీ., కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. మోదీ, అమిత్ షా సమక్షంలో పొంగులేటి కమల దళంలో చేరిపోనున్నారు. మోదీ, అమిత్ షాలతో సమావేశం తర్వాత ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభకు పొంగులేటి ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులతో భేటీ కానున్నారు.  


పొంగులేటితో పాటు చేరే నాయకులెవరు?


మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కూడా నెమ్మదిగా బీజేపీ వైపు చూస్తున్నట్టు పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.
పొంగులేటితోపాటు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా దయానంద్,పిడమర్తి రవి కూడా చేరుతారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. మధిర నియోజకవర్గం నుంచి కోటా రాంబాబు, బొమ్మెర రామ్మూర్తి, మెండెం కిరణ్ కుమార్. పినపాకనియోజకవర్గం నుంచి పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గం నుంచి తెల్లం వెంకట్రావ్, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, వైరా నుంచి బొర్ర రాజశేఖర్, సుతకాని జైపాల్, పాలేరు నుంచి మద్దినేని బేబీ స్వర్ణకుమారి కూడా కమల తీర్థం పుచ్చుకుంటారని టాక్ వినిపిస్తోంది. కానీ ఎవరూ ఇప్పటి వరకు నిర్దారించలేదు. బీజేపీ అనే సరికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నట్టు కూడా లోకల్‌గా చెప్పుకుంటున్నారు.  


ఖమ్మంలోనే బీఆర్ఎస్ తొలి మహాసభ
ఈనెల 18న ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ మహాసభను నిర్వహించాలని గులాబీ దళపతి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు ఖమ్మం కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వంద ఎకరాల మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత తొలి బహిరంగ సభకు లక్షమందికి పైగా జన సమీకరణ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ సభ నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తుండటంతో కేడర్ లో ధైర్యం నూరిపోసేందుకు ఉన్నట్టుంది సభా వేదికను ఖమ్మంకు మార్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించారట.


నెక్స్ట్‌ ఎవరు?


పొంగులేటి బీజేపీలో చేరిన తర్వాత ఖమ్మంలో ఇంకా ఎవరిపై ఫోకస్ పెట్టనున్నారని ఆసక్తి నెలకొంది. ఖమ్మం రాజకీయాల్లో ఉండే కీలక నేతను కూడా పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఖమ్మం పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. దీనిపై ఇరు వర్గాలు మాట్లాడకపోయినా... ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.