తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఓ చార్టెర్డ్ ఫ్లైట్ (ప్రత్యేక విమానం) కొనుగోలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందు కోసం ఏకంగా రూ.80 కోట్లను వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధపడింది. 12 సీట్లతో కూడిన ఈ విమానం కోనుగోలుకు సంబంధించి దసరా పర్వదినాన ఆర్డర్ ఇవ్వనుందా పార్టీ. ఈ విమానం కొనుగోలుకు అవసరమైన నిధులను విరాళాల ద్వారా సేకరించాలని కూడా ఆ పార్టీ తీర్మానించింది. ఈ క్రమంలో విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే... సొంత విమానం కలిగిన రాజకీయ పార్టీగా టీఆర్ఎస్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది.
దసరా రోజున (అక్టోబర్ 5) టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంతోపాటు పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే దేశ రాజకీయాల్లోకి పార్టీకి ప్రవేశం కల్పిస్తూ పార్టీకి కొత్త పేరు ప్రకటిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ పేరు ప్రకటన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు పార్టీ నుంచి ఆర్డర్ వెలువడనున్నట్లు సమాచారం. పార్టీ ఖజానాలో ఇప్పటికే రూ.865 కోట్ల మేర నిధులు ఉన్నా... విమానం కొనుగోలుకు మాత్రం విరాళాలు సేకరించాలని ఆ పార్టీ నిర్ణయించడం గమనార్హం.
2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రమంతా తిరిగారు. ఆయన పాల్గొనాల్సిన సభలు ఎక్కువగా ఉండడంతో రోజుకి నాలుగు ఐదు చోట్ల కూడా హెలికాప్టర్లో వెళ్లారు అలా ఆయన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆ పార్టీ నేతలు చెబుతారు. కేసీఆర్ మాట వ్యవహార శైలి ఆయన వాడే పదాలు బహిరంగ సభల్లో అందరినీ ఆకట్టుకుంటాయనిది ఆ పార్టీ నేతల నమ్మకం.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక చోట్ల కెసిఆర్ బహిరంగ సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని కార్మిక కర్షక వర్గాల నేతలు కలుసుకునేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం ఈ ప్రత్యేక విమానం ఉపయోగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నేత ఇప్పుడు దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా సాధ్యమైనంత వరకు పెద్దకూటమినే తయారు చేయాలనే లక్ష్యంగా ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అత్యంత ధనిక పార్టీగా కూడా టిఆర్ఎస్ ఆవిర్భవించింది.