TRS Vs YSRCP : తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అవసరం లేకపోయినా వైఎస్ఆర్‌సీపీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతం నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఉన్నా.. ఇటీవలి కాలంలో జోరు పెరిగింది. ప్రతీ దానికి తెలంగాణతో పోల్చి ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటున్నారు. ఓ సారి కేటీఆర్ చేసిన " నరకం " వ్యాఖ్యలు కలకలం రేపాయి. స్వయంగా కేసీఆర్‌తో పాటు మరికొంత మంది ఏపీ పాలనపై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేశారు. తాజాగా మరో మంత్రి జగన్‌ను బలహీన సీఎం అని తేల్చేశారు. అయితే టీఆర్ఎస్ విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ పెద్దగా స్పందించడం లేదు. సంచలనం అయినప్పుడు మాత్రమే .. ఏదో పొరపాటున అని ఉంటారని అంటున్నారు కానీ.. టీఆర్ఎస్ నేతలపై పైర్ కావడం లేదు.
జగన్ బలహీన సీఎం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శ !
మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఏపీలో ఉన్న మోడీకి భయపడే ముఖ్యమంత్రి అని.. అందుకే కేంద్రం చెప్పినవన్నీ చేస్తున్నారని.. కానీ తెలంగాణలో మాత్రం స్ట్రాంగ్ ముఖ్యమంత్రి ఉన్నారంటున్నారు. కేసీఆర్ గట్టిగా ఎదురు తిరిగి నిలబడటం వల్లనే మోటార్లకు మీటర్లు రాలేదన్నారు. జగన్ లొంగిపోవడం వల్లనే అక్కడి రైతులకు మీటర్లు వస్తున్నాయని తేల్చేశారు. ఇటీవల మోదీ రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు పర్యటించారు. ఏపీలో వైఎస్ఆర్‌సీపీనే ..బీజేపీ సభ విషయంలో బాధ్యత తీసుకుంది. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసింది. సభలో సీఎం జగన్ .. మోదీని పదే పదే సార్ సార్ అంటూ సంబోధించారు. కేంద్రం చెబుతున్న సంస్కరణలన్నీ అమలు చేస్తున్నారు. ఈ కారణంగానే కొప్పుల ఈశ్వర్ ఈ అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
జగన్ సర్కార్‌ను విమర్శించడంలో హరీష్ రావు ఎప్పుడూ ముందే !
హరీష్ రావు ఏపీ పాలనను విమర్శించడంలో ఎప్పుడూ ముందుంటారు. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని చెప్పేందుకు ఏపీనే ప్రతీ సభలోనూ ఉదాహరణగా చూపించారు. కరెంట్ అంశంలోనూ అదే విధమైన విమర్శలు చేశారు. తిరుపతికి వెళ్లినప్పుడు కొంత మంది రైతులతో మాట్లాడానని.. వారు కరెంట్ రాక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారని పలుమార్లు చెప్పారు. ఇక టీచర్ల సమావేశంలో ఏపీలో టీచర్లు పీఆర్సీ ఇవ్వాలని అడిగితే కేసులు పెట్టారని.. కానీ తెలంగాణలో మాత్రం డబుల్ పీఆర్సీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌ను కాళేశ్వరంతో పోల్చారు. పోలవరం ప్రాజెక్ట్ మరో ఐదేళ్లయినా పూర్తి కాదని.. కానీ కాళేశ్వరంను ప్రారంభించి పూర్తి చేశామని గుర్తు చేశారు.
ఏపీలో పోల్చిస్తే సులువుగా తమ విజయాలకు గుర్తింపు వస్తుందనే వ్యూహం !
కేసీఆర్ కూడా పలుమార్పు ఏపీలో పరిస్థితులపై డైరక్ట్‌గానే కామెంట్లు చేశారు. ఏపీ అంధకారంలో ఉందన్నారు. కేటీఆర్ కూడా అంతే. ఇతర మంత్రులూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏపీతో పోల్చి.. తెలంగాణలో మెరుగైన అభివృద్ది ఉందని చెప్పుకోవడమే. ప్రతి విషయంలోనూ పోలికలు పెట్టి తెలంగాణతో పోల్చి అక్కడ ఎంత దారుణంగా ఉందో చూడండి.. తెలంగాణలో మాత్రం అలా లేదు అని చూపిస్తూ వస్తున్నారు.
ఘాటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్న వైఎస్ఆర్సీపీ !
అయితే టీఆర్ఎస్ విషయంలో వైఎేస్ఆర్‌సీపీ ఘాటుగా బదులు ఇవ్వలేకపోతోంది. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్లు మాట్లాడినప్పుడు అసలు నోరు తెరవడం లేదు. హరీష్ రావు ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అయితే ఆ వ్యాఖ్యలపైనా టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తర్వాత వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి కౌంటర్ ఆగిపోయింది. అందుకే తాజాగా జగన్‌ను బలహీన ముఖ్యమంత్రి అని టీఆర్ఎస్ మంత్రి తేల్చేశారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్‌సీపీ నేతలు స్పందించలేదు.