Senior TDP leaders have not been finalized :   తెలుగుదేశం, జనసేన ఉమ్మడి జాబితాలో  తెలుగు దేశం పార్టీ సీనియర్లకు  చోటు దక్కలేదు  వీరిలో చాలా మంది సీట్ల విషయంలో చేరికలు.. ఇతర అంశాలను సర్దుబాటు చేయాల్సి ఉండటంతో ఆపినట్లుగా తెలుస్తోంది. కొంత మందికి టిక్కెట్లు నిరాకరించే అవకాశం ఉంది.  ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ స్థానంలో గతంలో పలు దఫాలు ప్రాతినిథ్యం వహించిన యరపతినేని శ్రీనివాసరావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు.  వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పిన జంగా కృష్ణమూర్తి తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ చేరికలు పూర్తయిన తర్వాత ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉంది.  నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పిన లావు కృష్ణదేవరాయలు కూడా టీడీపీలో చేరనున్నారు.  


రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రాజమండ్రి రూరల్ నుండి  జనసేన పోటీ చేయనుందనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై సాగుతున్న ప్రచారంపై  క్యాడర్ అధైర్యపడవద్దని  గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సీటు విషయంపై టీడీపీ, జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎవరి సిట్టింగ్ సీట్లు వారు తీసుకోవాలని నిర్ణయించడంతో  అది టీడీపీకే దక్కనుంది. అందుకే ఆ సీటు ఆశిస్తున్న కందుల దుర్గేష్ కు సర్ది చెప్పాల్సి ఉన్నందున.. ప్రస్తుతానికి  ప్రకటన నిలిపివేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  గతంలో సర్వేపల్లి నుండి ప్రాతినిథ్యం  వహించారు. అయితే  తొలి జాబితాలో  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చోటు దక్కలేదు. వెల్లూరు జిల్లాలో కీలకమైన చేరికలు ఉన్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిన తర్వాత ఇతర విషయాలను ఖరారు చేయనున్నారు. 


మరోవైపు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుండి  మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ కోరింది.  అయితే ఈ విషయమై  తన ఆలోచనను పార్టీ నాయకత్వానికి చెబుతానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.  . ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి అసెంబ్లీ స్థానం నుండి పోటీకి  గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం లేకపోలేదు. పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాకపోవడంతో  గంటా శ్రీనివాసరావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు.   దెందులూరు అసెంబ్లీ స్థానం నుండి గతంలో చింతమనేని ప్రభాకర్ కు తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఈ సారి ఆయన భార్యను బరిలోకి దింపే ఆలోచన ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.  


మైలవరం అసెంబ్లీ స్థానం నుండి గతంలో  దేవినేని ఉమ మహేశ్వరరావు తెలుగు దేశం పార్టీ నుండి ప్రాతినిథ్యం వహించారు. అయితే  మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్  తెలుగు దేశం పార్టీలో  చేరుతారనే ప్రచారం సాగుతుంది. దీంతో  దేవినేని ఉమ పేరును  తొలి జాబితాలో చోటు దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కళా వెంకట్రావు సహా మరికొంత మంది సీనియర్లకు జాబితాలో చోటు దక్కలేదు.  టీడీపీ, జనసేనలు తొలి జాబితాలో  118 స్థానాల్లో  పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి. అయితే  మిగిలిన 57 స్థానాలున్నాయి.అయితే ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  ఈ నెల  28 నాటికి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని  తెలుగు దేశం వర్గాలు చెబుతున్నాయి.